Bona
-
ప్రజాభవన్‌లో వైభవంగా బోనాలు
లక్డీకాపూల్: ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం తెలంగాణ ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజాభవన్‌కి విచ్చేసిన సీఎం, మంత్రులకు భట్టి దంపతులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భట్టి దంపతులు బోనాలకు, మహంకాళి అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత నల్ల పోచమ్మ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశా రు. అనంతరం మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఎమ్మెల్యే ఎన్ ఉత్తమ్ పద్మావతి, పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు బోనమెత్తారు. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి జోగిని తలపై ఎత్తారు.డిప్యూటీ సీఎం నివాసం నుంచి ప్రజాభవన్ ఆవరణలోని నల్ల పోచమ్మ దేవాల యం వరకు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యా సాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి భట్టి విక్రమార్క దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమరి్పంచారు. నల్ల పోచమ్మ దేవాలయంలో భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. -
అంగరంగవైభవంగా బోనాల వేడుకలు
బోనాల వేడుకలు వాడవాడలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాల్లో బోనాలు ఎత్తుకొని మహిళలు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. వైభవోపేతంగాజరిగిన బోనాల వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్నారు.. ఫిలింనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఖైరతాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి, ఎన్బీటీ నగర్‌లోని ఎల్లమ్మ దేవాలయంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి, పంజగుట్ట ప్రతాప్‌నగర్‌లో వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని వెంకటేశ్వరనగర్ బస్తీలోని శ్రీ పోచమ్మ దేవాలయంలో మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బి. భారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఊరేగింపుల్లో పోతరాజులు సందడి చేశారు. నృత్యాలతో యువకులు ఆకట్టుకుంటున్నారు. ఎటు చూసినా బోనాల సందడి కనువిందు చేసింది. -
మహంకాళి ఆలయంలో ప్రారంభమైన బోనాలు
ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరీ దేవాలయంలో 67వ బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గణపతి పూజ, పుణ్యహవచనము, రుత్విక్ వరణం, దీక్షారాధన, అఖండ దీపస్థాపన, నవగ్రహారాధన, కలశస్థాపన, అమ్మవారి అభిషేకం, సాయంత్రం 6 గంటలకు అమ్మ వారికి సహస్రనామార్చన, కుంకుమార్చన, మహా మంగళ హారతి తదితర కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ కమిటీ చైర్మన్ జె.శంకరయ్య గౌడ్, కమిటీ సభ్యులు సురేందర్ ముదిరాజ్, మధుసూదన్ గౌడ్, వి.అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
భళీ బీరన్న..
ఉర్సు, కరీమాబాద్లలో వైభవంగా బీరన్న బోనాలు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ‘ గావుపట్టే’ దృశ్యం కరీమాబాద్ : ‘భళీ బీరన్నా.. భళీ’ అంటూ కురుమల కేరింతలు.. నృత్యాలు.. డప్పుల చప్పుళ్లు ఓ వైపు.. బోనాలతో బారులు తీరిన వనితలు మరో వైపు. వెరసి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వరంగల్ నగరంలోని ఉర్సు, కరీమాబాద్ ఏరియూల్లో సందడి కనిపించింది. పోతరాజుల కత్తుల విన్యాసాలు ఉత్సాహాన్ని నింపారుు. గొర్రెపిల్లను గావుపట్టే కీలక సమయంలో కురుమలు కదన రంగంలోకి దూకినట్లు కదిలిరావడం ఉత్తేజాన్ని అందించింది. మహిళలు గావుపట్టిన గొర్రెపిల్ల మీది నుంచి వెళ్లి బీరన్నగుడిలో బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాలను కరీమాబాద్ బీరన్నస్వామి ఆలయ కమిటీ, ఉర్సు బీరన్న దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉర్సు బీరన్న ఆలయ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఉర్సు నుంచి వచ్చిన కురుమలు చెట్లవారిగడ్డ మీదుగా బీరన్నగుడి వద్దకు చేరుకోగా, కరీమాబాద్ బీరన్న గుడి అధ్యక్షుడు కోరె కృష్ణ ఆధ్వర్యంలో కరీమాబాద్ కురుమలు రామస్వామి గుడి నుంచి బురుజు మీదుగా బీరన్న ఆలయూనికి వెళ్లారు. దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు.. బీరన్న బోనాల పండుగ సందర్భంగా ఉర్సు, కరీమాబాద్ బీరన్న దేవాలయాలను ఎమ్మెల్యే కొండా సురేఖ దర్శించుకున్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో పాటు కార్పొరేటర్లు మరుపల్ల భాగ్యలక్ష్మి, మేడిది రజిత, కత్తెరశాల వేణు, కేడల పద్మ తదితరులు బీరన్నగుడిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఉర్సు, కరీమాబాద్ బీరన్న ఆలయ కమిటీల బాధ్యులు మరుపల్ల రవి, కోరె కృష్ణ, ఈర రాధాకృష్ణ, మురికి కుమారస్వామి, వాసూరి శ్రీనివాస్, కడారి కృష్ణ, గోవింద్ కొంరయ్య, మండల ప్రమీల, దాయ్యల సుధాకర్, నరిగె బక్కయ్య, కాళేశ్వర్, ఈశ్వరప్రసాద్, కోరె నాగరాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఇంతెజార్గంజ్ సీఐ భీంశర్మ బందోబస్తు నిర్వహించారు. ఎస్సైలు రవీందర్, పీఎస్సై నర్సింహారావు, పీసీలు రమేష్, శ్రీనివాస్, కిరణ్, సిబ్బంది విధులు నిర్వర్తించారు. -
రేపటి నుంచి తెలంగాణ బోనాలు..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే బోనాల ఉత్సవాలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు లంగర్‌హౌస్, గోల్కొండ వేదిక కానున్నాయి. నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే అమ్మవారి బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై, ఇక్కడే ముగియనున్నాయి. ఆషాఢ మాసం అమావాస్య తరువాత వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారాల్లో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. గోల్కొండ కోటపై వెలసిన జగదాంబికా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి నెల రోజుల పాటు ప్రతి గురు, ఆది వారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు. నజర్ బోనం, భారీ తొట్టెలు.. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే మొదటి పూజలో అమ్మవారికి లంగర్‌హౌస్ వాసులు నజర్ బోనం సమర్పిస్తారు. గురువారం లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, 32 అడుగుల ఎత్తై భారీ తొట్టెలను తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తర ఫున పట్టు వస్త్రాలు.. బోనాల ప్రారంభ ఊరేగింపులో మంత్రులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు సమర్పించి ఊరేగింపును ప్రారంభిస్తారు. చోటా బజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు నిర్వహించి అక్కడి నుండి బోనాలతో అమ్మవారికి పల్లకిలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించడంతో మొదటి పూజ ముగియనుంది. -
భూనబోనం
ఆషాఢం... మూఢం... కాదు కాదు.. ఆషాఢం... బోనం... ఇల్లిల్లూ పచ్చగా కళకళలాడే మాసం... బోనాల కిరీటాలతో నిండిన శిరస్సులతో మెరిసిపోయే మాసం... భూ...నభోనమంతా మురిసిపోయే మాసం... తెలంగాణ ఆడపడుచుల పట్టు పరికి ణీలతో మిలమిల మెరిసే మాసం... బోనాలకు చద్దులు ఎలాగూ చేసుకుంటారు... వాటితో పాటు మరిన్ని వంటలు చేసుకుందాం... అందరితో కలిసి హాయిగా కడుపారా ఈ బోనాలను ఆరగిద్దాం... బగారన్నం కావలసినవి: బియ్యం - 200 గ్రా; ఉల్లిపాయ - 1; పుదీనా ఆకులు - 10; పసుపు - పావు టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి - 4; బిర్యానీ ఆకు - 3; లవంగాలు - 6; ఏలకులు - 4; దాల్చిన చెక్క - 3 చిన్న ముక్కలు; షాజీరా - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: బియ్యం కడిగి నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టి నీళ్లు తీసేయాలి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి, పుదీనా ఆకులు వేసి మెత్తబడేవరకు