boundaries
-
CWC 2023 SA VS SL: 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఇలా..!
శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌కు సంబంధించిన రికార్డులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వరల్డ్‌కప్‌లో హయ్యెస్ట్ టీమ్ స్కోర్ (సౌతాఫ్రికా, 428) రికార్డు, వరల్డ్‌కప్‌లో తొలిసారిగా ఓఇన్నింగ్స్లో ముగ్గురు సెంచరీలు చేయడం, వరల్డ్‌కప్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (మార్క్రమ్, 49 బంతుల్లో) రికార్డు, వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్ స్కోర్ (సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు కలిపి 754 పరుగులు చేశాయి) రికార్డు, వరల్డ్‌కప్‌లో 200 సెంచరీలు పూర్తి చేసుకున్న రికార్డు (వరల్డ్‌కప్‌లో 200వ సెంచరీ, మార్క్రమ్), వరల్డ్‌కప్‌లో తొలిసారి ఓ ఇన్నింగ్స్‌లో నలుగురు బౌలర్లు 80 అంతకంటే ఎక్కువ పరుగులు, ఇద్దరు బౌలర్లు 90 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు (శ్రీలంక).. ఇలా ఈ మ్యాచ్ పలు ఆసక్తికర వరల్డ్‌కప్ రికార్డులు నమోదయ్యాయి. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి మరో రికార్డు వెలుగుచూసింది. వరల్డ్‌కప్ టోర్నీల్లో తొలిసారి ఓ మ్యాచ్‌లో 100 కంటే ఎక్కువ బౌండరీలు నమోదు కావడం. నిన్నటి మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 105 బౌండరీలు (సౌతాఫ్రికా 45 ఫోర్లు, 14 సిక్సర్లు, శ్రీలంక 29 ఫోర్లు, 17 సిక్సర్లు) నమోదయ్యాయి. 48 ఏళ్ల వరల్డ్‌కప్ హిస్టరీలో ఈ స్థాయిలో బౌండరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేయగా.. శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో విరుచుకుపడగా.. లంక ఇన్నింగ్స్‌లో చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీలు నమోదు చేశారు. -
నేనెప్పుడూ అలా ఫీల్ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా..
‘ఓ నటిగా భాషాపరమైన హద్దులను నేనెప్పుడూ ఫీల్ కాలేదు’ అంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ– ‘‘రాత్రికి రాత్రే నాకు సక్సెస్ రాలేదు. ఏడేళ్లుగా ఎంతో కష్టపడుతున్నాను. ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు. కానీ నటిగా నాకు యాక్టింగ్ క్రాఫ్ట్‌పై పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా నటించడానికి భాష హద్దు కాదని భావిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన నా ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాను. వచ్చే ఏడాది ఈ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు. కాగా రష్మికా మందన్నా నటించిన హిందీ చిత్రాలు ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం ‘వారసుడు’, ‘యానిమల్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు రష్మిక. -
రాజస్తాన్ రాయల్స్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే
No Boundary For Rajastan Royals In Power Play.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒక్క బౌండరీ లేకుండా పవర్ ప్లే ముగియడం ఐపీఎల్లో 2011 తర్వాత ఇది రెండోసారి మాత్రమే. 2011లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే పవర్ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. ఆ మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: DC Vs RR: పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే తాజాగా రాజస్తాన్ కూడా పవర్ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. అంతేగాక 2021 ఐపీఎల్లో పవర్ ప్లే పరంగా రాజస్తాన్ రాయల్స్ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. పవర్ ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసిన రాయల్స్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబై 21/3(పంజాబ్ కింగ్స్‌పై), సీఎస్కే 24/4(ముంబైపై), కేకేఆర్ 25/1(రాజస్తాన్ రాయల్స్‌పై) వరుసగా ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ చేధనలో తడబడుతుంది. టాప్‌క్లాస్ ఆటతో చెలరేగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాయల్స్ ప్రదర్శన చిన్నబోతుంది. ప్రస్తుతం 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. రాజస్తాన్ విజయానికి 48 బంతుల్లో 100 పరుగులు కావాల్సి ఉంది. చదవండి: IPL 2021: ఐపీఎల్లో టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు.. -
లాక్డౌన్: సరిహద్దులు దిగ్బంధం..
