ముగిసిన ‘కోట’ బోనాలు
Published Fri, Aug 9 2013 5:07 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
గోల్కొండ, న్యూస్‌లైన్: డప్పుల చప్పుళ్లు... సంప్రదాయ నృత్యాలు... పోతరాజుల విన్యాసాలు... శివసతుల పూనకాలు... పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు... వెరసి గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాలు గురువారం ఘనంగా ముగిశాయి.
అమ్మవారికి 9వ పూజ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభమై చివరగా ముగిసే గోల్కొండకోట బోనాలకు ఉన్న చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా.. గురువారం జరిగిన పూజలకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గోల్కొండలోని నగీనాబాగ్‌తో పాటు ఇతర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి. గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు వంటలు చేసుకొని నైవేద్యం తీసుకొని తలలపై బోనాలతో కోటపై కొలువుదీరిన అమ్మవార్ల వద్దకు బయలుదేరారు. అమ్మవారి 9వ పూజ భాగంలో వృత్తి పనివారల సంఘం సభ్యులైన కుమ్మరి వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగీనాబ్యారక్స్‌లో వివిధ రకాల నైవేద్యాలతో పాటు సాకను తయారు చేశారు.
అనంతరం వంటలు, నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించడానికి డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో కోటపైకి బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా పోతరాజుల విన్యాసాలు, శివసతుల పూనకాలతో కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చివరి పూజ రోజు బీజేపీ సీనియర్ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, లంగర్‌హౌస్ కార్పొరేటర్ ఉదయ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవర కరుణాకర్, సంఘ సేవకులు ఎస్.రాజు ఉస్తాద్, వృత్తిపనివార్ల సంఘం సలహాదారు కరణ్‌కుమార్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. పూజారులు అనంతచారి, బొమ్మల సాయిబాబాచారి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా గోల్కొండ తహసీల్దార్ చంద్రావతి తన సిబ్బందితో కలిసి కోటపై ఉన్న అమ్మవార్లను దర్శించుకున్నారు.
Advertisement