శాంతియుతంగా పండుగలు
బహదూర్‌పురా: రంజాన్, బోనాల పండుగను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. చౌమహల్లా ప్యాలెస్‌లో బుధవారం నగర పోలీసుల కమిషనర్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. జామే నిజామియా ఉలేమాలు సందేశాన్ని ఇచ్చిన అనంతరం కమిషనర్ ప్రసంగించారు. పాతబస్తీ ప్రజలందరూ గంగా, జమునా రీతిలో రంజాన్, బోనాల ఉత్సవాలను జరుపుకోవాలన్నారు.
రంజాన్, బోనాల పండుగ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పాతనగరంలో రంజాన్ మాసమే కాకుండా మిగతా అన్ని నెలలు కూడా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పాతబస్తీ మతసామరస్యానికి సూచిక అనేది రంజాన్, బోనాల పండుగ ద్వారా తెలపాలన్నారు. జాయింట్ సీపీ మల్లా రెడ్డి మాట్లాడుతూ రంజాన్ నెల మతసామరస్యాన్ని, మనవత్వాన్ని చాటే నెల అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, యాంటీ కరప్షన్ బ్యూరో డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, పాషా ఖాద్రీ, ఖలీం సాహేబ్, మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్, జాయింట్ సీపీ ఎం.ఎం. భగత్, బిలాల్ కమిటీ చైర్మన్, డీసీపీలు ఎస్.ఎస్.త్రిపాఠి, కమలాసన్ రెడ్డి, శివకాశి దమోదర్, జామే నిజామియా ముఫ్తీలు, ఉలేమాలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.