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/అలంపూర్/ కోదాడ రూరల్/నాగార్జునసాగర్: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ రెండోరోజు గురువారం ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 10 గంటల తరు వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రయాణ ప్రాంగణాలలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు యథావిధిగా ప్రయాణాలు సాగాయి. ఇక అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దుల్లోని గ్రామీణ రహదారుల గుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించే వాహనాలపైనా నిఘా పెట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాశారు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద రోడ్లపైకి వచ్చిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అత్యవసర పనులు, వైద్యం, వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చిన వారిని మాత్రం పోలీసులు వివరాలు సేకరించి అనుమతించారు. ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సులను వివరాలు సేకరించి అనుమతించారు. బారికేడ్లతో కట్టడి.. ఏపీ, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలు, స్థానిక రవాణా వంటి అంశాలపై జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. పుల్లూరు–పంచలింగాల జాతీయ రహదారిలోని రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఏపీ సరిహద్దు సుంకేసుల–రాజోలి వద్ద రహదారినే మూసివేశారు. కేటీదొడ్డి మండలంలోని కర్ణాటక–తెలంగాణ అంతర్ రాష్ట్ర రహదారిలోని నందిన్నే చెక్‌పోస్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను కట్టడి చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద పరిస్థితిని ఎస్పీ భాస్కరన్ సమీక్షించారు. అలంపూర్ వాసుల ఇక్కట్లు లాక్డౌన్ సడలింపు సమయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత వ్యత్యాసం ఉండటం ఇబ్బందిగా మారింది. ఏపీలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపు ఉండగా.. తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉంది. ఇది ప్రతిరోజూ నిత్యావసరాలు, వైద్యం, మందులు, వ్యవసాయ అవసరాలు, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం కర్నూలు జిల్లాకు వెళ్లి వచ్చే అలంపూర్ నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలకు సమస్యగా మారింది. ఏపీలో ఉన్న సమయానికి అనువుగా ఉద్యోగాలు, వ్యాపారాలు, సరుకుల కొనుగోళ్లు చేసి అనేక మంది సొంత గ్రామాలకు వస్తున్నారు. అప్పటికి ఇక్కడ సడలింపు సమయం ముగిసిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి వాహనాలను అనుమతించండి: డీజీపీ లాక్డౌన్లో సింగరేణి కార్మికులు, వాహనాలను అనుమతించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి సంస్థకు అవసరమైన పేలుడు పదార్థాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర విడిభాగాలను కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగరేణి సీఎండీ విజ్ఞప్తి మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా రంజాన్ సందర్భంగా ప్రార్థనా స్థలాల వద్ద కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ప్రేమ.. పగ.. యుద్ధం
ప్రేమతో ఈ కథ మొదలవదు.పగతోనూ ప్రారంభం అవదు.సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రపంచాన్ని పంచుకు తినాలని ఉవ్విళ్లూరే రెండు శక్తులైన బ్రిటన్, రష్యాల మధ్యఆధిక్యపోరులో.. బ్రిటన్ క్రమంగా ఆప్ఘనిస్తాన్ వరకు వ్యాపిస్తుంది. ఆప్ఘన్ రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు యువకులైన భారత సిపాయిలను సైన్యంలోకి తెమ్మని ఒకహవల్దార్ను నియమిస్తుంది. ఇక అక్కడి నుంచి ప్రేమ, పగ, ప్రతీకారం, మోసం, సాహసం, కుయుక్తి, కుట్ర, పన్నాగం.. కథను నడిపిస్తాయి.వీరులైన 21 మంది సిక్కు సిపాయిలు కథను పరుగులు తీయిస్తారు. ప్రారంభం 1897. ఆసియాలో పెత్తనం కోసం బ్రిటన్, రష్యాల మధ్య పోటీ పరాకాష్టకు చేరిన సమయం. అప్పటికే రష్యా మధ్యాసియాలో పాగా వేసింది. ఇటు బ్రిటిష్ సామ్రాజ్యం కూడా అఫ్గానిస్తాన్ సరిహద్దుల దాకా వ్యాపించింది. లఖార్ట్, గులిస్తాన్ కోటలను అవుట్పోస్ట్లుగా చేసుకుంది. వీటికి ఆధిపత్యం వహిస్తుంటారు.. కల్నల్ హఫ్టన్, మేజర్ చార్ల్స్ డేస్ వోక్స్. ఈ హద్దులకు ఆవల ఉన్న అఫ్గాన్ ప్రాంతాన్నీ ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. అందుకు సారాగఢిని బేస్‌గా చేసుకుంటారు. అఫ్గాన్‌తో యుద్ధం చేయడానికి ఊళ్లోని బలవంతులైన యువకులను తీసుకురావల్సిందిగా భారత సిపాయి హవల్దార్ ఇషార్ సింగ్ (మోహిత్ రైనా)ను ఆజ్ఞాపిస్తారు. ఆ ప్రయత్నం కోసం సొంత ప్రాంతానికి వస్తాడు ఇషార్ సింగ్ మరో సిపాయితో కలిసి. ప్రతీకారం అప్పటికే పెళ్లయ్యున్న ఇషార్ సొంతూరితోపాటు అత్తగారి ఊరు, చుట్టుపక్కల ఊళ్లూ తిరుగుతుంటాడు.. సైన్యంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న యువకులను వెదుకుతూ. అత్తగారి ఊళ్లో బల్వీందర్ సింగ్ ఎదురుపడ్తాడు. సైన్యంలో చేరమని కోరుతాడు. అప్పటికే బల్వీందర్.. ఇషార్ సింగ్ మీద పగతో రగిలిపోతుంటాడు. తాను ఇష్టపడ్డ సోనీని ఇషార్ సింగ్ పెళ్లి చేసుకున్నందుకు. అయితే సోనీ .. బల్వీందర్నేమీ ఇష్టపడదు. పైగా అసహ్యించుకుంటుంది కూడా. ప్రేమ, పెళ్లి అంటూ వెంటబడ్డందుకు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న బల్విందర్.. సైన్యంలో చేరమని అడిగిన ఇషార్‌ను అవమానపరుస్తాడు. ‘‘పరాయి పాలకులకు నువ్వు గులామ్‌గిరి చేస్తున్నది కాక.. మమ్మల్ని చేయమని అడుగుతున్నావా?’’ అంటూ. అయితే బల్వీందర్‌సింగ్ స్నేహితుడు బల్వీందర్సింగ్కి ఓ సలహా ఇస్తాడు.. ‘‘ఇలా మాటలతో కాకుండా ఇషార్ మీద నిజంగా కక్ష తీర్చుకోవాలంటే అతను చెప్పినట్టే సైన్యంలో చేరి సమయం దొరికినప్పుడు ఇషార్‌ను చంపేయ్’’ అని. ఆ మాట నచ్చుతుంది బల్వీందర్కి. సైన్యంలో చేరడానికి ఒప్పుకుంటాడు. చాలా ప్రయాసపడి ఇంకొంత మందినీ ఒప్పించి తీసుకెళ్తాడు ఇషార్‌సింగ్. వాళ్లంతా సిక్కులే. మోసం మొత్తానికి 21 మంది సిక్కు వీరులతో ఒక క్యాంప్ తయారవుతుంది. వీళ్లు సార్టాప్, సారాగఢి చూసుకుంటూంటారు. యుద్ధం కోసం వీళ్లకు శిక్షణ ప్రారంభించబోతుండగా ఒకరోజు ఒకముస్లిం వనిత పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ కోటలోకి. ‘‘ఇక్కడికి దగ్గర్లో ఉన్న కబేలా (తండా లాంటిది)లో ఉంటున్నాం. మా అక్క గర్భవతి. నొప్పులతో బాధపడుతోంది. మీ దగ్గర డాక్టర్ ఉన్నాడని తెలిసి వచ్చాను. కొంచెం సాయం చేయండి. కాదనకండి’’ అంటూ ప్రాధేయపడ్తుంది. కల్నల్ హఫ్టన్ భార్య తమ దగ్గరున్న డాక్టర్‌తోపాటు ఆయా థెరిసానూ పంపిస్తుంది. వీళ్లు వెళ్లాక కాని అర్థం కాదు అది మోసమని. హఫ్టన్ ఏ ప్రాంతాన్నయితే కైవసం చేసుకోవాలని చూస్తున్నాడో ఆ ప్రాంతపు ఏలిక గుల్ బాద్షా పన్నిన కుట్ర అది. డాక్టర్‌ను, థెరిసాను బంధిస్తాడు. వాళ్ల కోసం బ్రిటిష్ సేనలు వస్తే యుద్ధం చేయాలని తయారుగా ఉంటాడు. వేగుల ద్వారా ఈ విషయం హఫ్టన్ క్యాంప్‌కి తెలుస్తుంది. వెంటనే ఎదురుదాడికి వెళ్లి డాక్టర్ని, థెరిసాను విడిపించుకురావాలని ఆవేశపడ్తాడు గురుముఖ్‌సింగ్ అనే సైనికుడు. సంయమనం పాటించమంటాడు ఇషార్ సింగ్. థెరిసా.. గురుముఖ్ను ఇష్టపడ్తుంటుంది. ఇషార్ సింగ్ మాటవినకుండా, హఫ్టన్ అనుమతి లేకుండా ఒక్కడే బయలుదేరుతాడు గురుముఖ్. సాహసం ఒడుపుగా గుల్‌బాద్షా కోటలోకి వెళ్లి, చాకచక్యంగా డాక్టర్‌ను, థెరిసాను విడిపించి బయటకు తీసుకొస్తాడు గురుముఖ్. దాన్ని గుల్‌బాద్షా పసిగట్టడమే కాదు తమ సరిహద్దు దాటేలోపలే వాళ్లను పట్టుకుంటాడు కూడా. గురుముఖ్ను గుల్‌బాద్షా తుపాకితో కాల్చబోతుంటే డాక్టర్ అడ్డుపడ్తాడు. దాంతో డాక్టర్‌కు తుపాకి గుండు తగిలి నేలకొరుగుతాడు. ఈ గొడవలో థెరెసాను తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు గురుముఖ్. అక్కడ క్యాంప్ నుంచి హె న్రీ మెయిన్ అనే సైనికాధికారి, ఇషార్‌సింగ్, బల్విందర్ సింగ్ వస్తారు గుల్ బాద్షా మీద దాడికి. దార్లో తూటా తగిలి పడి ఉన్న డాక్టర్ కనపడ్తాడు వీళ్లకు. పరిస్థితి అర్థమవుతుంది. డాక్టర్‌ను తీసుకొని క్యాంప్‌కి తిరిగి వెళ్లమని ఇషార్సింగ్కు ఆర్డర్ వేస్తాడు హెన్రీ. హతాశుడవుతాడు ఇషార్‌సింగ్. బదులు చెప్పలేక అయిష్టంగానే వెనుదిరుగుతాడు ఇషార్. కుయుక్తి థెరిసాతో తప్పించుకున్న గురుముఖ్ స్థానిక గిరిజన ముస్లిం కబేలాకు చేరుతాడు. అప్పటికే థెరిసా కాలుకి గాయమవుతుంది. కబేలా పెద్దను వైద్య సహాయం కోరుతాడు. వైద్యం చేయడానికి గుడారంలోకి తీసుకెళ్తారు వాళ్లను. ఇంతలోకే ఓ వైపు నుంచి గుల్‌బాద్షా, ఇంకో వైపు నుంచి హెన్రీ మెయిన్ వాళ్లు ఆ గుడారంలోకి వస్తారు. గుల్బాద్షాను చూస్తాడు గురుముఖ్. ప్రమాదాన్ని గ్రహించి థెరిసాను అక్కడినుంచి పంపించేస్తాడు. ఆ క్రమంలోనే గుడారాలకు బల్వీందర్ నిప్పు పెడ్తూండడం చూస్తాడు గుర్ముఖ్. అతను అయోమయంలో ఉండగానే గుల్‌బాద్షా, అతని అనుచరులు ఓ గుడారంలోంచి తప్పించుకుపోవడాన్ని చూస్తాడు బల్వీందర్, ఇటు గురుముఖ్ కూడా. గుల్‌బాద్షా తప్పించుకుపోతూ అవతలివైపున ఉన్న హెన్రీకి స్నేహపూర్వకంగా చేయి ఊపడమూ గమనిస్తాడు బల్వీందర్. కుట్ర థెరిసా, గురుముఖ్, హెన్రీ, బల్వీందర్ క్యాంప్‌కి చేరుతారు. బల్వీందర్ ఆ కబేలాకు నిప్పుపెట్టడాన్ని మర్చిపోలేక ఆ సంగతిని గురుముఖ్.. ఇషార్కూ చెప్తాడు. అతనికీ బల్వీందర్ చర్యలోని ఆంతర్యం బోధపడదు. దాంతో బల్వీందర్‌ను నిలదీస్తాడు ఇషార్‌సింగ్. అయినా బల్వీందర్ పెదవి విప్పడు సరికదా.. ఇషార్‌ను చంపే అవకాశం పోయినందుకు రుసరుసలాడుతుంటాడు. హెన్రీ మాటలు, చేతల మీదా అనుమానం వస్తుంది ఇషార్‌కు. అతని మీద కన్నేసి ఉంచుతాడు. ఇదిలా సాగుతుండగానే క్యాంప్‌లోని పావురాల గుంపులోకి ఓ కొత్త పావురం చేరుతుంది. అది ఉత్తరాలను మోసేది అని తెలుస్తుంది ఓ సిపాయికి. ఇషార్ దృష్టికి తీసుకొస్తాడు. ఆ విషయం తెలిసిన హెన్రీ.. తుపాకిని పేల్చి ఆ పావురం ఎగిరిపోయేలా చేస్తాడు. దీంతో హెన్రీ మీద అనుమానం బలపడ్తుంది ఇషార్‌కు. బల్వీందర్‌ను అదుపులోకి తీసుకుని ఆ క్యాంప్‌లో న్యాయ విచారణ చేపడితే గుల్‌బాద్షాకు హెన్రీ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని తేలుతుంది. కబేలాలో గుల్‌బాద్షా తమ చేతికి చిక్కేవాడని బందీగా తెచ్చేవాళ్లమని.. బల్వీందర్ నిప్పు పెట్టడం వల్లే తప్పించుకుపోయాడని గురుముఖ్ చేసిన ఆరోపణ మీద ఈ విచారణంతా సాగుతుంది. హెన్రీ.. ఐర్లాండ్ దేశస్తుడు. బ్రిటన్ మీద కోపంతో ఉంటాడు. గుల్ బాద్షాకు స్పైగా మారి బ్రిటన్ మీద çకసితీర్చుకోవాలనుకుంటాడు. ఒకసారి క్యాంప్‌లో బవ్వీందర్ ఓ నాటు బాంబును ఇషార్ మీదకు విసరబోతుంటే హెన్రీ పట్టుకుంటాడు. ఈ నిజం బయటపెడితే మరణ శిక్ష అని భయపెడ్తాడు బల్వీందర్‌ను. బతిమాలుకున్న బల్వీందర్‌తో బేరం కుదుర్చుకుంటాడు. అతని తప్పును కాయాలంటే తను ఎప్పుడు ఏ పని చెబితే ఆ పని చేయాలని. అలా మాట ప్రకారమే కబేలా నుంచి గుల్ బాద్షాను తప్పించడంలో హెన్రీకి ఉపయోగపడ్తాడు బల్వీందర్. ఇవన్నీ సాక్ష్యాధారాలతో రుజువై హెన్రీకి శిక్ష పడ్తుంది. పన్నాగం