bhuma nagi reddy death
-
'చంద్రబాబే ముద్దాయి' :దేశాయి తిప్పారెడ్డి
-
'చంద్రబాబే ముద్దాయి'
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానికి ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబే కారకుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబే ముద్దాయని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని ప్రలోభపెట్టి నాగిరెడ్డిని చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని, ఏడాది గడిచినా పదవి ఇవ్వకపోవడంతో ఆయన ఒత్తిడి గురయ్యారని చెప్పారు. నాగిరెడ్డి చనిపోవడానికి 24 గంటల ముందు చంద్రబాబుతో తీవ్ర వాగ్వాదం జరిగిందని వెల్లడించారు. దీంతో మనస్తాపం చెంది నాగిరెడ్డి ఆస్పత్రి పాలయ్యారని ఆరోపించారు. అసెంబ్లీలో సంతాపం పేరుతో టీడీపీ సభ్యులు ఏవేవొ మాట్లాడి రాజకీయ సభ చేశారని తిప్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభను చంద్రబాబు అపవిత్రం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ ధ్వజమెత్తారు. ఫిరాయింపులు ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారని, ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. -
'భూమా నాగిరెడ్డి చివరి కోరిక అదే'
-
'భూమా నాగిరెడ్డి చివరి కోరిక అదే'
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం కర్నూలు జిల్లాకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూమా నాగిరెడ్డిపై మంగళవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాగిరెడ్డి మరణం బాధాకరమని అన్నారు. గ్రామస్థాయి నుంచి అత్యున్నత చట్టసభ వరకు ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిందన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం తపించారని, ఫ్యాక్షన్ వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ముఠాకక్షలకు వ్యతిరేకంగా శాంతియాత్రలు చేశారని వెల్లడించారు. తనను కలిసిన 24 గంటల్లోనే నాగిరెడ్డి మరణించడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని, పేదలందరికీ ఇళ్లు కట్టించాలని తనను కోరారని, అదే ఆయన చివరి కోరిక అని చెప్పారు. భూమా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రయ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సంతాప తీర్మానం తరువాత సభ వాయిదా పడనుంది. బుధవారం అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.