ప్రేమ.. పగ.. యుద్ధం | Competition between Britain and Russia for Asias dominance | Sakshi
Sakshi News home page

ప్రేమ.. పగ.. యుద్ధం

Published Fri, Feb 1 2019 11:33 PM | Last Updated on Sat, Feb 2 2019 11:57 AM

Competition between Britain and Russia for Asias dominance - Sakshi

ప్రేమతో ఈ కథ మొదలవదు.పగతోనూ ప్రారంభం అవదు.సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రపంచాన్ని పంచుకు తినాలని ఉవ్విళ్లూరే రెండు శక్తులైన  బ్రిటన్, రష్యాల మధ్యఆధిక్యపోరులో.. బ్రిటన్‌ క్రమంగా ఆప్ఘనిస్తాన్‌ వరకు వ్యాపిస్తుంది. ఆప్ఘన్‌ రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు యువకులైన భారత సిపాయిలను సైన్యంలోకి తెమ్మని ఒకహవల్దార్‌ను నియమిస్తుంది. ఇక అక్కడి నుంచి ప్రేమ, పగ, ప్రతీకారం, మోసం, సాహసం, కుయుక్తి, కుట్ర, పన్నాగం.. కథను నడిపిస్తాయి.వీరులైన 21 మంది సిక్కు సిపాయిలు కథను పరుగులు తీయిస్తారు.

ప్రారంభం
1897. ఆసియాలో పెత్తనం కోసం బ్రిటన్, రష్యాల మధ్య పోటీ పరాకాష్టకు చేరిన సమయం. అప్పటికే రష్యా మధ్యాసియాలో పాగా వేసింది. ఇటు బ్రిటిష్‌ సామ్రాజ్యం కూడా అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల దాకా వ్యాపించింది. లఖార్ట్, గులిస్తాన్‌ కోటలను అవుట్‌పోస్ట్‌లుగా చేసుకుంది. వీటికి ఆధిపత్యం వహిస్తుంటారు.. కల్నల్‌ హఫ్టన్, మేజర్‌ చార్ల్స్‌ డేస్‌ వోక్స్‌. ఈ హద్దులకు ఆవల ఉన్న అఫ్గాన్‌ ప్రాంతాన్నీ ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. అందుకు సారాగఢిని బేస్‌గా చేసుకుంటారు. అఫ్గాన్‌తో యుద్ధం చేయడానికి ఊళ్లోని బలవంతులైన యువకులను  తీసుకురావల్సిందిగా భారత సిపాయి హవల్దార్‌ ఇషార్‌ సింగ్‌ (మోహిత్‌ రైనా)ను ఆజ్ఞాపిస్తారు. ఆ ప్రయత్నం కోసం సొంత ప్రాంతానికి వస్తాడు ఇషార్‌ సింగ్‌ మరో  సిపాయితో కలిసి. 

ప్రతీకారం
అప్పటికే పెళ్లయ్యున్న ఇషార్‌ సొంతూరితోపాటు అత్తగారి ఊరు, చుట్టుపక్కల ఊళ్లూ తిరుగుతుంటాడు.. సైన్యంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న యువకులను వెదుకుతూ.  అత్తగారి ఊళ్లో బల్వీందర్‌ సింగ్‌ ఎదురుపడ్తాడు. సైన్యంలో చేరమని కోరుతాడు. అప్పటికే బల్వీందర్‌.. ఇషార్‌ సింగ్‌ మీద పగతో రగిలిపోతుంటాడు. తాను ఇష్టపడ్డ సోనీని ఇషార్‌ సింగ్‌ పెళ్లి చేసుకున్నందుకు. అయితే  సోనీ .. బల్వీందర్‌నేమీ ఇష్టపడదు. పైగా అసహ్యించుకుంటుంది కూడా. ప్రేమ, పెళ్లి అంటూ వెంటబడ్డందుకు.

