bevarages corporation
-
ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!!
ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్లాంట్లలో తయారవుతున్న బేవరేజెస్‌ని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొనడంపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. ఇకపై వాటిని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఫుడ్ సేఫ్టీ కి ఫిర్యాదులు మార్కెట్లో సోయా మిల్క్, బాదం మిల్క్, కోకోనట్ మిల్క్ ఇలా రకరకాల ఫ్లేవర్లలో కూల్‌డ్రింక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కూల్‌డ్రింక్‌ల తయారీలో నిజానికి డెయిరీలలో తయారయ్యే పాలను ఉపయోగించరు. కానీ మార్కెటింగ్ చేసేప్పుడు మాత్రం మిల్క్ ప్రొడక్ట్‌లుగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై డెయిరీ సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దీంతో విచారణ చేపట్టిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ మిల్క్ ప్రొడక్టుల పేరుతో బేవరేజెస్ అమ్ముతున్న ఆయా కంపెనీలపై కన్నెర్ర చేసింది. 15 రోజుల్లోగా మార్చేయండి మిల్క్ ప్రొడక్టుల పేరుతో మార్కెట్లో బేవరేజ్పై ‘మిల్క్ పొడక్టు’ అంటూ ఉన్న అక్షరాలను తీసేయాలని, లేదంటూ కొత్త లేబుళ్లు అంటించుకోవాలని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. కేవలం పదిహేను రోజుల్లోగా ఈ మార్పులు చేపట్టాలని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 3 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుందని పేర్కొంది. భవిష్యత్తులో ఈ ప్రొడక్టులపై మిల్క్ అని ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే ఆన్లైన్లో అమ్ముడవుతున్న బేవరేజెస్‌ను మిల్క్ ప్రొడక్టుల కేటగిరీలో చూపొద్దంటూ ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలు అందాయి. గడువు పెంచండి ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులపై మిల్క్‌ను తొలగిస్తామని కానీ ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రొడక్టుల విషయంలో ఫుడ్ సేఫ్టీ తీర్పు అమలు చేయడం కష్టమని ఈ వ్యాపారంలో ఉన్న సంస్థలు అంటున్నాయి. తమకు గడువు పెంచాలని లేదంటే మార్కెట్లో ఉన్న ప్రొడక్టులను ఈ ఆదేశాల నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. లేదంటే తమకు కోట్లలో నష్టం వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాయి. స్పష్టత కావాలి ఫ్యాక్టరీలో తయరయ్యే వస్తువులకు మిల్క్ ప్రొడక్టులు పేర్కొనడం వల్ల తమకు నష్టం వస్తోందని డెయిరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ బేవరేజేస్ మార్కెట్ దేశంలో విస్తరిస్తోందని, ఇప్పుడే ‘ మిల్క్ ప్రొడక్ట్ ’ విషయంలో స్పష్టత తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదనే అంచనాతో డెయిరీలో కఠినంగా వ్యవహారించాయి. మనదేశంలో మిల్క్ ప్రొడక్టుల పేరుతో అమ్ముడవుతున్న బేవరేజేస్ మార్కెట్ విలువ రూ. 185 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. చదవండి: ‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో! -
కోకాకోలా, బిస్లేరి, రామ్‌దేవ్‌బాబాకు షాక్: కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కంపెనీలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మూడు పెద్ద కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్ల సేకరణకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో కోక్, పెప్సీ, బిస్లేరీ కంపెనీలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ మూడు కంపెనీలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ మూడు కంపెనీలకు కలిపి దాదాపు రూ.72 కోట్ల జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో బిస్లేరీ సంస్థకు రూ.10.75 కోట్లు, పెప్సీకి రూ.8.7 కోట్లు, కోకాకోలా కంపెనీకి రూ.50.66 కోట్ల జరిమానా విధించింది. వీటితో పాటు రాందేవ్ బాబాకు చెందిన పతాంజలి సంస్థకు రూ. కోటి, మరో సంస్థకు రూ.85.9 లక్షల జరిమానా వేసింది. జరిమానాలను 