వేయించి, లవంగాలు, ఏలకులు, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కొద్దిగా వేయించి బియ్యానికి తగినట్టుగా (పాత బియ్యం ఒకటికి ఒకటిన్నర) నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఉడికించాలి బియ్యం బాగా ఉడికి, నీరంతా ఇగిరిపోయాక మంట పూర్తిగా తగ్గించి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి దింపేయాలి. (అన్నం పొడిపొడిగా ఉండాలి). మసాలా పూరీలు కావలసినవి: మైదా పిండి - 3 కప్పులు; సెనగ పిండి - 2 కప్పులు; కరివేపాకు - 3 రెమ్మలు; మెంతి కూర తరుగు - 2 టీ స్పూన్లు; పసుపు - పావు టీ స్పూను; కారం - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; గరం మసాలా - 1 టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; షాజీరా - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడా తయారీ: ఒక గిన్నెలో జల్లించిన మైదాపిండిలో కాస్త ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా తడిపి నూనె వేసి కలిపి మూతపెట్టి ఉంచాలి వేరే గిన్నెలో సెనగ పిండి తీసుకుని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, షాజీరా, సన్నగా తరిగిన కరివేపాకు, మెంతికూర తరుగు వేయాలి కొద్దిగా నీళ్లు కలిపి పలుచగా చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు జత చేసి తగినన్ని నీళ్లు జల్లుకుంటూ కాస్త గట్టిగా ముద్దలా తడిపి పెట్టుకోవాలి అరగంట తర్వాత రెండూ విడివిడిగా మృదువుగా పిసికి ఉండలుగా చేసుకోవాలి సెనగ పిండి ముద్ద చిన్నగా, గోధుమ పిండి ముద్ద కాస్త పెద్దగా చేసుకోవాలి గోధుమ పిండి ముద్ద చేతిలోకి తీసుకుని కాస్త వెడల్పుగా చేసుకుని మధ్యలో సెనగ పిండి ముద్ద పెట్టి అన్నివైపుల నుండి మూసేసి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకుని పెట్టుకోవాలి బాణలిలో నూనె వేసి వేడి చేసుకోవాలి ఒక్కో ముద్ద తీసుకుని పలుచగా పూరీలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చి తీసేయాలి ఈ పూరీలు నాలుగైదు రోజుల వరకు నిలవ ఉంటాయి. వడప్పలు కావలసినవి: బియ్యప్పిండి - అర కేజీ; సెనగ పప్పు - అర కప్పు; నువ్వులు - 2 టీ స్పూన్లు; పల్లీలు - అర కప్పు; పచ్చి కారం ముద్ద - పావు కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత. తయారీ: సెనగ పప్పు శుభ్రం చేసుకుని నీళ్లు పోసి గంట సేపు నాననివ్వాలి పల్లీలు వేయించి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా నల క్కొట్టి పెట్టుకోవాలి గిన్నెతో పిండి కొలుచుకుని ఒకటికి సగం నీళ్లు లెక్కతో తీసుకుని మరిగించాక, ఇందులో పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, నువ్వులు, పల్లీలు, సెనగ పప్పు, గరిటెడు నూనె, తగినంత ఉప్పు వేయాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు జల్లించిన బియ్యప్పిండి వేసి కలిపి దింపేసి మూత పెట్టాలి చల్లారిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసి కలిపి కొద్దికొద్దిగా తీసుకుని మెత్తగా పిసికి ముద్దలా చేసుకోవాలి నిమ్మకాయంత ఉండలు చేసుకుని ప్లాస్టిక్ కాగితం లేదా పూరీ ఒత్తుకునే మిషనులో మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి (వీటిని సన్న మంట మీద నిదానంగా వేయిస్తే లోపలి వరకు బాగా ఉడికి కరకరలాడుతూ ఉంటాయి). మూడు పప్పుల గారెలు కావలసినవి: మినప్పప్పు - కప్పు; పెసర పప్పు - కప్పు; సెనగ పప్పు - కప్పు; పచ్చి మిర్చి - 3; కరివేపాకు - 4 రెమ్మలు; జీలకర్ర - 2 టీ స్పూన్లు; కారం - 2 టీ స్పూన్లు; అల్లం - చిన్న ముక్క; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత. తయారీ: ముందుగా పప్పులన్నీ కలిపి శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి కనీసం మూడు గంటలు నానబెట్టాక, తీసి జల్లెడలో వేయాలి నీరంతా పోయాక మిక్సీలో వేసి సగం బరకగా, సగం మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బిన పిండిలో సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి బాణలిలో నూనె వేడి చేసుకోవాలి రుబ్బిన పిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని ప్లాస్టిక్ కవర్ లేదా తడి చేసుకున్న అరచేతిలో కాస్త వెడల్పుగా ఒత్తుకుని మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండువైపులా కాల్చుకోవాలి. -
