బుక్ మైషో భారీ నిధుల సమీకరణ
రూ.550 కోట్ల డి రౌండ్ ఫండింగ్
న్యూఢిల్లీ: బుక్‌మైషో(బీఎంఎస్)ను నిర్వహించే బిగ్‌ట్రీ ఎంటర్టైన్మెంట్ తాజాగా రూ.550 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధుల్లో అధిక భాగం అమెరికాకు చెందిన స్ట్రైప్స్ గ్రూప్ నుంచి లభించగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు-నెట్వర్క్ 18, యాక్సెల్ పార్ట్నర్స్, ఎస్ఏఐఎఫ్ పార్ట్‌నర్స్‌లు కూడా ఇన్వెస్ట్ చేశాయి. కాగా స్ట్రైప్స్ గ్రూప్‌కు భారత మార్కెట్లో ఇదే తొలి పెట్టుబడి. ఈ డి రౌండ్ ఫండింగ్‌లోనే బిగ్‌ట్రీ ఎంటర్టైన్మెంట్ అధిక మొత్తంలో పెట్టుబడులను సమీకరించింది. ఈ తాజా నిధులతో దేశీయ మార్కెట్లో ఆఫర్స్‌ను మరింత పటిష్టం చేస్తామని, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని బుక్‌మైషో పేర్కొంది. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌పై కంటెంట్‌ను మరింత శక్తివంతం చేస్తామని, బిగ్ డేటా, ఎనలిటిక్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను కొనుగోలు చేస్తామని బుక్‌మైషో సీఈవో, వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆశిష్ హేమ్జ్రని వెల్లడించారు.
ఆదాయం వంద శాతం వృద్ధి...
కాగా ఇప్పటివరకూ బుక్‌మైషో రూ.200 కోట్ల నిధులను సమీకరించిందని, ప్రస్తుత రౌండ్ నిధుల సమీకరణ పరంగా చూస్తే కంపెనీ విలువ రూ.3,500 కోట్ల సమీపంలో ఉంటుందని హేమ్జ్రని చెప్పారు. గత నెలలోనే ఇండోనేసియా మార్కెట్లోకి ప్రవేశించామని, శ్రీలంక మార్కెట్లోకి ఈ నెలలో ప్రవేశిస్తామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బీఎంఎస్ ప్లాట్‌ఫామ్‌పై 10 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఈ ఏడాది ఆదాయం 100 శాతం వృద్ధి చెందుతుందన్నారు.