Beautician course
-
మహిళలు ఇంటి వద్దే దర్జాగా.. ఆర్జించే మంచి ఆదాయ వనరు అది..
సాక్షి, రాజాం సిటీ: పట్టణాల్లో ఏర్పాటుచేసిన బ్యూటీ పార్లర్లు మగువల అభిరుచులకు తగ్గట్టు నిర్వహిస్తున్నారు. పట్టణం నుంచి పల్లె వరకు నేడు మహిళలు, చిన్నారులు సైతం అందంపైనే మక్కువ చూపుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న వేడుకలతోపాటు పెళ్లిళ్ల సీజన్లో నిశ్చితార్థం మొదలుకుని ఫొటోషూట్, పెళ్లి తంతు ముగిసే వరకు అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బ్రైడల్ మేకప్, శారీ డ్రాపింగ్, కేశాలంకరణలో ఎక్కడా మేకప్ విషయంలో రాజీపడడంలేదు. ఆదాయ వనరుగా.. బ్యూటీషియన్ కోర్సు చేసిన మహిళలకు ఇంటి వద్దే ఆదాయవనరు సమకూరుతోంది. ప్రతి నిత్యం ఐ బ్రో అందంగా తీర్చిదిద్దడంలో మెళకువలు పాటిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. మహిళల ఆసక్తి, అభిరుచి గమనించి బ్యూటీ పార్లర్లలో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. శరీరతత్వం, రంగు, వేడుకను బట్టి వారికి అమరేలా మేకప్ చేస్తున్నారు. మేకప్ రకం, వాడే మెటీరియల్ బట్టి పారితోషికం కూడా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇళ్లకు తీసుకువెళ్లి మేకప్ చేయించుకునేందుకు బ్యూటీషియన్లతో ముందుగానే మహిళలు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లి మేకప్ చేసేందుకు సైతం మెటీరియల్‌కు అనుగుణంగా రూ. 4 వేల నుంచి రూ. 10వేల వరకు రేట్లు నిర్ణయించి బ్యూటీషియన్స్ ఆదాయం సంపాదిస్తున్నారు. శిక్షణతో ప్రోత్సహిస్తున్న సంస్థలు.. మహిళలకు ఉపాధిమార్గాలు చూపేందుకు కొన్ని సంస్థలు బ్యూటీషియన్ కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. దీంతో మహిళలు కూడా ఆసక్తి కనబరిచి శిక్షణ పొందుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్లలో పనిచేసుకుంటూ చిన్న చిన్న చిట్కాలను, మెళకువలను నేర్చుకుంటూ సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. అభిరుచికి తగ్గట్టు.. జీఎంఆర్ నైరెడ్ సంస్థలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని సొంతంగా పార్లర్ నడుపుతున్నాను. పార్లర్‌కు వచ్చిన మహిళల అభిరుచికి తగ్గట్టు మేకప్ చేస్తుంటాం. వేడుకలు ఉన్నా లేకపోయినా కొందరు మహిళలు నెలకోసారి బ్యూటీ పార్లర్లకు వచ్చి ఫేషియల్ చేసుకుంటున్నారు. అందంగా ఉన్నామనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరుగుతోంది. యువతులు కాలానికి అనుగుణంగా మార్పు కోరుకుంటున్నారు. ఎక్కువ మంది ఫంక్షన్లకు అనుగుణంగా పార్లర్‌కు వచ్చి మేకప్ చేయించుకుంటున్నారు. మరికొంతమంది కోరికమేరకు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వీసు అందిస్తున్నాం. – టి.హైమావతి, బ్యూటీషియన్, ఆదిత్య బ్యూటీ పార్లర్, రాజాం. 1400 మందికి శిక్షణ.. జీఎంఆర్ నైరెడ్ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 1400 మందికి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ అందించాం. యువతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇదో చక్కని అవకాశం. పదో తరగతి చదివి ఖాళీగా ఉన్నవారందరినీ ఉపాధిమార్గం వైపు ప్రోత్సహిస్తున్నాం. ఇందులో భాగంగా అందిస్తున్న బ్యూటీషియన్ కోర్స్‌లో చేరి మెళకువలు తెలుసుకుంటున్నారు. సంస్థ స్థాపించిన తరువాత నిర్విరామంగా యువతకు ఉపాధి శిక్షణ ఉచితంగా అందిస్తున్నాం. – కె.శశిధర్, డైరెక్టర్, జీఎంఆర్ నైరెడ్, రాజాం. (చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!) -
ఇదో అందమైన దోపిడీ
