బీసీ హాస్టళ్లలో బయో మెట్రిక్ విధానం
కడప రూరల్ : త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లలో బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడతామని రాష్ట్ర వెనుకబడిన తరగతులు, జౌళి, చేనేత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో గురువారం నిర్వహించిన చంద్రన్న రుణ మేళాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన నగరంలోని బీసీ హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 897 ప్రీ మెట్రిక్, 349 పోస్టు మెట్రిక్ హాస్టళ్లతోపాటు 32 రెసిడెన్షియల్ స్కూళ్లలో బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. త్వరలో బీసీ హాస్టళ్లలో బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టడంతోపాటు హాస్టళ్లన్నింటినీ రెసిడెన్షియల్ హాస్టళ్లుగా (విద్యాభ్యాసం, వసతి ఒకేచోట) మారుస్తామన్నారు.
అనంతరం ఆయన చంద్రన్న రుణమేళాలో మాట్లాడుతూ.. బీసీ వర్గాల వృత్తిదారుల అభ్యున్నతి కోసం మళ్లీ ఆదరణ పథకాన్ని ప్రవేశ పెడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ తరహాలోనే రూ.6,640 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కేవీ రమణ, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లికార్జున పాల్గొన్నారు.