తగలబడిపోయిన కబేలా.. ఇటు భారత్, అటు అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో లేని స్వతంత్ర ప్రాంతం. కబేలా తగలబడిందని న్యాయం కోసం అఫ్గానిస్తాన్ రాజు దగ్గరకు వస్తారు కబేలా వాసులు. అప్పుడు రాజు హఫ్టన్కు, గుల్‌బాద్షాకు లేఖలు పంపిస్తాడు రావాల్సిందిగా. ఇద్దరూ వస్తారు. అతని ఆస్థానంలోనే తమ సైనికాధికారితో కలిసి గుల్‌బాద్షా చేసిన కుట్ర గురించి రాజుకు చెప్తాడు హఫ్టన్. గుల్ బాద్షాను మందలించి, ఇక్కడితోనైనా యుద్ధాలోచనలు మాని సంధి చేసుకొమ్మని హితవు చెప్తాడు అఫ్గాన్ రాజు. సంధికి సరే అంటాడు గుల్‌బాద్షా. ఆ శుభ సందర్భంగా ఆ రోజు రాత్రి విందును ఏర్పాటు చేస్తాడు అఫ్గాన్ రాజు. సరదాగా ఓ ఆట ఆడుదామని మల్లయుద్ధ పోటీ పెట్టి, బరిలోకి ఇషార్‌ను ఆహ్వానించి ఓడిస్తాడు గుల్‌బాద్షా. అంతేకాదు సిగరెట్లో పేలుడు పదార్థం పెట్టి హఫ్టన్ను హతమార్చడానికీ ప్రయత్నిస్తాడు. దీన్ని భగ్నంచేసి అఫ్గాన్ రాజు దృష్టికి తీసుకెళ్తాడు ఇషార్. వీళ్ల ముందు ఆ రాజు.. గుల్‌బాద్షాకు మరణ శిక్ష విధించి, బంధించి హఫ్టన్ వాళ్లు వెళ్లిపోయాక.. బ్రిటన్ ఆక్రమిత సారాగఢ్ మీదకు ఎలా దండెత్తాలో ఉపాయం చెప్తాడు గుల్‌బాద్షాకు. ముగింపు 1897..సెప్టెంబర్ 12. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చాక.. సారాగఢిలోని 21 మంది సిక్కులకు శిక్షణను ముమ్మరం చేయాలని నిర్ణయానికి వస్తారు హఫ్టన్, ఇషార్‌లు. ఆ 21 మందికున్న ప్రత్యేకతలన్నిటినీ పరీక్షించి.. తర్ఫీదు ఆరంభిస్తాడు ఇషార్. ఈలోపే అఫ్గాన్ రాజు ఇచ్చిన సలహా ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఒరక్ౖజñ అనే గిరిజన తెగలోని పదివేల మంది సహాయంతో సారాగఢి మీదకు దండెత్తుతాడు గుల్ బాద్షా. అప్పటికి ఈ 21 మంది సిక్కు జవాన్లు యుద్ధానికి సన్నద్ధంగా ఉండరు. అయినా వచ్చిన ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్తారు. జట్లుగా విడిపోయి పదివేల మంది గిరిజనులను అడ్డుకోవడానికి తుపాకులను, కత్తులను, బాంబులను సిద్ధం చేసుకుంటారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలై రాత్రి వరకు సాగుతుంది యుద్ధం. సారాగఢి .. గుల్‌బాద్షా వశం కాకుండా చివరి శ్వాస వరకూ పోరాడుతారు సిక్కులు. ఇషార్ నాయకత్వం వహించిన ఆ సైన్యం.. 180 మంది ప్రత్యర్థులను నేలకొరిగిస్తుంది. గుల్‌బాద్షా కూడా మరణిస్తాడు. ఇదీ కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. -
పేదల జాగాకు ‘పెద్దల’ ఎసరు
సాక్షి, సిరిసిల్లటౌన్ : అది 2007 అక్టోబర్ 10 పితృఅమావాస్య. అదే రోజు పితృదేవతలకు సంతర్పణలు సమర్పించుకునేందుకు ముగ్గురు రోడ్డు మీదకు వచ్చారు. ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు వచ్చి వారిని కబళించింది. ఈ సంఘటనలో సిరిసిల్లఅర్బన్ మండలం పెద్దూరుకు చెందిన గీతకార్మికుడు చనిపోగా.. వారి కుటుంబానికి ప్రభుత్వం రెండు గుంటలు పంపిణీ చేసింది. ఇప్పుడు అదే భూమిని ఓ పెద్దమనిషి కబ్జా చేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. భూపంపిణీ చేసిన జీవన్‌రెడ్డి బాధితులు ఆదిపెల్లి భాగ్య, సాగర్ కథనం ప్రకారం. పెద్దూరుకు చెందిన ఆదిపెల్లి పర్శరాములు వార్డుసభ్యుడు. పెద్దలకు బియ్యం ఇచ్చేందుకు అయ్యగారి వద్దకు మరో ఇద్దరు బంధువులతో కలసి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంఓనే ఆర్టీసీ బస్సు ఢీకొని పర్శరాములుతోపాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో పర్శరాములు కుటుంబం పేదరికానికి చలించిన అప్పటి సర్కారు.. మంత్రి జీవన్‌రెడ్డి చేతుల మీదుగా గ్రామశివారులోని సర్వేనంబరు 405/1లో రెండుగుంటలు అందజేసింది. భర్త మ రణంతో కొద్దిరోజులు అందులో కాస్తు చేసుకున్న భార్య భాగ్య.. ఇంటిపనుల భారంతో చాలారోజులుగా ఖాళీగా వదిలేసింది. పిల్లల భవిష్యత్‌కు ఉపకరిస్తుందని స్థలాన్ని కాపాడుతూ వస్తోంది. ఆ స్థలం విలువ రూ.8 లక్షలు అప్పట్లో ఊరిచివరన ఉన్న ఆ స్థలానికి ఇప్పుడు డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షలు పలుకుతుంది. దీంతో ఓ రియల్‌వ్యాపారి కన్ను పడింది. తనకు పరిచయమున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కబ్జా చేశాడు. స్థల యజమాని భాగ్య, ఆమె కుమారుడు సాగర్ న్యాయం చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం సదరు రియల్‌వ్యాపారి ‘స్థలం వదిలించుకుంటే మీకు డబుల్బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని’ చెబుతున్నాడు. ‘మా తండ్రి చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమి అది.. దానిని మాకు కాకుండా చేయొద్దు’ అని బతిమిలాడినా వినలేదు. తనపై దాడికి పాల్పడ్డట్లు వారిపై రియల్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి గారూ ఆదుకోవాలి అటు పోలీసులు, ఇటు అధికారుల నుంచి తమకు న్యాయం జరగడం లేదని మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కుటుంబ పెద్దచనిపోతే స్పెషల్ కేసు కింద భూమిని సర్కారు తమకు ఇస్తే.. దానిని పెద్దలు కబ్జా చేశారని, తద్వారా తమ కుటుంబం భవిష్యత్ ఏమిటని రోదించారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. హద్దులు చూపించాలని ఆదేశాం: రియల్టర్ పెద్దూరు శివారులోని 405/1 సర్వేనంబర్‌లో నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. 2007లో గ్రామంలో నెలకొన్న పరిస్థితుల దృష్యా్ట ఆ సర్వే నంబరులో స్థలం లేకున్నా.. రాత్రికి రాత్రే పట్టా తయారు చేయించి పర్శరాములు కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు. రెవెన్యూ సర్వేయర్‌తో వారి స్థలానికి హద్దులు చూపించాలని నేను కోరుతున్నా. నేను ఏ స్థలాన్ని కబ్జా చేయలేదు. నాపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. -
ర్యాగింగ్ హద్దులు దాటొద్దు
సిద్దిపేట జోన్: కాలేజీ రోజుల్లో ర్యాగింగ్ సహజమని, అది శృతిమించి హద్దులు దాటకుండా ఆడ పిల్లలకు ధైర్యమిచ్చేదిగా ఉండాలని ‘ఈ జన్మనీకే’ చిత్రం హీరోయిన్ ప్రియ అన్నారు. బుధవారం స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శివమ్స్ గార్డెన్లో జరిగిన ఫ్రెషర్స్ పార్టీలో చిత్రం హీరో తరుణ్, హీరోయిన్ ప్రియతో పాటు దర్శక, నిర్మాతలు కీర్తి కుమార్, జూలియస్, రవిచంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో గొప్పదన్నారు. కాలేజీ రోజులు తీపి గుర్తులని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులు శ్రీనివాస్, శరత్, సాగర్ , కళాశాల ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. -
వెయ్యి కోట్ల స్థలం..
► శేరిలింగంపల్లిలో సర్కారు స్థలాల ప్రక్షాళన షురూ ► ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే మినహాయింపు గచ్చిబౌలి: శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూముల ప్రక్షాళన మొదలైంది. రాయదుర్గం నవకల్సాలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వెయ్యి కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తహసీల్దార్ మధుసూదన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజిత్ కుమార్ షైనీ ఆదేశాలతో రాయదుర్గం నవకల్సా సర్వే నెంబర్ 66/1, 66/2లో రెండు వారాలుగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రహరీలు, బారికేడ్లు తొలగించి సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. దీంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కబ్జాదారుల్లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నట్టు తెలుస్తోంది. తమ పాట్లు, స్థలాలకు మినహాయింపు ఇవ్వాలని వీరు రెవెన్యూ ఉన్నతాధికారులు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 40 ఎకరాలకు సరిహద్దులు ... రాయదుర్గం నవకల్సా సర్వే నెంబర్ 66/2లో 45 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 20 ఎకరాలు ప్రభుత్వ స్థలం. కొందరు రియల్టర్లు ఏడాది క్రితం అప్పటి రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో ప్రధాన రహదారి వెంట ఉన్న 4 ఎకరాల స్థలంలో బారికేడ్లు నిర్మించి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ భూములు సర్వే చేపట్టిన అధికారులు ఈ సర్వే నెంబర్లో 15 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని సరిహద్దులు నిర్ణయించారు. ఒవర్లాప్లో 3 ఎకరాలు చిత్రపురి కాలనీలోకి పోయిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాయదుర్గం సవకల్సా సర్వే నెంబర్ 66/1లో 55 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాల్లో శశ్మానlవాటిక ఉంది. ఈ సర్వే నెంబర్లోని ప్రహరీ గోడలను కూల్చి సరిహద్దులు ఏర్పాటు చేశారు. దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్ 66/1, 66/2లలో ఇప్పటికే 40 ఎకరాలకు సరిహద్దులు ఏర్పాటు చేశారు. అక్కడ ఎకరం ధర 25 కోట్ల పైగా ఉంది. గ్రామ మ్యాప్ ఆధారంగా ఇప్పటికే ఓ సారి సర్వే చేసిన అధికారుల... ఇందులో సరిహద్దులు సరిగ్గా రాకపోవడంతో డాక్యుమెంట్ల ప్రకారం సర్వే చేస్తున్నారు. శుక్రవారంతో పూర్తి కానున్న ఈ సర్వే అనతరం ఎన్ని ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నారో స్పష్టం కానుంది. వంద ఎకరాలు గుర్తించాల్సి ఉంది: - మధుసూదన్ , తహసీల్దార్ రాయదుర్గం సవకల్సా సర్వే నెంబర్ 66/1, 66/2, 66/3లో 260 ఎకరాలను ప్రభుత్వ స్థలమని 2001లో అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని శేరిలింగంపల్లి తహసీల్దార్ మధుసూదన్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో అప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్లు చెల్లవని చెప్పారు. అయితే, ప్రభుత్వం క్రమబద్ధీకరించినా, కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్లు అయినా మినహాయింపు ఉంటుందన్నారు. నవకల్సాలోని మూడు సర్వే నెంబర్లలో 100 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించాల్సి ఉందన్నారు. మియాపూర్‌లోని సర్వే నెంబర్ 28ను ప్రక్షాళన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అన్ని సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి సరిహద్దులు నిర్ణయిస్తామన్నారు. -
'భారత్-పాక్ సరిహద్దుల్ని మళ్లీ గీయలేం'
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ దేశాల సరిహద్దులను మళ్లీ గీయలేమని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అరుణ్ జైట్లీ అన్నారు. -
అడవి దొంగలు...!
భద్రాచలం : తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అడవుల్లో దొంగలు పడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓ వైపున అటవీశాఖాధికారులు పంపకాల పనిలో నిమగ్నమై ఉండగా, ఇదే అదనుగా భావించిన స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. టేకు, జిట్రేగు వంటి విలువైన చెట్లకు నిలయమైన భద్రాచలం ఏజెన్సీలో ప్రస్తుతం అవి చూద్దామన్నా కనిపించడం లేదు. అటవీశాఖాధికారులు అడపా, దడపా చేసిన దాడుల్లో పెద్ద ఎత్తున కలప పట్టుబడుతోందంటే.. ఇక్కడ ఏ తీరున స్మగ్లింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. భద్రాచలం డివిజన్లోని నార్త్, సౌత్ విభాగాల పరిధిలో ప్రతి ఏటా రూ. కోట్ల విలువైన కలపను స్మగ్లర్లు తరలించుకుపోతున్నారు. వారికి కొంతమంది అటవీశాఖాధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు అడపా దడపా దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్నా.. వారికి పట్టుబడకుండా తరలిస్తున్నది అంతకు రెట్టింపు స్థాయిలోనే ఉంటుందని అంచనా. చింతూరు మండలం మోతుగూడెం, కాటుకపల్లి, భద్రాచలం బ్రిడ్జి సెంటర్, పాల్వంచ సమీపంలో పలు చోట్ల అటవీశాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. లంచాలకు అలవాటు పడిన కొంతమంది సిబ్బంది కారణంగా అక్రమ కలప రవాణను అడ్డుకోలేకపోతున్నారనే విమర్శ ఉంది. చెక్ పోస్టులలో వసూళ్లు మామూలేనని, కార్యాలయాల నిర్వహణ కోసం ఆ మాత్రం చేయకుంటే తప్పదని కొందరు రేంజ్ అధికారులే చెబుతుండటం వారి పనితీరుకు నిదర్శనం. స్మగ్లర్ల దాడులకు సాక్ష్యాలివే.. గత రెండేళ్లుగా భద్రాచలం ఏజెన్సీలోని అటవీ సంపదను స్మగ్లర్లు పెద్ద ఎత్తున తరలించుకుపోతున్నారడానికి పట్టుబడిన కలప నిల్వలే సాక్ష్యం గా నిలుస్తున్నాయి. భద్రాచలం నార్త్ డివిజన్లో 2012-13, 2013-14 సంవత్సరంలో మొత్తం 824 కేసులు నమోదు చేసి రూ.1,05,48,959 విలువైన కలపను పట్టుకున్నారు. సౌత్ డివిజన్లోగత రెండేళ్ల కాలంలో 592 కేసులు నమోదు చేసి రూ.1,23,94,925 విలువ గల కలపను స్వాధీనం చేసుకున్నారు. ఇక పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లతో కలుపుకుంటే ఎంత అటవీ సంపద స్మగ్లర్ల పాలవుతుందో ఊహించుకుంటేనే ఆందోళన కలిగిస్తోంది. రాచమార్గంలోనే రవాణా... తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన ఉన్నంతలో వెనుకేసుకుందామనే ఆలోచనతో ఉన్న కొంతమంది అటవీ అధికారులు, సిబ్బంది కారణంగా అక్రమార్కులు కలపను రాచమార్గంలోనే తరలించుకుపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించగా, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు సర్దుబాటు చే సేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రధానంగా పోలీసులందరినీ అక్కడ నుంచి వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని సాకుగా తీసుకున్న కొంతమంది పోలీసు అధికారులు అక్రమ కలప రవాణాకు తెరలేపారు. గత నాలుగు రోజుల క్రితం టాటా మాజిక్ ఆటోలో కలప రవాణా చేస్తుండగా భద్రాచలం వద్ద అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. ఆ కలప చింతూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారిదిగా ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఆ కోణంలో విచారణ లేకపోగా, అటవీశాఖాధికారులు కలప దొరికితే చాలన్న రీతిలో కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న కొంతమంది పోలీసు శాఖ అధికారులు కూడా అక్రమ కలప రవాణాలో భాగస్వాములవుతుండటం గమనార్హం. -
నటనకు సరిహద్దులు లేవు...
