భారత్-పాక్‌ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 14) హైఓల్టేజీ సమరం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. పాకిస్తాన్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.
బషీర్ చాచాకు లభించని అనుమతి..
ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన పాక్ వీరాభిమాని బషీర్ చాచా అలియాస్ చికాగో బషీర్‌కు స్టేడియంలోకి అనుమతి లభించలేదు. స్టేడియంలో లక్షకు పైగా భారత అభిమానులు ఉంటే, బషీర్ ఒక్కడే పాక్ అభిమాని ఉంటాడు కాబట్టి, భద్రతా సమస్యలు తలెత్తుతాయని పోలీసులు అతన్ని స్టేడియంలోపలికి అనుమతించలేదని తెలుస్తుంది. కాగా, బషీర్‌కు ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు స్టేడియంలోకి అనుమతి లభించింది.
అమెరికా పాస్‌పోర్ట్ కలిగి ఉండటంతో పాక్‌కు సంబంధించి ఒక్క బషీర్‌కు మాత్రమే భారత్‌లోకి ప్రవేశం లభించింది. పాక్ ప్రభుత్వం తమ జట్టును ఉత్సాహపరిచేందుకు తమ దేశానికి చెందిన అభిమానులను భారత్‌లోకి అనుమతించాలని కోరినప్పటికీ, భారత ప్రభుత్వం అందుకు తిరస్కరించింది.
పాక్‌లో పుట్టి అమెరికాలో స్ధిరపడ్డ బషీర్ 2003 నుంచి ఇప్పటివరకు వరకు పాక్ ఆడిన ఒక్క వరల్డ్‌కప్ మ్యాచ్ కూడా మిస్ కాలేదు. అలాంటిది బషీర్ 20 ఏళ్లలో తొలిసారి పాక్ ఆడుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌ను మిస్ అవుతున్నాడు.
ఇదిలా ఉంటే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (20) సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ (32), బాబర్ ఆజమ్ (15) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment