Begumpet Fly Over
-
హైదరాబాద్‌లో 45 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి,సనత్‌నగర్: జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)–2 కింద బేగంపేట కరాచీ బేకరీ సమీపంలోని పికెట్ నాలాపై జరిగే బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో 45 రోజుల పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్ఎన్డీపీ ఈ వినతి మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఎస్పీ రోడ్డు, మినిస్టర్ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ఆ మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జూన్ 4 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు విడుదల చేసిన రూట్ మ్యాప్.. రాకపోకలు ఇలా.. సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ నుంచి రసూల్‌పురా జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ దేవాలయం వద్ద లేన్ (యాత్రి నివాస్ దగ్గర) వద్ద ఎడమ వైపు మళ్లీ..పీజీ రోడ్డు, ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ కుడి వైపు, మినిస్టర్ రోడ్డు మీదుగా రసూల్ పురా ‘టి’ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ► కిమ్స్ ఆస్పత్రి నుంచి రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు న్యూ రాంగోపాల్‌పేట పీఎస్ ఎదురుగా సింథికాలనీ, పీజీ రోడ్డు వైపు రైట్ టర్న్ తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు. ►బేగంపేట ఫ్లైఓవర్ నుంచి వచ్చే కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లే వాహనదారులు రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ మార్గంలో కేవలం సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. ►హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్, రసూల్‌పురా ‘టి’ జంక్షన్ మధ్య ‘వన్ వే’గా గుర్తించారు. ►సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ వైపు గూడ్స్ వాహనాలతో పాటు ప్రైవేటు, స్కూల్స్, కాలేజీ బస్సులు వంటి రవాణా వాహనాలను అనుమతించరు. అవి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: లెక్క తప్పైతే మంత్రి పదవి రాజీనామా చేస్తా: కేటీఆర్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లే మార్గాలు ఇవీ.. పంజగుట్ట వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, సీటీఓ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని, హనుమాన్ టెంపుల్ లేన్, ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ ఎడమ మలుపు నుంచి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాలి. ►పంజగుట్ట ఎక్స్‌రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైవర్, నెక్లెస్ రోటరీ, పీవీఎన్ఆర్ మార్గ్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►సీటీఓ జంక్షన్, ప్యారడైజ్, రాణిగంజ్ జంక్షన్ కుడి వైపు తిరిగి, మినిస్టర్ రోడ్డు మీదుగా కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. ►కోఠి, ఎంజే మార్కెట్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్, రాణిగంజ్ జంక్షన్ ఎడమ మలుపు, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ లేదా బుద్ధభవన్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. -
Hyderabad:ఈ రోజు రాత్రి ఫ్లైఓవర్లు బంద్.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: జగ్నేకీ రాత్‌గా పిలిచే షబ్బే బరాత్ నేపథ్యంలో నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసేవేయనున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము వరకు గ్రీన్ ల్యాండ్స్, లంగర్హోస్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా మిగిలినవి మూసి ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. -
బేగంపేట మినహా అన్ని ఫ్లైఓవర్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో భాగంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్నింటిని గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మూసేస్తారు. ట్యాంక్ బండ్‌పై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. గురువారం రాత్రి 10 నుంచి శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. వీవీ స్టాట్యూ నుంచి – నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్‌భవన్ మీదుగా మళ్లిస్తారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు పంపిస్తారు. లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య మీదుగా మళ్లిస్తారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపించరు. వీటిని కర్బలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. ఓఆర్ఆర్, పీవీ ఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేసి ఉంటాయి. ఎయిపోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. కనిపించని సందడి... నగరంలో ఈసారి న్యూ ఇయర్ సందడి కనిపించట్లేదు. సిటీతో పాటు శివార్లలోనూ ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్స్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కొన్ని రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ఆయా సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లకు సంబంధించి హోర్డింగ్స్ వెలుస్తాయి. ఇతర మాధ్యమాల ద్వారానూ భారీ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఈసారి ఎలాంటి హడావుడి కనిపించట్లేదు. అనేక రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకల్ని నిషేధించాయి. దీనికి తోడు డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. రాజధానిలో ఇలాంటి ప్రకటనలు లేనప్పటికీ అదే పరిస్థితి ఉండనుంది. (చదవండి: ఇంట్లోనే ‘హ్యాపీ న్యూ ఇయర్’!) -
బేగంపేట ఫ్లైఓవర్‌పై నాగుపాము హల్చల్
-
బేగంపేట ఫ్లైఓవర్‌పై నాగుపాము హల్చల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్‌పై ఓ నాగుపాము హల్చల్ చేసింది. బుసలు కొడుతూ ఫ్లైఓవర్ పైకి రావడంతో ఎక్కటి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. మొదటగా రోడ్డు పక్కన ఉన్న పూలకుండిలో పామును గమనించిన ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, యువకులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అది రోడ్డుపైకి వచ్చింది. పామును చూసిన వాహనదారులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కాసేపటి తర్వాత ఓ యువకుడు పామును పట్టుకొని పొదల్లో విడిచిపెట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, పాము హల్చల్ కారణంగా ఫ్లైఓవర్‌కు ఇరువైపుల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
ఒక్క కారు ఎంత పని చేసిందో..
