సాక్షి, రాజాం సిటీ: పట్టణాల్లో ఏర్పాటుచేసిన బ్యూటీ పార్లర్లు మగువల అభిరుచులకు తగ్గట్టు నిర్వహిస్తున్నారు. పట్టణం నుంచి పల్లె వరకు నేడు మహిళలు, చిన్నారులు సైతం అందంపైనే మక్కువ చూపుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న వేడుకలతోపాటు పెళ్లిళ్ల సీజన్‌లో నిశ్చితార్థం మొదలుకుని ఫొటోషూట్, పెళ్లి తంతు ముగిసే వరకు అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బ్రైడల్ మేకప్, శారీ డ్రాపింగ్, కేశాలంకరణలో ఎక్కడా మేకప్ విషయంలో రాజీపడడంలేదు.
ఆదాయ వనరుగా..
బ్యూటీషియన్ కోర్సు చేసిన మహిళలకు ఇంటి వద్దే ఆదాయవనరు సమకూరుతోంది. ప్రతి నిత్యం ఐ బ్రో అందంగా తీర్చిదిద్దడంలో మెళకువలు పాటిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. మహిళల ఆసక్తి, అభిరుచి గమనించి బ్యూటీ పార్లర్లలో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. శరీరతత్వం, రంగు, వేడుకను బట్టి వారికి అమరేలా మేకప్ చేస్తున్నారు. మేకప్ రకం, వాడే మెటీరియల్ బట్టి పారితోషికం కూడా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇళ్లకు తీసుకువెళ్లి మేకప్ చేయించుకునేందుకు బ్యూటీషియన్లతో ముందుగానే మహిళలు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లి మేకప్ చేసేందుకు సైతం మెటీరియల్‌కు అనుగుణంగా రూ. 4 వేల నుంచి రూ. 10వేల వరకు రేట్లు నిర్ణయించి బ్యూటీషియన్స్ ఆదాయం సంపాదిస్తున్నారు.
శిక్షణతో ప్రోత్సహిస్తున్న సంస్థలు..
మహిళలకు ఉపాధిమార్గాలు చూపేందుకు కొన్ని సంస్థలు బ్యూటీషియన్ కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. దీంతో మహిళలు కూడా ఆసక్తి కనబరిచి శిక్షణ పొందుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్లలో పనిచేసుకుంటూ చిన్న చిన్న చిట్కాలను, మెళకువలను నేర్చుకుంటూ సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు.
అభిరుచికి తగ్గట్టు..
జీఎంఆర్ నైరెడ్ సంస్థలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని సొంతంగా పార్లర్ నడుపుతున్నాను. పార్లర్‌కు వచ్చిన మహిళల అభిరుచికి తగ్గట్టు మేకప్ చేస్తుంటాం. వేడుకలు ఉన్నా లేకపోయినా కొందరు మహిళలు నెలకోసారి బ్యూటీ పార్లర్లకు వచ్చి ఫేషియల్ చేసుకుంటున్నారు. అందంగా ఉన్నామనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరుగుతోంది. యువతులు కాలానికి అనుగుణంగా మార్పు కోరుకుంటున్నారు. ఎక్కువ మంది ఫంక్షన్లకు అనుగుణంగా పార్లర్‌కు వచ్చి మేకప్ చేయించుకుంటున్నారు. మరికొంతమంది కోరికమేరకు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వీసు అందిస్తున్నాం.
– టి.హైమావతి, బ్యూటీషియన్, ఆదిత్య బ్యూటీ పార్లర్, రాజాం.
1400 మందికి శిక్షణ..
జీఎంఆర్ నైరెడ్ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 1400 మందికి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ అందించాం. యువతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇదో చక్కని అవకాశం. పదో తరగతి చదివి ఖాళీగా ఉన్నవారందరినీ ఉపాధిమార్గం వైపు ప్రోత్సహిస్తున్నాం. ఇందులో భాగంగా అందిస్తున్న బ్యూటీషియన్ కోర్స్‌లో చేరి మెళకువలు తెలుసుకుంటున్నారు. సంస్థ స్థాపించిన తరువాత నిర్విరామంగా యువతకు ఉపాధి శిక్షణ ఉచితంగా అందిస్తున్నాం.
– కె.శశిధర్, డైరెక్టర్, జీఎంఆర్ నైరెడ్, రాజాం.
(చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!)
Comments
Please login to add a commentAdd a comment