హామిల్టన్ హవా
బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సీజన్‌లో ఆరో విజయం
స్పాఫ్రాంకోర్‌చాంప్స్: దాదాపు నెలరోజుల తర్వాత మళ్లీ ట్రాక్‌పైకి వచ్చినప్పటికీ తనలో ఎలాంటి దూకుడు తగ్గలేదని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిరూపించాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి రేసులో ఈ ఇంగ్లండ్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 23 నిమిషాల 40.387 సెకన్లలో ముగించి సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచాడు.
ఏదశలోనూ అతనికి తన ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని పొందగా... గ్రోస్యెన్ (లోటస్) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. సెర్గియో పెరెజ్ ఐదో స్థానాన్ని పొందగా... నికో హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి నిష్ర్కమించాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 6న జరుగుతుంది.