ఐటీ బోనం
వాళ్లంతా ఐటీ ఉద్యోగులు. కంపెనీ వార్షికోత్సవంలో సందడే కాదు.. సంప్రదాయం ప్రతిబింబించాలని భావించారు. అందుకే భాగ్యనగరంలో వైభవంగా జరిపే బోనాల పండుగను ఉద్యోగులంతా కలసి చేసుకున్నారు. మహిళా ఉద్యోగినులు బోనమెత్తారు. అమ్మోరు భక్తిగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మరికొందరు పోతరాజు వేషాల్లో ఇరగదీశారు. మరో ఉద్యోగిని మౌనప్రియ భవిష్యవాణి వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇలా షేక్‌పేట్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం డీఎస్టీ ఇండియా ఇన్వెస్ట్స్ వార్షికోత్సవం తెలంగాణ సంప్రదాయానికి, హైదరాబాద్ అస్తిత్వానికి వేదికగా మారింది. వేడుకలో భాగంగా గాయకుడు అంజూ గుర్వారా సంగీత విభావరి అందరినీ అలరించింది. -
ఉద్యమంలో బతుకమ్మ, బోనాలు ప్రత్యేకం
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో బతుకమ్మ, బోనాలకు ప్రత్యేక స్థానం ఉంద ని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని రిజర్వాయర్ కట్టపై అభయాంజనేయ దేవస్థానం వద్ద గురువారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో డిప్యూటీ సీఎం రాజయ్యతో పాటు జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ హాజరయ్యారు. ముందుగా స్థానిక చౌరస్తా వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వారు అధికారులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి కాసేపు చీపుర్లతో రోడ్డును ఊడ్చారు. ఇటీవల అస్వస్థతకు గురైన స్థానిక సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్‌ను అతడి నివాసంలో పరామర్శించా రు. డిప్యూటీ సీఎం రాజయ్య తన తండ్రి వెంకటయ్య స్మారకార్థం స్థానిక రిజర్వాయర్ కట్టపై మహిళలు బతుకమ్మ ఆడేస్థలంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి, పిల్ల విగ్రహాలను ఆవి ష్కరించారు. తర్వాత మహిళలతో కలిసి డిప్యూటీ సీఎం రాజయ్య, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణంగా దేవుళ్లను పూలతో పూజించడం ఆనవాయితీ, అయితే ప్రకృతి సిద్ధంగా లభించే పూలను పూజిస్తూ పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మూర్తి, ఎంపీటీసీ సభ్యుడు సంపత్‌రావు, టీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, కన్వీనర్ అక్కినపెల్లి బాలరాజు, సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్, నాయకులు గట్టు రమేష్, బంగ్లా శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు సిరిగిరి శ్రీనివాస్, గన్ను నర్సింహులు, ఎండీ.ఖాజామొహీనొద్దీన్, జొన్నల రాజేశ్వరరా వు, తెల్లాకుల రామకృష్ణ, గోలి రాజశేఖర్, కుంభం కుమార్, పెసరు సారయ్య, చింత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దిగివస్తున్న కూరగాయల ధరలు
మెహిదీపట్నం: కూరగాయల ధరలు కాస్త దిగి రావడంతో వినియోగదారులు ఊరట చెందుతున్నారు. నెల క్రితం రూ.50 పలికిన కిలో టమాట ప్రస్తుతం రూ.20కి దిగి వచ్చింది. వర్షాలు కురవడంతో కూరగాయల దిగుబడి నెమ్మదిగా పెరుగుతోంది. ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య వరకు కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. ప్రధాన పండుగలైన బోనాలు, రంజాన్ సమయంలో ధరలు సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయాయి. ఓ సందర్భంలో కిలో టమాట రూ.80కి చేరుకుంది. పచ్చిమిర్చి కిలో రూ.100, బీన్స్ రూ.120తో పాటు కూరగాయలు ఏవైనా కిలో రూ. 30 పైనే ఉండేవి. వర్షాలు ఆలస్యంగా పడడంతో ధరలపై చూపింది. ప్రస్తుతం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. మెహిదీపట్నం రైతుబజార్, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లకి కూరగాయలు భారీగా వస్తున్నాయి. శివారు ప్రాంతాలైన మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, షాద్‌నగర్ నుంచి క్రమంగా కూరగాయల దిగుమతి పెరుగుతుంది. మరో రెండు వారాల్లో ధరలు ఇంకా దిగి వస్తాయని వ్యాపారులు అంటున్నారు. -
శాంతియుతంగా పండుగలు
బహదూర్‌పురా: రంజాన్, బోనాల పండుగను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. చౌమహల్లా ప్యాలెస్‌లో బుధవారం నగర పోలీసుల కమిషనర్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. జామే నిజామియా ఉలేమాలు సందేశాన్ని ఇచ్చిన అనంతరం కమిషనర్ ప్రసంగించారు. పాతబస్తీ ప్రజలందరూ గంగా, జమునా రీతిలో రంజాన్, బోనాల ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. రంజాన్, బోనాల పండుగ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పాతనగరంలో రంజాన్ మాసమే కాకుండా మిగతా అన్ని నెలలు కూడా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పాతబస్తీ మతసామరస్యానికి సూచిక అనేది రంజాన్, బోనాల పండుగ ద్వారా తెలపాలన్నారు. జాయింట్ సీపీ మల్లా రెడ్డి మాట్లాడుతూ రంజాన్ నెల మతసామరస్యాన్ని, మనవత్వాన్ని చాటే నెల అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, యాంటీ కరప్షన్ బ్యూరో డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, పాషా ఖాద్రీ, ఖలీం సాహేబ్, మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్, జాయింట్ సీపీ ఎం.ఎం. భగత్, బిలాల్ కమిటీ చైర్మన్, డీసీపీలు ఎస్.ఎస్.త్రిపాఠి, కమలాసన్ రెడ్డి, శివకాశి దమోదర్, జామే నిజామియా ముఫ్తీలు, ఉలేమాలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ముగిసిన ‘కోట’ బోనాలు
గోల్కొండ, న్యూస్‌లైన్: డప్పుల చప్పుళ్లు... సంప్రదాయ నృత్యాలు... పోతరాజుల విన్యాసాలు... శివసతుల పూనకాలు... పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు... వెరసి గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాలు గురువారం ఘనంగా ముగిశాయి. అమ్మవారికి 9వ పూజ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభమై చివరగా ముగిసే గోల్కొండకోట బోనాలకు ఉన్న చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా.. గురువారం జరిగిన పూజలకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గోల్కొండలోని నగీనాబాగ్తో పాటు ఇతర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి. గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు వంటలు చేసుకొని నైవేద్యం తీసుకొని తలలపై బోనాలతో కోటపై కొలువుదీరిన అమ్మవార్ల వద్దకు బయలుదేరారు. అమ్మవారి 9వ పూజ భాగంలో వృత్తి పనివారల సంఘం సభ్యులైన కుమ్మరి వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగీనాబ్యారక్స్లో వివిధ రకాల నైవేద్యాలతో పాటు సాకను తయారు చేశారు. అనంతరం వంటలు, నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించడానికి డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో కోటపైకి బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా పోతరాజుల విన్యాసాలు, శివసతుల పూనకాలతో కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చివరి పూజ రోజు బీజేపీ సీనియర్ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, లంగర్‌హౌస్ కార్పొరేటర్ ఉదయ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవర కరుణాకర్, సంఘ సేవకులు ఎస్.రాజు ఉస్తాద్, వృత్తిపనివార్ల సంఘం సలహాదారు కరణ్‌కుమార్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. పూజారులు అనంతచారి, బొమ్మల సాయిబాబాచారి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా గోల్కొండ తహసీల్దార్ చంద్రావతి తన సిబ్బందితో కలిసి కోటపై ఉన్న అమ్మవార్లను దర్శించుకున్నారు.