ఐఎస్లో చేరం.. చాలా పనులున్నాయి
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం యువతను సోషల్ మీడియా ద్వారా తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగ్రవాద నాయకులు ఆన్లైన్ ద్వారా తమ సందేశాలను ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్-బగ్దాది గత వారం విడుదల చేసిన వీడియోలో ముస్లిం యువతను ఇస్లామిక్ స్టేట్ తరపున పోరాడాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇస్లామిక్ స్టేట్కు సోషల్ మీడియాలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ముస్లిం యువత ఇస్లామిక్ స్టేట్లో చేరడం కన్నా వారు చేయాల్సిన ఉన్నతమైన పనులను గురించి చెబుతూ.. నార్వేకు చెందిన ఇయాద్ ఎల్ బగ్దాది అనే యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ట్విట్టర్లో తన ఫాలోవర్లకు ఇస్లామిక్ స్టేట్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చాడు. దీంతో ఇస్లామిక్ స్టేట్ భావజాలానికి వ్యతిరేకంగా పలువురు సోషల్ మీడియాలో ప్రచారం చేపడుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ ఎలాంటి ప్రయోజనం లేని భావజాలంతో ముందుకుపోతోందన్న వాదనతో మొదలైన ఈ యాంటీ ఇస్లామిక్ స్టేట్ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా సాగుతోంది.