ఆమె ఇలా ఎలా చేసిందో?
బెంగళూరు: మొన్న ఢిల్లీలో నేడు కర్ణాటకలో. సాటి మనుషులపైనే కాదు మూగజీవాలపట్ల కూడా మనుషులు ఉండాల్సిన కనీస మానవత్వం లేకుండా పోతోంది. ఢిల్లీలో విచక్షణా రహితంగా కుక్కలను ఓ వ్యక్తి పొడిచిచంపిన ఘటన గడవక ముందే అలాంటిదే మరొకటి జరిగింది. తన ఇంటికి సమీపంలో ఓ కుక్క పిల్లలకు జన్మనిచ్చిందని ఆక్రోశంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పిల్లలను ఓ మహిళ బండకేసి కొట్టి చంపింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఈ చర్యకు పాల్పడినవారిని పొనమ్మ అనే మహిళగా గుర్తించారు. తన స్థలంలో కుక్క పిల్లలకు జన్మనిచ్చిందని, ఆ కోపంతో ఆ కుక్కకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వాటిని బండకేసి కొట్టి చంపినట్లు చుట్టుపక్కల వారు చెప్పారు. ఈ ఘటనపై తమన్నా అనే ఓ సామాజిక వేత్త స్పందిస్తూ పొనమ్మ మానసిక స్థితి చాలా భయంకంరంగా ఉందని, ఆమెతో చుట్టుపక్కలవారికి కూడా ప్రమాదమేనని తెలిపింది. వారి వారి ఇండ్లలో ఉండే పిల్లలు జాగ్రత్త అని, పొనమ్మకు దొరికితే కొట్టిచంపుతుందని కూడా హెచ్చరించింది. ఇలాంటి మహిళను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అయితే, తాను అసలు తాను వాటిని చంపలేదని, చనిపోయినవాటినే అక్కడ పెట్టానని, కావాలనే చుట్టుపక్కలవారు తనపై ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది పొనమ్మ.