15 రోజుల్లోగా చెల్లించాలని పీసీబీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ (ఈపీఆర్) అనేది పాలసీ కొలత. దీని ఆధారంగా ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తులను పారవేసేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బిస్లేరి: ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 9 నెలల్లో సుమారు 21,500 టన్నులుగా తేలింది. టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10.75 కోట్లు జరిమానా విధించింది. పెప్సీ: 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. కోకాకోలా బెవరేజెస్ సంస్థలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,417 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఈపీఆర్ లక్ష్యం లక్షా 5 వేల 744 టన్నుల వ్యర్థాలు. ఈ విధంగా ఒక్కో సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను బట్టి జరిమానాను కాలుష్య నియంత్రణ మండలి విధించింది. మేం బాధ్యతతో ఉన్నాం: బిస్లేరి అయితే ఈ వార్తలపై తాజాగా బిస్లేరీ యాజమాన్యం స్పందించింది. తాము బాధ్యతతో ఉన్నామని.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ‘‘కాలుష్య నియంత్రణ మండలి ఇతర పర్యావరణ సంస్థల నియమనిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన పత్రాలు సమర్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం నిబద్ధతతో పని చేస్తున్నాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్, వేరు చేయు విధానంపై మేం సమాజంలో అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలలతో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాపై వచ్చిన ఫిర్యాదులను మా బృందం పరిశీలిస్తోంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుంది’’ బిస్లేరీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. -
సర్కారీ మద్యం దుకాణాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఆధ్వర్యంలో అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. డిస్టలరీలు, బ్రూవరీస్‌లలో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి.. దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ సంస్థ ఇకపై స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. తొలి అడుగు.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం అమల్లో భాగంగా.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన మద్యం విధానాన్ని రూపొందించి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల అద్దెకు, డిపోల నుంచి మద్యం సరఫరా, ఫర్నీచర్ ఏర్పాటు తదితరాలపై ఆసక్తిదారుల నుంచి టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో టెండర్లను జేసీ మాధవీలత ఆధ్వర్యంలో ఖరారు చేశారు. మచిలీపట్నంలో 112 షాపులు ఖరారు.. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 117 షాపులకు టెండర్లను ఆహ్వానించారు. బుధవారం ఆయా షాపులకు సంబంధించి 112 మంది దరఖాస్తులను ఖరారు చేశారు. ఉయ్యూరులో 1, కైకలూరులో 3, మువ్వలో 1 షాపునకు వచ్చిన దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెలతో పోలిస్తే కైకలూరులో అతి తక్కువగా 5 వేలు అద్దె ఖరారు అయ్యింది. అత్యధికంగా మచిలీపట్నం పట్టణంలో ఒక షాపునకు రూ. 45 వేలు అద్దె పలికింది. విజయవాడ యూనిట్లో.. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 126 షాపులకు టెండర్లను ఆహ్వానించగా 116 ఖరారు చేశారు. వీటిలో నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం ఊటుకూరులో 9 షాపులకు ఎటువంటి అద్దె తీసుకోకుండా ఉచితంగా షాపు యజమానులు ఇవ్వడం విశేషం. ఇందులో నందిగామలో 5 షాపులకు తొలుత 24 మంది దరఖాస్తు చేశారు. ఇందులో ఒక షాపునకు అత్యధికంగా 60 వేలు అద్దెను కోట్ చేశారు. దీంతో జేసీ మాధవీలత, ఎక్సైజ్ అధికారులు వారితో సంప్రదింపులు జరపగా.. చివరకు వారిలో నల్లాని అయ్యన్న, పెద్దినేని చందు, వేలది నరసింహారావు, నల్లాని శ్రీనివాసరావు, వీబీ ప్రతాప్‌లు ఉచితంగా తమ షాపులను అప్పగించేందుకు ముందుకు వచ్చారు. పెనుగంచిప్రోలులో మూడు షాపులకు 16 మంది దరఖాస్తు చేయగా వారిలో ఒక షాపునకు దరఖాస్తుదారుడు అత్యధికంగా రూ. 