లైఫ్‌బుక్ పద్నాలుగు సంవత్సారాల వయసులోనే మోడలింగ్‌లోకి ప్రవేశించాను. ‘బారిష్ కే ఆన్సు’ ‘తన్నీర్ ఫాతిమా బి.ఏ’ మొదలైన టీవి సీరియల్స్ నాకు గుర్తింపు తెచ్చాయి. ‘బోల్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాను. రాబోయే ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో ఇమ్రాన్ హష్మీ సరసన నటిస్తున్నాను. చిన్న వయసులోనే కెమెరా ముందుకు రావడం వల్ల కావచ్చు... కెమెరా నాకు చాలా పాత స్నేహితురాలు అనిపిస్తుంది. మనుషులతో మాట్లాడడం కంటే కెమెరా ముందు నిల్చొని నటించడంలోనే నాకు సౌకర్యంగా ఉంటుంది. మోడలింగ్, నటన... రెండు రంగాల్లో పని చేస్తున్నప్పటికీ, నటన అంటే చాలా ఇష్టం. మోడలింగ్ కంటే నటనతోనే ఎక్కువమందికి చేరువకాగలం. పేరు తెచ్చుకోగలం. చెప్పొచ్చేదేమంటే, ఫ్యాషన్ మోడల్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వారికి మాత్రమే తెలుస్తారు. నటులు మాత్రం మారుమూల గ్రామాలకు సైతం తెలుస్తారు. సరిహద్దులు నటుల ప్రతిభను ప్రభావితం చేయలేవు. నటులకు సరిహద్దులతో పనిలేదు. దేశాలకు అతీతంగా మనం నటులను ప్రేమించేది ఈ కారణంతోనే. నేను పాకిస్థాన్ నటిని అయినప్పటికీ ఇండియాలో నటించినప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఎలాంటి వివక్ష కనిపించలేదు. స్క్రిప్ట్‌లో శక్తి ఉంటే చిన్న బడ్జెట్ సినిమా అయినా నా దృష్టిలో పెద్ద బడ్జెట్ కింద లెక్క. ‘‘ఫలానా సినిమాలో నాకు ఒక పాత్ర వచ్చింది. అది నాకు నచ్చింది. ఆ పాత్రకు వందశాతం ఎలా న్యాయం చేయాలి?’’ అనే దాని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తాను. అందానికి, వ్యక్తిత్వానికి దగ్గర సంబంధం ఉంటుంది. చూడడానికి బాగున్నా, ప్రవర్తన చెడుగా ఉంటే వాళ్లు అందంగా లేనట్లే. అందమైన వ్యక్తిత్వమే అసలు అందం అనేదాన్ని నమ్ముతాను. - హుమైమా మాలిక్, హీరోయిన్ -
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులు ఖరారు
హైదారబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఖరారయ్యాయి. సరిహద్దులలో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు ఖరారయ్యాయి. ఆలంపూర్, నాగార్జున సాగర్, ఈగలపెంట, కోదాడ, విష్ణపురం, అశ్వరావుపేట, కల్లూరు, పల్వంచలలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తారు. తెలంగాణకు పది జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌కు 13 జిల్లాలు కేటాయించిన విషయం తెలిసిందే. రాష్ట్రం జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోనున్న విషయం తెలిసిందే. వివిధ అంశాలకు సంబంధించి సరిహద్దులు అనేవి ముఖ్యం. రవాణా, పన్నులు, ఇతర అంశాలకు సరిహద్దులకు ప్రధాన్యత ఉంటుంది. అందువల్ల సరిహద్దులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పెద్ద సమస్యగా మారింది. ఈ విషయమై వివాదం నెలకొంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే కొంతవరకు సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 26న మార్గదర్శకాలు వెలువడతాయని సమాచారం. -
పెట్టుబడులు బౌండరీలు దాటాలంటే
ట్వెంటీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఆఖరు దశకు వచ్చేసింది. దాదాపు ఇరవై రోజుల నుంచి జరుగుతున్న మ్యాచ్‌ల్లో కొన్ని మినహా మిగతావన్నీ ఉత్కంఠభరితంగానే సాగాయి. పర్సనల్ ఫైనాన్సు.. పెట్టుబడులు, ఖర్చుల పేజీలో ఈ క్రికెట్ కబుర్లేమిటి .. దానికీ దీనికి సంబంధమేమిటీ అనుకుంటున్నారా? ఉంది.. సంబంధముంది.. ఎందుకంటే, ఏవో కొన్ని మ్యాచ్‌లు మినహా.. క్రికెట్లో ఏ క్షణానికి మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందోనని చివరి బంతి వరకూ టెన్షన్‌గానే ఉంటుంది. ఏ కాస్త ఆదమర్చినా ఏమైనా జరగవచ్చు.. కనుక ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, అవసరమైనప్పుడల్లా వ్యూహాలు మార్చుకుంటూ ఉండాలి. ఇలాంటి క్రికెట్ సూత్రాలే.. పెట్టుబడులకూ వర్తిస్తాయి. ఎందుకంటే రెండింటి ధోరణి దాదాపు ఒకేలా ఉంటుంది. క్రికెట్‌ని బట్టి పెట్టుబడి పాఠాలు నేర్చుకోవడమెలా? అన్నదే ఈ కథనం.. పెట్టుబడైనా..ఆటైనా.. ఫార్మాట్‌ని బట్టే.. క్రికెట్లో టెస్టులని, వన్డేలని, ట్వెంటీ ట్వంటీలని రకరకాల ఫార్మాట్లు ఉన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకం. ఏ ఆట తీరు దానిదే. టెస్టులు నిదానంగాను, వన్డేలు ఒక మోస్తరు వేగంగాను, ట్వెంటీ ట్వెంటీలు మహా ఫాస్ట్గాను సాగిపోతాయి. ఆయా ఫార్మాట్‌కి తగ్గట్లు ఆడితేనే విజయం వరిస్తుంది. పెట్టుబడులూ అంతే. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. బైకు, కారు కొనుగోలు లాంటివి స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాలనుకుంటే.. ఇల్లు కొనుక్కోవడం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు మొదలైన వాటికి డబ్బు సమకూర్చుకోవడం అనేవి దీర్ఘకాలికమైనవి (ప్రారంభించే వయస్సును బట్టి). కాబట్టి వీటికి తగినట్లే షేర్లు, ఫండ్లు, బంగారం, ఫిక్సిడ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ లాంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. షేర్లు కావొచ్చు, ఇతర సాధనాలు కావొచ్చు.. ఎంత గొప్పగా, ఎంత స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసినా.. ఒకోసారి ఎదురుదెబ్బలు తప్పవు. ఇందుకు కొన్ని కారణాలు స్వయంకృతాలు కావొచ్చు.. మరికొన్ని మన చేతుల్లో లేని పరిస్థితులు కూడా కావొచ్చు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో.. దెబ్బ తగిలేదాకా అర్థం కాదు. ఉదాహరణకు.. క్రితం ప్రపంచ కప్‌లో శ్రీలంక ఒక మ్యాచ్‌లో 45 ఓవర్లలో అతి కష్టం మీద 212 పరుగులు చేస్తే.. ఆఖరు అయిదు ఓవర్లలో 62 పరుగులు రాబట్టింది. అప్పటిదాకా ప్రత్యర్థి జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఆ తర్వాత పట్టు సడలిపోయింది. ఏ తప్పుడు నిర్ణయం దీనికి దారి తీసినది అంతుబట్టని విషయం. మార్కెట్లో పెట్టుబడులూ అంతే. మనం ఎంత చక్కగా విశ్లేషించుకుని, లెక్కలు కట్టుకున్నా.. కొన్ని సార్లు తప్పులు తప్పకపోవచ్చని గుర్తించాలి. నమ్మకం ఉండాలి..: ఇన్వెస్ట్మెంట్ సాధనం గురించి పక్కాగా అధ్యయనం చేసి, లెక్కలు గట్టి.. ఎంపిక చేసుకున్న తర్వాత దానిపై పూర్తి నమ్మకం పెట్టాలి. ఒకోసారి కాస్త గురి తప్పినంత మాత్రాన ఖంగారుపడిపోకూడదు. సచిన్‌లు, సెహ్వాగ్‌లు లేకపోతే మ్యాచ్‌లు గెల్చే అవకాశాలే లేవన్న పరిస్థితుల నుంచి వారు లేకపోయినా కప్‌లు గెల్చుకు రాగలిగే స్థితికి చేరింది మన జట్టు. కొత్త వారిని ప్రోత్సహించడం, నమ్మకం ఉంచడమే దీనికి కారణం. తాను కూర్చిన జట్టులో కొందరి ఆటతీరుపై విమర్శలు వచ్చినప్పటికీ ధోనీ వెరవకుండా.. ముందుకు సాగడం, ఆ ఆటగాళ్లే కీలక సమయాల్లో రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విధంగా.. కొన్ని సార్లు నిరాశపర్చిన సాధనాలే ఒకోసారి స్టార్స్‌గా మారుతుంటాయి. సహనం ముఖ్యం: పెట్టుబడికైనా.. మరి దేనికైనా సహనం చాలా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్ గురువులుగా పేరొందిన వారెన్ బఫెట్, మన దగ్గర రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా లాంటి వారు ఇందుకు నిదర్శనం. ఇన్వెస్ట్‌మెంట్‌పై సరైన రాబడిని దక్కించుకునేందుకు వారు సంవత్సరాల తరబడి వేచి చూస్తారు. తాము తీసుకున్న నిర్ణయాలపై గట్టి నమ్మకంతో పాటు వాటి ఫలాలు సాధించడానికి అపారమైన సహన గుణం వీరి దగ్గర కనిపిస్తుంది. క్రికెట్ విషయానికొస్తే.. కెప్టెన్ కూల్‌గా ధోని కూడా దాదాపు ఇలాంటి ధోరణే కనబరుస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతను సహనం కోల్పోకుండా వ్యవహరించడమనేది ఇన్వెస్టర్లు నేర్చుకోదగిన పాఠం. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్లు.. కాస్త ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఖంగారుపడి స్టాక్స్ అమ్మేసుకోవడం, ఆ తర్వాత అవే స్టాక్స్ భారీ లాభాల్లోకి మళ్లినప్పుడు తీరిగ్గా కూర్చుని చింతించడం జరుగుతుంటుంది. వైవిధ్యభరితం..: ఆకర్షణీయంగా ఉండే వాటిలో రిస్కులూ ఉంటాయి. మార్కెట్ పరిస్థితులు బాగున్నప్పుడు టకటకా పెరిగిపోతూ అధిక రాబడులు అందించే షేర్లు ఆకర్షణీయంగానే ఉంటాయి. వీటితో సమస్యేమిటంటే.. ఇవి ఎప్పుడూ కూడా ఒకే రకంగా భారీ లాభాలను ఇచ్చేయవు. మరోవైపు, పెద్ద మార్పులు లేకుండా సాగిపోయే బాండ్లు నిరాసక్తంగా కనిపించవచ్చు. కానీ ఇవి స్థిరమైన రాబడులు అందిస్తాయి. క్రికెట్లోనూ అంతే.. మనం ఎక్కువగా బ్యాట్స్‌మెన్ (షేర్లు లాంటివారు)కే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాం. బౌలర్ల (బాండ్లు లాంటి వారు) గురించి ఎక్కువగా పట్టించుకోము. కానీ వాస్తవానికి మ్యాచ్ గెలవాలంటే ఇద్దరూ ముఖ్యమే. టీమ్‌ని మొత్తం బ్యాట్స్‌మెన్‌తో నింపేసినా లేదా బౌలర్లతో నింపేసినా మ్యాచ్ చేతికి రాదు. మన పెట్టుబడులూ అంతే. డబ్బంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో పెట్టేస్తే.. ఉపయోగం ఉండదు. కాబట్టి రిస్కులు ఎక్కువున్నా స్టాక్స్‌లో కొంత..ఫండ్స్, బంగారం, ఇతరత్రా సాధనాల్లో మరికొంత ఇన్వెస్ట్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అంతిమంగా చెప్పొచ్చేదేమిటంటే.. కెప్టెన్ కూల్‌గా ఉన్నవారే సరైన ఇన్వెస్టర్ కాగలరు. ఆశించిన రీతిలో సాధనాలు పనిచేయకపోయినా కుంగిపోకుండా.. అవసరానికి తగ్గట్లుగా వ్యూహాలు మారుస్తూ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించగలిగినప్పుడే పెట్టుబడుల్లో విజయం సొంతమవుతుంది.