BBB
-
బ్యాంకులకు పూర్తి స్వయం ప్రతిపత్తి!
న్యూఢిల్లీ: మెరుగైన సామర్థ్యం, వ్యవస్థీకృత పటిష్టత వంటి అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తి అవసరమని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సూచించింది. బీపీ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్ టైమ్ డైరెక్టర్ల నియామక అత్యున్నత సంస్థ– బీబీబీ, మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. బ్యాంకింగ్ రుణ వ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొంది. రుణ వ్యయాలు మరింత తగ్గాలని, రుణ ఆమోదం, కేటాయింపులు, పంపిణీల విషయంలో బ్యాంకింగ్ సామర్థ్యం మెరుగుపడాలని సూచించింది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు ఉండాలని పేర్కొంది. మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలంలో ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాంకింగ్ హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకాలు జరిగాయని నివేదిక పేర్కొంటూ, సకాలంలో బీబీబీ ఇచ్చిన సిఫారసులు దీనికి కారణమని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్‌టైమ్ డైరెక్టర్లు అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలకు తగిన సిఫారసులు చేయడానికి నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులతో బీబీబీ ఏర్పాటుకు 2016లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డ్ డైరెక్టర్లతో చర్చించి, విలీనాలు సహా బ్యాంకింగ్ రంగ పురోగతికి తగిన వ్యూహ రూపకల్పనలోనూ బీబీబీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. -
అరుంధతీ కాదు: కొత్త చైర్మన్ ఈయనే
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంకు బోర్డు ఆఫ్ బ్యూరో (బీబీబీ)కి చైర్మన్‌గా భాను ప్రతాప్ శర్మను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం బీబీబీ మొట్టమొదటి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వినోద్ రాయ్ స్థానంలో డిపార్ట్మెంట్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాజీ డిప్యూటీ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మను ఎంపిక చేసింది. ఆయన పదివీకాలం రెండు సంవత్సరాలని ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సీనియర్ లెవల్ నియామకాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదనే మాటకుతాము కట్టుబడి ఉన్నామంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టాప్ మేనేజ్మెంట్ను ఎంపిక చేసేందుకు కొత్త బీబీబీలో విభిన్న నైపుణ్యాలతో కూడిన నిపుణులున్నారన్నారు. బీబీబీలో ఇతర సభ్యులు: వేదికా భండార్కర్ (మాజీ ఎండీ క్రెడిట్ సూయిస్ ఇండియా), పి ప్రదీప్ కుమార్ (మాజీ ఎండీ.ఎస్బీఐ), ప్రదీప్ పి.షా (వ్యవస్థాపకుడు, ఎండీ క్రిసిల్). కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనా వ్యవహారాలను మెరుగుపర్చేందుకు 2016లో ఈ బీబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ పదవికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఎంపిక కానున్నారని ఇటీవలి పలు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. -
మళ్లీ బ్యాంకింగ్ రంగంలోకి భట్టాచార్య
మాజీ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య మళ్లీ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎస్బీఐ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన ఈమెను, బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. వినోద్ రాయ్‌కి తదుపరి భట్టాచార్యను నియమించబోతున్నారు. ఇప్పటికే బోర్డు తదుపరి చైర్మన్ ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని రిపోర్టు తెలిపింది. ఆశ్చర్యకరంగా భట్టాచార్యను రఘురామ్ రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్‌గా నియమించే నలుగురు షార్ట్‌లిస్టెడ్ అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌ను నియమించారు. 1977లో ఎస్బీఐ చేరిన భట్టాచార్య, 2013 ఎస్బీఐకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ కూడా ఈమెనే. గతేడాది అక్టోబర్‌లో భట్టాచార్య ఎస్బీఐ నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమెను బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనను మెరుగుపరచడానికి 2016లో ఈ బీబీబీ ఏర్పాటైంది. దీనిలో చైర్మన్‌తో పాటు ముగ్గురు ఎక్స్-అఫిషియో మెంబర్లు, ముగ్గురు ఎక్స్పర్ట్ మెంబర్లు ఉంటారు. అందరూ సభ్యులు, చైర్మన్ కూడా పార్ట్‌టైమే. -
బ్యాంకులకు 10 వేల కోట్లు సరిపోతాయ్: రాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు రానున్న ఆర్థిక సంవత్సరం తాజా మూలధనంగా రూ.10,000 కోట్లు సరిపోతుందని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చీఫ్ వినోద్ రాయ్ గురువారంనాడు పేర్కొన్నారు. ఇక్కడ బంధన్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్కెట్ నుంచి మరిన్ని నిధుల సమీకరణకు రైట్స్ ఇష్యూకు కూడా అనుమతి ఉన్న నేపథ్యంలో 2017–18 సంవత్సరానికి రూ.10,000 కోట్ల మూలధనం సరిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్యాడ్ బ్యాంక్‌పై చెప్పలేం...! మొండిబకాయిల పరిష్కారం దిశలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనపై విభిన్న వాదనలు ఉన్నాయని అన్నారు. దీని అమలు ఇప్పటికి ప్రశ్నార్థకమేనని వెల్లడించారు. కాగా ఖాళీగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) సీఎండీ నియామకానికి ప్రభుత్వానికి బీబీబీ ఇప్పటికే తన ప్రతిపాదనలను పంపినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ప్రభుత్వ బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి: రాజన్
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపర్చాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నొక్కి వక్కాణించారు. ఈ బ్యాంకుల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లను, నాన్-అఫిషియల్ డైరెక్టర్లను నియమించే అధికారం బ్యాంకు బోర్డు బ్యూరో(బీబీబీ)కే వదిలివేయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను, ఇతర బోర్డు సభ్యులను ప్రభుత్వమే నియమిస్తూ వస్తోంది. భారత బ్యాంకుల్లో పాలన అంశాలను పరిశీలించేందుకు ఆర్బీఐ నియమించిన పీజే నాయక్ కమిటీ ప్రతిపాదనలకే రాజన్ కూడా మొగ్గుచూపుతూ వాటిని అమలుచేసే విధంగా సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనను, మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు సమాంతరంగా చర్యలు చేపట్టాలని రాజన్ చెప్పారు. ఎఫ్ఐసీసీఐ-ఐబీఏ బ్యాంకింగ్ సెమినార్లో రాజన్ మంగళవారం ప్రసంగించారు. బ్యాంకుల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లను, నాన్-అఫిషియల్ డైరెక్టర్లను నియమించే తుది నిర్ణయం బ్యాంకు బోర్డుకే వదిలివేయాలని, ఎంపిక ప్రక్రియలో బీబీబీ పూర్తి అనుభవం పొందిందని రాజన్ చెప్పారు. మాజీ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వినోద్ రాయ్ నేతృత్వంలో బీబీబీను ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియమించే ఎగ్జిక్యూటివ్‌ల అపాయింట్మెంట్లను బీబీబీ షార్ట్‌లిస్టు చేస్తుంది. అనంతరం దీనిపై తుదినిర్ణయం ప్రభుత్వం చేపడుతుంది. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో కొత్త బ్యాంకులు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికరంగంలో ఆసక్తి, లాభదాయకతతో పాటు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తీవ్రమైన పోటీ వాతావరణం నేపథ్యంలో ఆసక్తి, కొత్త టెక్నాలజీ, సమాచారం కొత్త బిజినెస్‌లకు, కస్టమర్లకు అవకాశంగా మారుతున్నందున్న లాభదాయకత, అనిశ్చిత పరిస్థితులను సైతం తట్టుకునే విధంగా ఛాలెంజింగ్ అవసరమని చెప్పారు.