బ్యూటీషియన్ హత్య | Beautician murder | Sakshi
Sakshi News home page

బ్యూటీషియన్ హత్య

Published Mon, Nov 2 2015 12:30 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

బ్యూటీషియన్ హత్య - Sakshi

బ్యూటీషియన్ హత్య

వివాహేతర సంబంధం కొనసాగించేందుకు విముఖత
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రియుడి యత్నం

 
గుంటూరు రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన శనివారం రాత్రి అడవితక్కెళ్ళపాడు గ్రామంలోని రాజీవ్‌గృహకల్పలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఆమెను హత్య చేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించడం గమనార్హం! ఈ ఘటనకు సంబంధించి నల్లపాడు పోలీసుస్టేషన్ సీఐ పూర్ణచంద్రరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. తెనాలికి చెందిన జయలక్ష్మి(32)కి నగరంలోని నేతాజీనగర్‌కు చెందిన పసుపులేటి శ్రీనివాసరావుతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. శ్రీనివాసరావు లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో జయలక్ష్మి నేతాజీనగర్‌లోనే అత్తమామల వద్దే ఉండేది.

ఆమె మూడేళ్ల క్రితం బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొంది వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఇళ్ల వద్దకు వెళుతూ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లోని బ్యూటీపార్లర్‌లలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో నేతాజినగర్‌కు చెందిన కారుడ్రైవర్ రవీంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతనికి వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో రవీంద్ర, జయలక్ష్మిలు అడవితక్కెళ్ళపాడులోని రాజీవ్‌గృహకల్పలో ఏడాది క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీలున్నప్పుడల్లా అక్కడ గడిపివస్తున్నారు. ఈ విషయం జయలక్ష్మి బంధువులకు తెలిసి ఆమెను హెచ్చరించడంతో ఆమె వెనక్కుతగ్గింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రవీంద్ర జయలక్ష్మికి ఫోన్ చేసి రాజీవ్‌గృహకల్పకు రమ్మని కోరాడు. లారీ డ్రైవర్ అయిన ఆమె భర్త శ్రీనివాసరావు డ్యూటీ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లడంతో ఆమె రాజీవ్‌గృహకల్పకు వెళ్లింది.

శుక్రవారం అక్కడే రవీంద్రతో గడిపి శనివారం జయలక్ష్మి ఇంటికి వచ్చింది. మళ్లీ రాజీవ్‌గృహకల్పకు ఆమె వెళ్లి రాత్రికి ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. ఆ సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించే విషయమై వారి మధ్య అర్ధరాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రవీంద్ర జయలక్ష్మి చున్నీతో ఆమె మెడకు బిగపట్టి హతమార్చాడు. అనంతరం ఇంటిలోని స్టాండ్  ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు నిందితుడు యత్నించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. జయలక్ష్మి ఆత్మహత్య చేసుకునేందుకు అక్కడ పరిస్థితులు వీలుగా లేకపోవడంతో చుట్టుపక్కల వారిని విచారించగా విషయం బయట పడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement