Belgium Grand Prix race
-
బెల్జియం జీపీ విజేత వెర్స్టాపెన్
స్పా ఫ్రాంకోర్చాంప్స్: వర్షంతో మూడు ల్యాప్లే జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. భారీ వర్షంతో మూడు గంటలు ఆలస్యంగా... గంట పాటు మాత్రమే సాగేలా సేఫ్టీ కారు నడుమ రేసు ఆరంభమైంది. అయితే మూడు ల్యాప్‌ల అనంతరం ట్రాక్ ప్రతికూలంగా మారడంతో రేసును కొనసాగించడం ప్రమాదమని భావించిన నిర్వాహకులు రేసును నిలిపేశారు. రేసు నిలిచే సమయానికి వెర్స్టాపెన్, రసెల్ (విలియమ్స్), హామిల్టన్ (మెర్సిడెస్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండటంతో దానిని తుది ఫలితంగా ప్రకటించారు. తదుపరి డచ్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 5న జరగనుంది. -
వెర్స్టాపెన్ ‘పోల్’ సిక్సర్
స్పా ఫ్రాంకోర్ చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 59.765 సెకన్లలో పూర్తి చేసిన వెర్స్టాపెన్ పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.321 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసిన విలియమ్స్ డ్రైవర్ జార్జ్ రసెల్ రెండో స్థానంలో నిలవగా... మూడో స్థానంలో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసును సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి -
విజేత వెటెల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బెల్జియం గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఆదివారం పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన హామిల్టన్‌ను వెటెల్ తొలి ల్యాపులోనే అధిగమించాడు. అక్కడి నుంచి రేసు ముగిసేదాకా ఆధిక్యంలో కొనసాగిన వెటెల్ 44 ల్యాపుల ఈ రేసును గంటా 23 ని.34.476 సెకన్లలో పూర్తి చేశాడు. అతనికంటే 11.061 సెకన్లు ఆలస్యమైన హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఓకాన్లు వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ప్రధాన రేసు మొదలైన కాసేపటికే రేసింగ్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన హుల్కెన్బర్గ్పై ఫార్ములావన్ నిర్వాహకులు 10 స్థానాలు పెనాల్టీగా విధించారు. -
హామిల్టన్‌కే పోల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా 1 ని.58.179 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఫెరారీ డ్రైవర్ వెటెల్ రెండో స్థానం పొందగా, రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, రికియార్డో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
హామిల్టన్ హవా
బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో ఆరో విజయం స్పాఫ్రాంకోర్చాంప్స్: దాదాపు నెలరోజుల తర్వాత మళ్లీ ట్రాక్‌పైకి వచ్చినప్పటికీ తనలో ఎలాంటి దూకుడు తగ్గలేదని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిరూపించాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి రేసులో ఈ ఇంగ్లండ్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 23 నిమిషాల 40.387 సెకన్లలో ముగించి సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచాడు. ఏదశలోనూ అతనికి తన ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని పొందగా... గ్రోస్యెన్ (లోటస్) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. సెర్గియో పెరెజ్ ఐదో స్థానాన్ని పొందగా... నికో హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి నిష్ర్కమించాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 6న జరుగుతుంది.