నెట్టింట్లో బిల్లు కట్టొచ్చు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరానికి మాత్రమే ఇప్పటి వరకు పరిమితమై ఉన్న ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవలు మరో ఏడు జిల్లాలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ జిల్లాలన్నీ బెస్కాం (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ) పరిధిలో ఉన్నాయి. ఏడాది కిందట ప్రారంభమైన ఈ ఆన్లైన్ చెల్లింపు సేవలు నగరంలో 47 డివిజన్ల పరిధిలోని 45 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. మంగళవారం నుంచి బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిక్కబళ్లాపురం, రామనగర, దావణగెరె, చిత్రదుర్గ, కోలారు జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. తద్వారా 40 లక్షల మంది వినియోగదారులు ఇకమీదట ఆన్లైన్లో బిల్లులను చెల్లించవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు కలిగిన వినియోగదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
చెల్లింపు ఇలా..
బెస్కాం పరిధిలోని వినియోగదారులు జ్ట్టిఞ://ఛ్ఛటఛిౌఝ.ౌటజ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో ఆన్లైన్లో బిల్లు చెల్లింపు లింకును క్లిక్ చేయాలి. బెంగళూరుతో పాటు మరో 24 నగరాలు, పట్టణాల వినియోగదారులకు ఓ లింకు, గ్రామీణ వినియోగదారులకు మరో లింకు ఉంటుంది. వినియోగదారులు తమకు చెందిన డివిజన్‌ను గుర్తించి క్లిక్ చేయాలి. అనంతరం స్క్రీన్‌పై కనిపించే చెల్లింపు బటన్‌ను నొక్కి, ఇతర లాంఛనాలను పూర్తి చేయాలి. ఆన్లైన్ ద్వారా చెల్లింపు వల్ల సమయం ఆదా కావడమే కాకుండా, చాంతాడంతా క్యూలో నిల్చునే బాధ తప్పుతుంది. ఎక్కడి నుంచైనా ఈ చెల్లింపులను పూర్తి చేయవచ్చు.
గ్రామాల్లో ఇళ్ల వద్దే బిల్లు వసూలు
గ్రామాల్లో ఇళ్ల వద్దే విద్యుత్ బిల్లులను చెల్లించే సదుపాయం మరో కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మీటర్ రీడింగ్‌ను చూసి అప్పటికప్పుడే బిల్లును ఇచ్చే ఉపకరణాల ద్వారానే ఆ బిల్లు మొత్తాన్ని అక్కడికక్కడే వసూలు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఉపకరణాలకు సాఫ్ట్‌వేర్‌ను అమర్చే పనులను చేపట్టారు. తద్వారా ఇంటి వద్దే బిల్లు మొత్తం వసూలు చేసుకుని వినియోగదారునికి రసీదు ఇస్తారు. డబ్బులు చెల్లించిన వెంటనే బెస్కాం సర్వర్‌లో ఈ లావాదేవీ నమోదమవుతుంది. కోలారు జిల్లా బంగారుపేటలో ఈ నెల ఒకటో తేది నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పద్ధతిని రెండు నెలల పాటు అమలు చేస్తారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని 16 మంది బిల్ కలెక్టర్లు రోజూ సగటున 200 మంది వినియోగదారుల నుంచి చెల్లింపులను స్వీకరిస్తున్నారు.