సాక్షి,సిటీబ్యూరో: నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కార్పొరేషన్‌లోని కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి నిధులను బొక్కేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏటా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పలు వృత్తివిద్యా కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తారు. గత రెండేళ్లుగా పేద యువతులకు ఓ సంస్థ ద్వారా బ్యూటీషియన్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ ఏడాది 300 మందికి యువతులకు శిక్షణనిచ్చి నట్టు చెబుతున్నారు. కానీ సదరు సంస్థలో శిక్షణ పొందించి మాత్రం 100 మంది మాత్రమేనని ఆరోపణలున్నాయి. సరైన పరికరాలు లేని సంస్థలో శిక్షణ కార్పొరేషన్ ద్వారా ఉపాధి శిక్షణ ఇచ్చే సంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. లేదా కనీసం ఆ సంస్థకు శిక్షణలో పదేళ్ల అనుభవమైనా ఉండాలి. కానీ ఈ బ్యూటీషియన్ శిక్షణ సంస్థ విషయంలో అధికారులు నిబంధనలేవీ పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఆ సంస్థ వద్ద అత్యాధునిక పరికరాలు ఉన్నాయా? ట్రైనర్స్ ఎంత మంది ఉన్నారు? గతంలో ఆ సంస్థలో ఎంత మంది శిక్షణ పొందారు? తదితర విషయాలేవీ పట్టించుకోకుండానే అనుమతి ఇచ్చేశారని తెలిసింది. పైగా శిక్షణ సమయంలో అసలు ఉన్నతాధికారులు ఆ సంస్థను ఒక్కసారైనా తనిఖీ చేయలేదని శిక్షణ పొందిన వారు వాపోతున్నారు. ఒకొక్కరికి రూ.15 వేలు చెల్లింపు.. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఒక్కో యువతిపై మైనార్టీ కార్పొరేషన్ రూ.15 వేలు చొప్పున ఖర్చు చేసింది. వాస్తవానికి బయట ఎక్కడైనా బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందింతే కాలపరిమితిని బట్టి మూడు నెలలకు రూ.5 వేలు, ఒకటి, రెండు నెలలు అదనంగా ఉంటే రూ. 8 వేలకు తీసుకుంటారు. అయితే కార్పొరేషన్ సదరు శిక్షణ సంస్థకు రూ.15 వేలు ఎందుకు చెల్లించిందనే అంతుచిక్కని ప్రశ్న. పూర్తి వివరాలు తెలుసుకుంటాం నేను బాధ్యతలు చేపట్టడానికి ముందునుంచే బ్యూటీషియన్ శిక్షణ కొనసాగుతోంది. ఇంతకుముందు ఉన్న ఎండీ హయాంలోనే శిక్షణ సంస్థ ఎంపిక, ఫీజు చెల్లింపు నిర్ణయాలు జరిగాయి. నేను ఇంత వరకు సంస్థను సందర్శించలేదు. శిక్షణ వివరాలు తెలుసుకుంటాను. ఏమైనా అవకతవకలు జరిగితే వారిపై చర్యలు తీసుకుంటాను.– మహ్మద్ వహీద్, మైనారిటీ కార్పొరేషన్ ఎండీ -
బ్యూటీషియన్ కోర్సు.. ఉపాధి మార్గాలు
నిడమర్రు:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను చైతన్యం చేసి వారికి తగిన శిక్షణ అందించి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకునే లక్ష్యంతో ఆంధ్రాబ్యాంక్ ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ తరగతులను జిల్లా కేంద్రం ఏలూరులో నిర్వహిస్తున్నట్టు జయప్రకాష్‌నారాయణ ఆంధ్రాబ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంచాలకులు జె. షణ్ముఖరావు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆ సంస్థలో బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్ కోర్సులపై 1,200 మంది శిక్షణ పొందగా, 1,100 మంది వరకూ స్థిరపరపడినట్టు తెలిపారు. ఇదే కోర్సుపై 2018–19 సంవత్సరానికి మరో కొత్త బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ కొత్త బ్యాచ్ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందన్నారు. ఈ కోర్సు శిక్షణకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అభ్యర్థుల అర్హతలివే.. ♦ దరఖాస్తు చేసుకునే అవకాశం పశ్చిమగోదారి జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు మాత్రమే ♦ వయోపరిమితి: 18 నుండి 35 ఏళ్లలోపు ఉండాలి. ♦ విద్యార్హత: 10వ తరగతి ఆపై శిక్షణ కాలంలో సదుపాయాలు ఇలా.. ♦ శిక్షణకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ దూరప్రాంతాల నుంచి శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేస్తారు. ♦ హాస్టల్ అభ్యర్థులకు వారి గ్రామాల నుంచి ఒకసారి సంస్థకు రానుపోను ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. ♦ స్థానిక అభ్యర్థులకు కూడా మ««ధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పిస్తారు. ♦ శిక్షణ కాలమందు అవసరమగు సేవలు, మెటీరియల్ సంస్థచే ఉచితంగా అందిస్తారు. ♦ బ్యూటీషియన్ కోర్సుపై సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పైనా శిక్షణ ఉంటుంది. ప్రత్యేకతలు ఇవి ♦ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ♦ 30 రోజుల్లోనే బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్ నైపుణ్యంపై మెరుగైన శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు ఇలా.. ♦ ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు ఫోన్ ద్వారా/ఎస్ఎంఎస్/పోస్ట్ కార్డుద్వారా పే ర్లు, చిరునామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ♦ గతంలో పేర్లు నమోదు చేసుకున్నవారు, కొత్తగా అడ్మిషన్‌కు అర్హత సాధించినవారు వారి ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 3 ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది. శిక్షణ సంస్థ చిరునామా:జయప్రకాష్ నారాయణ్ ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ,వెలుగు ఆఫీస్ ప్రాంగణం/ఐటీఐ కాలేజీ దగ్గర ,సత్రంపాడు, ఏలూరు– 534 007ఫోన్ నంబర్స్: 08812–253 97598660 94383/94909 98882 బ్యూటీషియన్ కోర్సుకు మంచి డిమాండ్ ఈ శిక్షణ సంస్థను 2005లో ఏర్పాటు చేశాం. బ్యూటీషియన్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులో ఎక్కువమంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా సంస్థలో శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత యూనిట్ స్థాపించేం దుకు బ్యాంకు రుణం పొందుటలో అవసరమగు సలహాలు, సహాయ సహకారం మా బ్యాంక్ సిబ్బంది అందిస్తారు. – జె. షణ్ముఖరావు, సంచాలకులు,ఏబీఆర్ఎస్ఈటీఐ -
బ్యూటీషియన్ హత్య
వివాహేతర సంబంధం కొనసాగించేందుకు విముఖత హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రియుడి యత్నం గుంటూరు రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన శనివారం రాత్రి అడవితక్కెళ్ళపాడు గ్రామంలోని రాజీవ్‌గృహకల్పలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఆమెను హత్య చేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించడం గమనార్హం! ఈ ఘటనకు సంబంధించి నల్లపాడు పోలీసుస్టేషన్ సీఐ పూర్ణచంద్రరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. తెనాలికి చెందిన జయలక్ష్మి(32)కి నగరంలోని నేతాజీనగర్‌కు చెందిన పసుపులేటి శ్రీనివాసరావుతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. శ్రీనివాసరావు లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో జయలక్ష్మి నేతాజీనగర్‌లోనే అత్తమామల వద్దే ఉండేది. ఆమె మూడేళ్ల క్రితం బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొంది వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఇళ్ల వద్దకు వెళుతూ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లోని బ్యూటీపార్లర్లలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో నేతాజినగర్‌కు చెందిన కారుడ్రైవర్ రవీంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతనికి వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో రవీంద్ర, జయలక్ష్మిలు అడవితక్కెళ్ళపాడులోని రాజీవ్‌గృహకల్పలో ఏడాది క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీలున్నప్పుడల్లా అక్కడ గడిపివస్తున్నారు. ఈ విషయం జయలక్ష్మి బంధువులకు తెలిసి ఆమెను హెచ్చరించడంతో ఆమె వెనక్కుతగ్గింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రవీంద్ర జయలక్ష్మికి ఫోన్ చేసి రాజీవ్‌గృహకల్పకు రమ్మని కోరాడు. లారీ డ్రైవర్ అయిన ఆమె భర్త శ్రీనివాసరావు డ్యూటీ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లడంతో ఆమె రాజీవ్‌గృహకల్పకు వెళ్లింది. శుక్రవారం అక్కడే రవీంద్రతో గడిపి శనివారం జయలక్ష్మి ఇంటికి వచ్చింది. మళ్లీ రాజీవ్‌గృహకల్పకు ఆమె వెళ్లి రాత్రికి ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. ఆ సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించే విషయమై వారి మధ్య అర్ధరాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రవీంద్ర జయలక్ష్మి చున్నీతో ఆమె మెడకు బిగపట్టి హతమార్చాడు. అనంతరం ఇంటిలోని స్టాండ్ ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు నిందితుడు యత్నించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. జయలక్ష్మి ఆత్మహత్య చేసుకునేందుకు అక్కడ పరిస్థితులు వీలుగా లేకపోవడంతో చుట్టుపక్కల వారిని విచారించగా విషయం బయట పడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు.