ఈ హీరోయిన్ ధరించిన ఐవరీ ఫ్లోరల్ సారీ ధర ఎంతంటే!
Dimple Hayathi In Bhargavi Kunam Ivory Floral Saree: సినిమా చాన్స్ ఇమ్మని తొక్కిన ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్ గడపలో ‘ఒంటి రంగు చూసుకున్నావా?’ అన్నట్టు వ్యక్తీకరించిన తిరస్కారపు చూపులను ఎదుర్కొంది డింపుల్ హయాతి. బాధపడింది. కానీ కుంగిపోలేదు. నిరుత్సాహపడింది కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.
ఆ విశ్వాసమే ఇప్పుడు ఆమె తెర మీద కనిపిస్తే చప్పట్లు కొట్టేలా చేస్తోంది. అవకాశాల వెల్లువను ఆమె ఇంటి ముందుకు మళ్లించింది. ఆ ఆత్మవిశ్వాసం అంత స్ట్రాంగ్‌గా ఉండడానికి ఒక కారణం డింపుల్లోని ప్రతిభ అయితే ఇంకో కారణం.. ఆమెను మెరిపించే ఫ్యాషన్ బ్రాండ్స్. అవేంటో చూద్దాం..
భార్గవి కూనమ్
భార్గవి కూనమ్ అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కళబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్ కలెక్షన్స్, దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్ చేసింది. అదే ప్రత్యేకతగా నిలిపింది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్ ఫెవరేట్ డిజైనర్.
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్ ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
చీర : ఐవరీ ఫ్లోరల్ (భార్గవి కూనమ్)
ధర: రూ. 34,800
థియా జ్యూయెలరీ
థియా అంటే వెలుగు, మెరుపులకు ప్రతిరూపమైన గ్రీకు దేవత. ఈ బ్రాండ్‌ను స్థాపించింది అమెరికాలో స్థిరపడిన దక్షిణ కొరియా వనిత ఇరేన్. దాదాపు 20 ఏళ్లు కార్పోరెట్ ఉద్యోగం చేసి.. విసిగి వేసారి ఆ ఉద్యోగాన్ని వదిలి తనకు నచ్చిన స్పా, సెలూన్, బొటిక్ ప్రపంచంలోకి వచ్చింది. అప్పుడే జ్యూయెలరీ మీద ఆమె దృష్టి పడింది. ముందు తన కోసం తాను నగలను డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టింది.
అవి తన బోటిక్స్‌కు వచ్చే ఆడవాళ్లను ఆకర్షించడం గమనించి జ్యూయెలరీ డిజైన్లోనూ మెలకువలను నేర్చుకుంది. తక్కువ కాలంలో ఆమె సృజన బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో 2012లో ‘థియా జ్యూయెలరీ’ని స్థాపించింది. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతీసంప్రదాయాలు, అభిరుచుల కలయికే ఈ బ్రాండ్ ప్రత్యేకత. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి.
జ్యూయెలరీ: పర్ల్స్ ఇయర్ రింగ్స్
బ్రాండ్: థియా జ్యూయెలరీ
మైండ్‌లో భయాన్ని పెట్టుకొని కాదు మది నిండా కలలు నింపుకొని సాగాలి. నీమీద నీకున్న నమ్మకమే నీ లక్ష్యాన్ని చేరుస్తుంది.– డింపుల్ హయాతి
∙దీపిక కొండి