అసలే బేగంపేట్– పంజగుట్ట మార్గం.. ఆపై పీక్ అవర్స్.. ఇంకేముంది వాహనదారులు చుక్కలు చూశారు. సోమవారం ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో బేగంపేట్ ఫ్లైఓవర్‌పై కారు డివైడర్‌ను ఢీకొట్టి.. దాని మధ్యలో ఆగిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు గంటలైనా పరిస్థితి అదుపులోకి రాలేదు. సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్: ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వేల మందిని ఇబ్బందుల పాలు చేసింది. అతడి కారు ఫ్లైఓవర్‌పై డివైడర్ ఎక్కడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. బేగంపేటలో సోమవారం ఉదయం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. పోలీసులు సదరు వాహనచోదకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెల 18న చోటు చేసుకున్న ‘జీహెచ్ఎంసీ లారీ బ్రేక్‌డౌన్ పరేషాన్’ను పూర్తిగా మరువక ముందే మరో ‘జామ్’జాటం చోటు చేసుకుంది. నగరంలోని రహదారుల్లో బేగంపేట–పంజగుట్ట మార్గం అత్యంత కీలకమైంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో పాటు సైబరాబాద్‌లోని ఐటీ సెక్టార్‌కు వెళ్లి వచ్చే వాహనాలతో సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ భారీగా ఉంటుంది. వారంలో తొలి పనిదినమైన సోమవారం ఈ ఇబ్బందులు మరీ ఎక్కువ. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్స్ వద్ద పనులు జరుగుతుండటంతో మరికొంత ఇబ్బంది కలుగుతోంది. సోమవారం ఓ వ్యక్తి నిర్లక్ష్యం వాహనచోదకుల నరకానికి కారణమైంది. జనప్రియ లేక్ ప్రాంతానికి చెందిన దివ్యాన్ష కోహిల్ సోమవారం ఉదయం బేగంపేట నుంచి పంజగుట్ట వైపు వెళుతుండగా అతడి ఐ–20 కారు బేగంపేట ఫ్లైఓవర్‌పై వరుణ్ మోటార్స్ వద్ద అదుపు తప్పడంతో సిమెంట్ దిమ్మెలతో కూడిన కొలాబ్సబుల్ డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పటికే వేగంగా ఉన్న కారు దిమ్మెలు తప్పుకోవడంతో ఆ మధ్య నుంచి డివైడర్ పైకి ఎక్కి ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు స్పందించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తుకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఆయన ట్రాఫిక్ క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారు. ఫ్లైఓవర్‌పై పంజగుట్ట వైపునకు వెళ్లే ట్రాఫిక్ ఆగిపోగా... రెండో వైపు నుంచి వెళ్తున్న వాహనచోదకులు కారును చూసేందుకు వెహికిల్స్ ఆపుతూ/నెమ్మదిగా పోనివ్వడంతో ఆ వైపు సైతం ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ క్రేన్‌ను రప్పించి వాహనాన్ని దూరంగా తరలించారు. ఈ విషయమై దివ్యాన్ష్‌ను ప్రశ్నించగా... తనకు ఆ సమయంలో కళ్లు తిరిగాయని, అందుకే కారు అదుపు తప్పిందని చెప్పుకొచ్చాడు. నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో పాటు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమైన అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బేగంపేట ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ‘కారు–డివైడర్’ ఘటనతో బేగంపేట మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అటు సికింద్రాబాద్... ఇటు పంజగుట్ట రూట్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రధాన రహదారిని విడిచి గల్లీల నుంచి వెళ్లాలని పలువురు భావించడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి వాటిలోనూ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్నిచోట్ల శాంతిభద్రతల విభాగానికి చెందిన పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు శ్రమించారు. ఛిద్రమైన రోడ్లు, ఆగిపోయిన ట్రాఫిక్ కారణంగా వాహనాల మైలేజ్ కూడా ఘోరంగా పడిపోయింది. -
బేగంపేట ఫ్లైఓవర్‌పై ప్రమాదం
నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికంగా నివాసముంటున్న కిరణ్‌కుమార్(35) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఈరోజు కార్యాలయానికి వెళ్తుండగా.. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.