వందమందిని బందీలుగా తీసుకెళ్లి.. బాంబులు పేల్చి..
అక్కడో సంగీత కచేరీ జరుగుతోంది. ఆ హాల్లో అప్పటికి ఎక్కువ మంది లేరు. కానీ ఉగ్రవాదులు మాత్రం వేర్వేరు చోట్ల తాము పట్టుకున్న బందీలలో సుమారు వందమందిని అక్కడికి తరలించారు. ఒకేసారి బాంబులు పేల్చి ఆ హాల్లో ఉన్నవాళ్లను అందరినీ చంపేశారు. ఫ్రాన్స్ చరిత్రలోనే ఇంతవరకు కనీ వినీ ఎరుగని స్థాయిలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఎక్కువ మంది ఇక్కడే మరణించారు. ద బటాక్లాన్ అనే అత్యంత ప్రముఖ వేదిక వద్ద 'అమెరికన్ బ్యాండ్ ఈగిల్స్ ఆఫ్ డెత్ మెటల్' కచేరీ జరుగుతోంది. అక్కడే వీళ్లందరినీ చంపేసినట్లు ఫ్రెంచి న్యూస్ సర్వీస్ తెలిపింది. అత్యంత ప్రణాళికాబద్ధంగా చేసిన ఈ ఉగ్రవాద దాడులలో స్పోర్ట్స్ స్టేడియం వద్ద, మరో ఐదు ప్రధాన ప్రాంతాల వద్ద కాల్పులు, పేలుళ్లకు పాల్పడి మరికొన్ని డజన్ల మందిని హతమార్చారు.
దాదాపు ఏడాది క్రితం చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయం వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండ కంటే ఇది మరింత తీవ్రస్థాయిలో ఉంది. తాను ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుండగానే ఇంతకుముందెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఉగ్రవాద దాడులు జరిగాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ అన్నారు. అక్కడి నుంచి ఆయనను తరలించగానే అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించి, సరిహద్దులను మూసేస్తున్నట్లు ప్రకటించారు.