బుల్లెట్ తగలగానే ఇంట్లోకి పరుగెత్తబోయి..
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆమె ఇంటి వద్ద ఉన్న రెండు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఈ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం. కాల్పులు జరుపుతుండగా ఆమె ఇంటిలోపలికి పరుగెత్తేందుకు ప్రయత్నించారని, అప్పటికే బుల్లెట్లు తగలడంతో ఇంటి బయటే కుప్పకూలినట్లు సీసీటీవీల ఆధారంగా తెలుస్తోంది. ఆమె తన పని ముగించుకొని టోయోటా ఇటియోస్ కారులో ఇంట్లోకి రాగానే హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి నేరుగా ఆమెకు సమీపంగా వచ్చి కాల్పులు జరిపాడు.
మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లగా ఒక బుల్లెట్ మాత్రం నుదుటి భాగంలోకి వెళ్లింది. లంకేష్ నివాసంలో మొత్తం నాలుగు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అందులో నుంచి పాస్వర్డ్ ప్రొటెక్షన్ కల్గిన రెండు డీవీఆర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ నిపుణుల సాయంతో వాటిని తెరచి పరిశీలిస్తున్నారు. బాధితురాలితోపాటు నిందితులు కూడా ఒకే ఫ్రేమ్‌లో ఉండే ఫొటోలు కొన్ని లభ్యమైనట్టు తెలుస్తోంది.
వాటి ఆధారంగా ఆమెను దగ్గర నుంచే షూట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయిలో నిర్థారించేందుకు ఈ ఆధారాలను ఫోరెన్సిక్ లేబోరేటరీకి పంపించారు. లభ్యమైన ఆధారాలను బట్టి నిందితుల్లో ఇద్దరు నల్ల రంగు జాకెట్‌తో పూర్తిగా మాస్క్ ధరించి హెల్మెట్‌తో ద్విచక్రవాహనంపై వేచి వుండగా, మరో వ్యక్తి ఆమె ఇంటి ప్రాంగణంలోకి నడుచుకుంటూ వెళ్లి ఈ కాల్పులు జరిపినట్టు సమాచారం. సీసీటీవీలో కనిపించిన బైక్‌లు రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తించలేని విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.