విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గౌరీశంకర్
- పుస్తక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం
- హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్
ఖమ్మం: నీళ్లు, నిధులు, కొలువుల కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణను జ్ఞాన తెలంగాణగా నిర్మించుకుంటేనే దేశంలోని ఇతర ప్రాంతాలకంటే అన్ని రంగాల్లో ముందుంటామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, ప్రముఖ కవి జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఖమ్మం నగరంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్‌తో కలిసి మాట్లాడారు. తెలంగాణలోని ప్రముఖ ప్రదేశాలు, చారిత్రక నేపథ్యం, కవులు, రచయితలు, త్యాగమూర్తుల చరిత్రలను వెలికితీసే నా«ధుడే కరువయ్యాడన్నారు. దాశరథి, జమలాపురం కేశవరావు, చందాల కేశవదాసు మొదలైన కవులకు నేటికీ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాషా పరిరక్షణ, వారసత్వాన్ని నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో పుస్తక ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఖమ్మం నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. పుస్తక పఠనం ద్వారా తెలంగాణ సబ్బండ జాతి సాహితీ అధ్యయనం వైపు మళ్లడం శుభసూచికమన్నారు. ఖమ్మంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనకు నిర్వహణ కమిటీ అ«ధ్యక్షుడిగా మువ్వా శ్రీనివాసరావు, కార్యదర్శిగా రవిమారుతి, సహాయ కార్యదర్శిగా కేఎస్.రామారావు, జాయింట్ సెక్రటరీగా ఆనందాచారి, ఆర్గనైజేషన్ కార్యదర్శులుగా కవి సీతారాం, ప్రసేన్‌లను నియమించామని చెప్పారు. జిల్లా ప్రజలు పుస్తక ప్రదర్శనకు తరలివచ్చి ఆదరించాలని కోరారు.