గుండె జబ్బులకు సెక్స్ కూడా మందే
గుండె జబ్బులతో బాధపడేవారికి జీవనశైలి మార్చుకోవాలని, ధూమపానం వదులుకోవాలని, మద్యం తగ్గించాలని ఏ డాక్టరైనా చెబుతారు. వీటిని పాటించినా సెక్స్‌ను మాత్రం మరచిపోరాదని, వారానికి కనీసం మూడుసార్లు సెక్స్ ఉంటేనే గుండెజబ్బుల వారికి మంచిదని బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో హార్ట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ గ్లాడియో గిల్ సొయేర్స్ తెలియజేశారు.
భాగస్వామిని ముట్టుకోవడం ఓ నడక లాంటిదని, ముద్దు పెట్టుకోవడం వడివడిగా నడవడం లాంటిదని, సెక్స్‌లో పాల్గొనడం పరుగెత్తడం లాంటిదని ఆయన చెప్పారు. నడవడం, పరుగెత్తడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సెక్స్ వల్ల కూడా అన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆరు నిమిషాల పాటు సెక్స్‌లో పాల్గొంటే గుండెతోపాటు శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని, 21 క్యాలరీలు కరిగిపోతాయని ఆయన చెప్పారు. సెక్స్‌కు, గుండెకు ఉన్న సంబంధంపై జరిపిన 150 అధ్యయనాలను పరిశీలించడం ద్వారా తానీ అభిప్రాయానికి వచ్చానని ఆయన చెప్పారు.
గుండె జబ్బులతో బాధపడేవారు సెక్స్‌లో పాల్గొనడం ప్రమాదకరమని చాలా మంది అభిప్రాయపడతారని, అది అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. గుండెజబ్బు ఉండి, సెక్స్‌లో పాల్గొన్న వారిలో చనిపోయిన వారి సంఖ్య కేవలం రెండు శాతం మాత్రమేనని, అది కూడా నడవడం లాంటి అలసటను కూడా తట్టుకోలేని వారే మరణించారని ఆయన అన్నారు. సందేహాలున్న వారు వైద్యుల సలహాను తీసుకొని శుభ్రంగా సెక్స్‌లో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. గుండె జబ్బుగల వారు వయగ్రా వాడడం కూడా మంచిదేనని ఆయన అన్నారు.