అభివృద్ధి పథంలో..
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2018లో అభివృద్ధి పరంగా అనేక మెరుపులు మెరవగా, కొన్ని అంశాల్లో మరకలు అంటాయి. వివిధ రంగాల్లో జిల్లా తనదైన ముద్ర వేయగా, కొన్ని అంశాల్లో నిరాశ మిగిలింది. అలాగే మరికొన్ని మరకలు అంటాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 6.7లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు లభించాయి. మొదట 5లక్షల ఎకరాలకు నీరందించాలని అనుకున్నప్పటికీ తరువాత 6.7లక్షల ఎకరాలకు పెరగడంతో అంచనా రూ.7,926 కోట్ల నుంచి రూ.13,884 కోట్లకు ప్రభుత్వం పెంచింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో తొలి సమీక్ష సమావేశం సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులపైనే చేశారు. సీతారామ ప్రాజెక్టు కోసం రూ.11వేల కోట్ల నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయిందని, పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుకు భద్రాద్రి జిల్లాలో అవసరమైన భూసేకరణ ఇప్పటికే మే 30కు పూర్తి చేశారు.
రాష్ట్రానికి వెలుగులు అందించే కేటీపీఎస్ నుంచి కొత్తగా రూ.6,045 కోట్లతో నిర్మించిన 7వ దశ ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించడంతో పాటు ఈ నెల 26వ తేదీన జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సీవోడీ(కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. దీంతో ప్రస్తుతం కేటీపీఎస్ నుంచి మొత్తం 2,460 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుతోంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లో రూ.7,241 కోట్లతో 1,080 మొగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్‌లో మొదటి దశకు సంబంధించి హైడ్రాలిక్ పరీక్ష విజయవంతంగా పూర్తి చేశారు. వచ్చే మార్చిలోగా మొదటి దశలో ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనులు ముమ్మరంగా చేస్తున్నారు. బొగ్గు రవాణాకు రైల్వేలైన్ నిర్మాణం సర్వే సాగుతోంది. సారపాకలో ఉన్న ఐటీసీ పీఎస్పీడీ రాష్ట్రప్రభుత్వ బెస్ట్ ఎంప్లాయీస్ ప్రాక్టీసెస్ అవార్డును, పాల్వంచలోని నవభారత్ వెంచర్స్ బెస్ట్ సీఎస్ఆర్ పెర్ఫార్మెన్స్ అవార్డు, అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీకి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు సాధించాయి.
పాలనాపరంగా మరింత వికేంద్రీకరణ జరిగింది. జిల్లాలో గతంలో 205 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 479 కు చేరింది. కొత్తగా 274 పంచాయతీలు పెరిగాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా భద్రాద్రి జిల్లాలో గిరిజనులకు ఏకంగా 463 పంచాయతీలు రిజర్వు అయ్యాయి. ఆగస్టు 2 నుంచి కొత్త పంచాయతీలు అమలులోకి వచ్చాయి. పాలనా నియామకాల కోసం భద్రాద్రి పేరుతో ప్రభుత్వం మే 25న ప్రత్యేక జోన్ ఏర్పాటుచేసింది. ఈ జోన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 18లక్షల ఎకరాల్లో 11లక్షల ఎకరాలు అటవీ భూములే. ఈ నేపథ్యంలో భూసర్వే చేసిన యంత్రాంగం 3.19లక్షల ఎకరాలకు పట్టా పుస్తకాలు ఇవ్వడంతో పాటు, ఆర్ఓఎఫ్ఆర్ కింద మరో 79,184 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. రూ.2,242 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేస్తున్నారు. జిల్లాలో 2,804 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేశారు. జిల్లాలోని 1,826 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన ఇంట్రావిలేజ్ పనులు మాత్రం 20శాతం పూర్తయ్యాయి.
రూ. 100 కోట్ల నిరాశ
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్‌ప్లాన్ కింద రూ.100కోట్లు ఇచ్చేందుకు గత మూడు బడ్జెట్లలో పెడుతున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఒక్కపైసా విదల్చలేదు. భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశం గత రెండున్నర సంవత్సరాలుగా నిర్వహించలేదు. జిల్లా ఏర్పాటు తరువాత ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరగకపోవడం గమనార్హం. మణుగూరులో ఏరియా ఆసుపత్రి నిర్మించి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించలేదు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా సాకారం కాలేదు. మణుగూరు మండలంలోని చినరావిగూడెం–దుమ్ముగూడెం మండలం పర్ణశాల వరకు గోదావరి నదిపై వంతెన నిర్మాణం కోసం వచ్చిన నిధులను అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో ఖర్చు చేశారని స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు.