దిగివస్తున్న కూరగాయల ధరలు
మెహిదీపట్నం: కూరగాయల ధరలు కాస్త దిగి రావడంతో వినియోగదారులు ఊరట చెందుతున్నారు. నెల క్రితం రూ.50 పలికిన కిలో టమాట ప్రస్తుతం రూ.20కి దిగి వచ్చింది. వర్షాలు కురవడంతో కూరగాయల దిగుబడి నెమ్మదిగా పెరుగుతోంది. ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య వరకు కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. ప్రధాన పండుగలైన బోనాలు, రంజాన్ సమయంలో ధరలు సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయాయి.
ఓ సందర్భంలో కిలో టమాట రూ.80కి చేరుకుంది. పచ్చిమిర్చి కిలో రూ.100, బీన్స్ రూ.120తో పాటు కూరగాయలు ఏవైనా కిలో రూ. 30 పైనే ఉండేవి. వర్షాలు ఆలస్యంగా పడడంతో ధరలపై చూపింది. ప్రస్తుతం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. మెహిదీపట్నం రైతుబజార్, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లకి కూరగాయలు భారీగా వస్తున్నాయి. శివారు ప్రాంతాలైన మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్, షాద్‌నగర్ నుంచి క్రమంగా కూరగాయల దిగుమతి పెరుగుతుంది. మరో రెండు వారాల్లో ధరలు ఇంకా దిగి వస్తాయని వ్యాపారులు అంటున్నారు.