41 అద్దె కోట్ చేశారు. వీరితోనూ అధికారులు మాట్లాడగా.. చివరకు వీరందరూ ఉచితంగా తమ షాపులను ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాంతో లాటరీ పద్ధతి ద్వారా జి.పద్మావతి, ఆర్.దుర్గాప్రసాద్, జి.గోపిచంద్‌లను ఎంపిక చే శారు.గంపలగూడెం, ఊటుకూరులో ఒక షాపునకు రెండు దరఖాస్తులు రాగా.. పసుపులేటి వెంకటేశ్వరరావు ఉచితంగా తన షాపును ఇచ్చారు. ఇక్కడ అత్యధికంగా రూ. 30 అద్దె కోట్ చేశారు. సెప్టెంబరు 1 నుంచి మొదటి దశ ఇటీవల విజయవాడ, మచిలీపట్నం యూనిట్లలో రెన్యువల్ చేసుకోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటి దశలో భాగంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి సర్కారే వీటిని నిర్వహించనుంది. ప్రైవేటు మద్యం వ్యాపారులైతే అధికాదాయం కోసం ఎక్కువ సరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే గ్రామగ్రామాన మద్యం గొలుసు దుకాణాలూ వెలిసేవి. దీంతో ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభించి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించటం వల్ల గొలుసు దుకాణాలకు అవకాశమే ఉండదు. ఎమ్మార్పీ, సమయపాలన ఉల్లంఘనలు వంటివి తగ్గుతాయి. మద్యం అందుబాటు, లభ్యత తగ్గటం వల్ల కొంతమందైనా ఈ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు, కొత్తవారు దీని బారిన పడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బేవరేజెస్ కార్పొరేషన్ స్థానంలో ప్రత్యేక శాఖ
- ఎక్సైజ్‌కు అనుబంధంగా కార్యకలాపాలు - ఉద్యోగులను ప్రభుత్వశాఖలో విలీనం చేసేందుకే సీఎం మొగ్గు? - నిబంధనలు ఒప్పుకోకపోతే మరో రెండు ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్)ను రద్దు చేయడంతో పాటు మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత మద్యం అమ్మకాలు, డిపోల నిర్వహణ కోసం బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలపై ఆదాయపన్ను రూపంలో ఐటీ శాఖ రూ. 1,247 కోట్లను తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి అటాచ్ చేసుకుంది. సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలంటూ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చే సి, ప్రత్యేక శాఖగా కొనసాగించాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాలమేరకు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విధివిధానాలపై నివేదిక రూపొందించారు. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా ఏర్పాటయ్యే ప్రత్యేక శాఖ ద్వారా మద్యం డిపోల నిర్వహణ, రిటైల్ దుకాణాలకు సరఫరా తదితర పనులను కొనసాగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగించే ఆలోచన బేవరేజెస్ కార్పొరేషన్లో ప్రస్తుతం 143 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా 200 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. కార్పొరేషన్ రద్దయినా కొత్తగా ఏర్పాటయ్యే శాఖలో ఉద్యోగులు అవే విధులు నిర్వహిస్తారు. వీరిని ఏపీ తరహాలో కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకోవాలని భావించినప్పటికీ, ప్రభుత్వంలోకి తీసుకునేందుకే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకున్నా, వేతనాలు పాతవే చెల్లించాల్సి వచ్చినప్పుడు కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చడం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్లో పనిచేసే వారికి పెన్షన్ విధానంలో తేడాలు ఉండడం ఒక్కటే ఇబ్బందిగా ఉన్నట్లు సమాచారం. అవసరమైతే చట్టంలో సవరణలు చేసైనా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆర్థిక శాఖ అడ్డుచెబితే మాత్రం వేరే కార్పొరేషన్‌కు బదిలీ చేసి డిప్యూటేషన్ మీద ఎక్సైజ్ అనుబంధ శాఖలో కొనసాగించడమా... కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చడమా అనే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.