ఇక.. ఉద్యమాలకే అంకితం
Published Thu, Aug 4 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ఉద్యోగ సంకెళ్ల నుంచి
బయటపడ్డాను
కన్నకొడుకు కన్నా కార్మిక హక్కులకే ప్రాధాన్యం
యాజమాన్యం దాషీ్టకానికి ఏనాడూ జంకలేదు
‘సాక్షి’తో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్
ౖయెటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : ఉద్యోగం అనే సంకెళ్ల నుంచి బయటపడ్డాను.. మలి జీవితాన్ని కార్మికవర్గ ఆత్మగౌరవ పోరాట ఉద్యమానికే అంకితం చేస్తా.. అని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ అన్నారు. ఓసీపీ–3 ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా ఉద్యోగ విరమణ పొందిన ఆయన తన మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు రియాజ్ మాటల్లోనే..
నెలకు రూ.60 జీతంతో మొదలు
పెద్దపల్లిలో ఐటీఐ చేస్తున్నపుడు క్యాంపస్ సెలక్షన్‌లో సింగరేణి ఉద్యోగం వచ్చింది. 1975లో వీకే–7 గనిలో క్యాప్టివ్ ట్రెయినీగా నెలకు రూ.60 జీతంతో చేరాను. రామగుండం ఏరియా వర్క్‌షాప్‌లో అంప్రెంటిస్‌గా వచ్చింది. ఇంజినీర్ల దాదాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో 1977లో జీడీకే–2ఏ గనికి బదిలీ చేశారు. ట్రెయినీగా ఉండి సమ్మెలోకి వెళ్లడంతో డ్యూటీకి రావాలని బెదిరించినా వినకపోతే చార్జిషీట్ ఇచ్చారు. అప్పుటి నుంచే ఈ పర్వం మొదలైంది.
సమస్యల నుంచి పుట్టిన యూనియన్
1977లో ఇంజనీర్ల ఆగడాలకు వ్యతిరేకంగా, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా 1500 మంది టెక్నీషియన్లను ఒక్కతాటిపై చేర్చి సింగరేణిలో ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేశా. 1978లో హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు అనుబంధం చేశాం. క్రాఫ్ట్ సంఘంగా ముద్రవేసి మిగితా సంఘాల నాయకులు మమ్ముల్ని యాజమాన్యంతో మాట్లాడనీయలేదు. 1985లో 12 మంది ఎమ్మెల్యేలతో మహాసభ పెట్టి నాయిని నర్సింహారెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. అప్పుడే సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్‌గా ఆవిర్భవించింది.
హక్కులకే ప్రాధాన్యం
ఓపెన్‌కాస్ట్ కార్మికులకు ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని కోరుతూ అమరణ నిరాహాదీక్ష చేస్తున్న క్రమంలో యాజమాన్యం విచ్ఛిన్నం చేయాలని చూసింది. రెండు రోజుల అమరణ దీక్ష తర్వాత ఏడాది వయసు బాబు నీటి ట్యాంకులో పడి మృతి చెందాడు. అయినా దీక్ష విరమించకుండా కార్మికుల హక్కులకే ప్రాధాన్యమిచ్చా. చివరకు నా కొడుకు మృతదేహాన్ని దీక్షా శిబిరం వద్దకు తీసుకువచ్చి చూపించి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత మరో ఐదురోజులు అమరణ దీక్ష కొనసాగించా. అరెస్ట్ చేసి కొత్తగూడెం ఆస్పత్రిలో పెడితే తప్పించుకుని వచ్చి ఆందోళనలు నిర్వహించాను. యాజమాన్యం దిగివిచ్చ భారీ యంత్రాల్లో పనిచేసే జనరల్ మజ్దూర్లకు ప్రమోషన్ పాలసీ అమలు చేయడానికి ఒప్పుకుంది.
చార్జిషీట్లు.. వార్నింగ్ లెటర్లు.. సస్పెన్షన్
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏనాడూ వెనకడగు వేయలేదు. అధికారుల పెత్తందారు పోకడల్ని ప్రశ్నించినందుకు ఉద్యో గ కాలంలో యాజమాన్యం నాకిచ్చిన బహుమతులు 27 చార్జిషీట్లు, 78 వార్నింగ్ లెటర్లు, 365 రోజలపాటు సస్పెన్షన్. అయినా వెరవకుండా పోరాటం చేశా.
కార్మికుల ఆత్మగౌరవమే ధ్యేయం
సింగరేణి ఉద్యోగ విరమణతో సంకెళ్లు తెగిపోయాయి. ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో అనేక విధాలుగా యాజమాన్యం బ్లాక్‌మెయిల్ చేసింది. ఇక అన్నిటికీ పుల్‌స్టాఫ్ పడింది. పోయిన వారసత్వ ఉద్యోగాలు, క్యాడర్‌స్కీం అమలు, ప్రమోషన్ పాలసీ, డిజిగ్నేషన్ మార్పు తదితర హక్కుల సాధనకు పోరాడుతాను. మలి జీవితాన్ని కార్మికుల కోసం అంకితం చేస్తా.
సంస్థ పురోభివృద్ధిలో భాగస్వామ్యం
కేవలం కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా కాకుండా తెలంగాణకు కొంగుబంగారంగా ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకుంటాం. గనులు మూతపడకుండా చూసి ఉద్యోగాలను కాపాడుకుంటాం. హెచ్‌ఎంఎస్‌ను గుర్తింపు సంఘంగా నిలబెట్టడమే నా లక్ష్యం.
Advertisement
Advertisement