‘షాన్’ దార్ ఇన్నింగ్స్ ముగిసింది
సాక్షి క్రీడావిభాగం : బ్రాడ్మన్నుంచి సచిన్ దాకా ఎంతో మంది దిగ్గజాలు తమ అద్భుత ఆటతో క్రికెట్‌ను పరిపూర్ణం చేశారు. కానీ తన పేరుతోనే ఒక షాట్‌కు క్రికెట్లో సుస్థిర స్థానం కల్పించడం మాత్రం అసాధారణం. అది తిలకరత్నే దిల్షాన్‌కు మాత్రమే సొంతమైన ఘనత. తలను కాస్త వంచి, ఒక మోకాలుపై కూర్చుంటూ పేసర్ వేసిన గుడ్ లెంగ్త బంతిని సరిగ్గా వికెట్ కీపర్ తల మీదుగా పంపించడం దిల్షాన్‌కే చెల్లింది. 2009 టి20 ప్రపంచకప్‌లో తొలిసారి అతను ఈ షాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతకు ముందే మారిలియర్ ఇలా కొట్టేవాడని కొందరు చెప్పినా... ఇప్పుడు అందరూ ఆడుతున్న స్కూప్‌కు మాత్రం తానే ఆద్యుడినని అతను గర్వంగా చెప్పుకుంటాడు. అందుకే క్రికెట్ ప్రపంచం కూడా దీనిని గుర్తించి ‘దిల్‌స్కూప్’ అని పేరు పెట్టేసింది.
బెస్ట్ ఆల్‌రౌండర్
దిల్షాన్ అంటే ఆ ఒక్క షాట్ మాత్రమే కాదు. పరిపూర్ణమైన క్రికెటర్. బ్యాట్స్‌మన్, బౌలర్, అద్భుత ఫీల్డర్, అవసరమైన సమయాన చక్కటి వికెట్ కీపర్... ఇలా అన్ని పాత్రలను సమర్థంగా పోషించిన అతను సుదీర్ఘ కాలం పాటు శ్రీలంక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అరుదైన ఆటగాళ్లలో అతనూ ఒకడు. ఆరంభంలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్స్పిన్నర్గానే అందరికీ తెలిసిన దిల్షాన్ ఓపెనింగ్‌కు మారటంతో ఒక్కసారిగా మారిపోయాడు. దూకుడైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
2009లో మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా అవకాశం వచ్చాక చెలరేగిపోయాడు. ముఖ్యంగా జయసూర్య రిటైర్మెంట్ తర్వాత ఆ లోటు కనిపించకుండా ఆడాడు. కెప్టెన్‌గా ఉంటూ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకై క ఆటగాడు అతనే. జయవర్ధనే, సంగక్కరలతో పోలిస్తే చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చుకోకపోరుునా, లంక క్రికెట్‌పై దిల్షాన్ తనదైన ముద్ర వేశాడు.
కొన్ని మెరుపులు
ఇటీవలి వరకు వన్డేల్లో రికార్డుగా ఉన్న 443 పరుగుల మ్యాచ్ (నెదర్లాండ్‌సపై)లో 78 బంతుల్లో 117 నాటౌట్, 2009లో బంగ్లాదేశ్‌తో టెస్టులో రెండు ఇన్నింగ్‌సలలోనూ సెంచరీలు, 2009 టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 57 బంతుల్లో 96 పరుగులు, టెస్టుల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగి (కివీస్‌పై) 72 బంతుల్లో 92 పరుగులు చేయడం, భారత్‌పై రాజ్‌కోట్‌లో 415 పరుగుల లక్షాన్ని అందుకునే ప్రయత్నంలో చేసిన 124 బంతుల్లో 160 పరుగులు, 2011లో లార్డ్స్ టెస్టులో చేతికి గాయంతో పోరాడుతూ చేసిన 193 పరుగుల ఇన్నింగ్స... దిల్షాన్ కెరీర్లో గుర్తుండిపోయే మ్యాచ్‌లు. వీటన్నింటికి తోడు గత వన్డే వరల్డ్ కప్‌లో 140 కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మిషెల్ జాన్సన్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా ఆరు ఫోర్లు అలవోకగా కొట్టడం ఎవరు మరచిపోగలరు!