ఇంతేరా ఈ జీవితం... తిరిగే రంగుల రాట్నం!
పాటతత్వం
ఇంతేరా ఈ జీవితం... తిరిగే రంగుల రాట్నం! కొన్ని పాటలు ఇలా వినిపించి అలా మాయమవుతుంటాయి. కొన్ని పాటలు మాత్రం కాలాతీతంగా నిలుస్తాయి. కాలంతో పాటు నడుస్తాయి. ఆ పాటల్లోని తాత్వికత ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త చూపును ఇస్తూనే ఉంటుంది. బి.యన్.రెడ్డి దర్శకత్వంలో 1966లో వచ్చిన ‘రంగుల రాట్నం’ చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాలో శ్రీరామ వెంకట భుజంగరాయశర్మ రాసిన ‘కలిమి నిలవదు లేమి మిగలదు’ నాకు చాలా ఇష్టమైన పాట. సినిమాలో ఇది నేపథ్య గీతంగా వస్తుంది.
‘భారతదేశానికి పట్టుకొమ్మలైన పల్లెసీమలు.
సిరిసంపదలు, పచ్చిక బయళ్లతో కళకళలాడిన పల్లెలు. ప్రజలు ఒళ్లు వంచి కష్టపడి ఉన్నదానితో సంతృప్తికరంగా జీవించిన కాలం’....ఈ పరిస్థితి మారిపోయి కష్టపడేవారు ఒక్కరై, ఖర్చు చేసేవారు పదిమందై, వసతులు తక్కువై, కష్టం ఎక్కువై, వ్యవసాయంపై ఆసక్తి తగ్గి ఆస్తికి మించిన అప్పులు పెరిగాయి. సరిగ్గా ఇలాంటి కాలంలో... బాగా బతికి పల్లె నుంచి పట్నానికి వెళ్లిన ఒక కుటుంబ కథ ఈ చిత్రం.
ఈ పాట సినిమా కథలో అంతర్లీనమైనట్టు కనిపించినా...లోకరీతిని స్పష్టంగా అక్షరాల్లో చెబుతుంది.
ఈ సినిమాలో బాగా బతికిన ఒక కుటుంబం, ఆతిథ్యానికి మారు పేరుగా నిలిచిన కుటుంబం అప్పుల పాలవుతుంది. ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతాయి.
‘ఈ లోకంలో ఏది శాశ్వతం?’ అనే ప్రశ్న ఈ పాట పల్లవిలో ఇలా ప్రతిధ్వనిస్తుంది...
‘కలిమి నిలవదు
లేమి మిగలదు
కల కాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్లే చెమ్మగిల్లవా?
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నం’
దారులు అనేకంగా కనిపిస్తాయి.
అయితే వాటి గమ్యం ఒకటే. పేదవాళ్లుగా, ధనవంతులుగా మనుషులు రకరకాలుగా కనిపిస్తారు. అయినా అందరొకటే. పేదవాళ్లు అయినంత మాత్రాన....వారి నరాల్లో నెత్తురు, డబ్బు బాగా ఉంది కాబట్టి ... ధనవంతుల నరాల్లో అమృతం ప్రవహించదు. గమ్యం చేరడానికి పేదవాడు తన రెండు కాళ్లను నమ్ముకున్నా, ధనవంతుడు ఖరీదైన కారుని నమ్ముకున్నా...చనిపోయాక ఇద్దరూ వెళ్లేది పాడె పైనే. ఈ సత్యం ఈ చరణాల్లో కనిపిస్తుంది.
‘ఏనుగుపైన నవాబు
పల్లకిలోని షరాబు
గుర్రం మీద జనాబు
గాడిదపైన గరీబు
నడిచే దారుల గమ్యమొకటే
నడిపే వానికి అందరొకటే’
ఇద్దరు అన్నదమ్ములు.
సూర్యం, వాసు.
చిన్నోడు వాసు(చంద్రమోహన్) త్యాగం చేసి కష్టపడి పెద్దోడు సూర్యం(రామ్మోహన్)ని చదివిస్తాడు. పెద్దోడు లాయర్ అవుతాడు. ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొంత కాలానికే తాను నడిచొచ్చిన దారిని మరిచిపోతాడు. డబ్బున్న పెళ్లాం ముందు...పేద తల్లి, పేద తమ్ముడు, పేద చెల్లి... మరింత పేదగా కనిపిస్తారు.
ఇక ఆయన శ్రీమతి గురించి అయితే చెప్పక్కర్లేదు. అత్త, మరుదులను ఆమె చీదరించుకుంటుంది. వాళ్లను దూరంగా పెట్టడమే నాగరికం అనుకుంటుంది.
అందుకే తమ్ముడు ఒక సందర్భంలో అన్నను ఉద్దేశించి ఇలా అంటాడు...
‘‘సీతమ్మ కొడుకు కాదు... వనజ మొగుడు’’
ఈ పరిస్థితి చరణాల్లో ఇలా వ్యక్తం అవుతుంది...
‘త్యాగం ఒకరిది
ఫలితం ఒకరిది
అమ్మ ప్రాణమా ఇద్దరిది
ఎదలు, బాధలు, కష్టగాథలు... చివరకు కంచికి వెళ్లే కథలే’
ఒకరి బాధ... ఇంకొకరి బాధ కాకపోవచ్చు. ఆ బాధ అవతలి వ్యక్తికి సంతోషం కూడా కలిగించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కవి ఇలా అంటారు...
‘ఇరుగింటిలోన ఖేదం
పొరుగింటిలోన ప్రమోదం’
ఎవరికి ఏదో అయిందని కాలం ఒక దగ్గర ఆగదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా దిగులుగా ఒక దగ్గర కూర్చోదు. ఈ వాస్తవం...
‘ఎవరు కులికినా ఎవరు కుమిలినా
ఆగదు కాలం ఆగదు
జీవనవాహిని ఆగదు’
ఈ పాటలో ప్రతి వాక్యం లోకరీతిని వ్యాఖ్యానించే పదాల సమహారం. ఈ పాట విన్నప్పుడల్లా "Life doesn't listen to your logic. It goes on its own way undisturbed' అనే ప్రసిద్ధ వాక్యం గుర్తుకొస్తుంది.