ఇవన్నీ మనసులో పెట్టుకున్న బల్విందర్‌.. సైన్యంలో చేరమని అడిగిన ఇషార్‌ను అవమానపరుస్తాడు. ‘‘పరాయి పాలకులకు నువ్వు గులామ్‌గిరి చేస్తున్నది కాక.. మమ్మల్ని చేయమని అడుగుతున్నావా?’’ అంటూ. అయితే బల్వీందర్‌సింగ్‌ స్నేహితుడు బల్వీందర్‌సింగ్‌కి ఓ సలహా ఇస్తాడు.. ‘‘ఇలా మాటలతో కాకుండా ఇషార్‌ మీద నిజంగా కక్ష తీర్చుకోవాలంటే అతను చెప్పినట్టే సైన్యంలో చేరి సమయం దొరికినప్పుడు ఇషార్‌ను చంపేయ్‌’’ అని. ఆ మాట నచ్చుతుంది బల్వీందర్‌కి. సైన్యంలో చేరడానికి ఒప్పుకుంటాడు. చాలా ప్రయాసపడి ఇంకొంత మందినీ ఒప్పించి తీసుకెళ్తాడు ఇషార్‌సింగ్‌. వాళ్లంతా సిక్కులే. 

మోసం
మొత్తానికి 21 మంది సిక్కు వీరులతో ఒక క్యాంప్‌ తయారవుతుంది. వీళ్లు సార్‌టాప్, సారాగఢి చూసుకుంటూంటారు. యుద్ధం కోసం వీళ్లకు శిక్షణ ప్రారంభించబోతుండగా ఒకరోజు ఒకముస్లిం వనిత పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ కోటలోకి. ‘‘ఇక్కడికి దగ్గర్లో ఉన్న కబేలా (తండా లాంటిది)లో ఉంటున్నాం. మా అక్క గర్భవతి. నొప్పులతో బాధపడుతోంది. మీ దగ్గర డాక్టర్‌ ఉన్నాడని తెలిసి వచ్చాను. కొంచెం సాయం చేయండి. కాదనకండి’’ అంటూ ప్రాధేయపడ్తుంది. కల్నల్‌ హఫ్టన్‌ భార్య తమ దగ్గరున్న డాక్టర్‌తోపాటు ఆయా థెరిసానూ పంపిస్తుంది. వీళ్లు వెళ్లాక కాని అర్థం కాదు అది మోసమని.

హఫ్టన్‌ ఏ ప్రాంతాన్నయితే కైవసం చేసుకోవాలని చూస్తున్నాడో ఆ ప్రాంతపు ఏలిక  గుల్‌ బాద్షా పన్నిన కుట్ర అది. డాక్టర్‌ను, థెరిసాను బంధిస్తాడు. వాళ్ల కోసం బ్రిటిష్‌ సేనలు వస్తే యుద్ధం చేయాలని తయారుగా ఉంటాడు. వేగుల ద్వారా ఈ విషయం హఫ్టన్‌ క్యాంప్‌కి తెలుస్తుంది. వెంటనే ఎదురుదాడికి వెళ్లి డాక్టర్‌ని, థెరిసాను విడిపించుకురావాలని ఆవేశపడ్తాడు గురుముఖ్‌సింగ్‌ అనే సైనికుడు. సంయమనం పాటించమంటాడు ఇషార్‌ సింగ్‌.  థెరిసా.. గురుముఖ్‌ను ఇష్టపడ్తుంటుంది. ఇషార్‌ సింగ్‌ మాటవినకుండా, హఫ్టన్‌ అనుమతి లేకుండా ఒక్కడే బయలుదేరుతాడు గురుముఖ్‌. 
సాహసం
ఒడుపుగా గుల్‌బాద్షా కోటలోకి వెళ్లి, చాకచక్యంగా డాక్టర్‌ను, థెరిసాను విడిపించి బయటకు తీసుకొస్తాడు గురుముఖ్‌. దాన్ని గుల్‌బాద్షా పసిగట్టడమే కాదు తమ సరిహద్దు దాటేలోపలే వాళ్లను  పట్టుకుంటాడు కూడా. గురుముఖ్‌ను గుల్‌బాద్షా తుపాకితో కాల్చబోతుంటే డాక్టర్‌ అడ్డుపడ్తాడు. దాంతో డాక్టర్‌కు తుపాకి గుండు తగిలి నేలకొరుగుతాడు. ఈ గొడవలో థెరెసాను తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు గురుముఖ్‌.

అక్కడ క్యాంప్‌ నుంచి హె న్రీ మెయిన్‌ అనే సైనికాధికారి, ఇషార్‌సింగ్, బల్విందర్‌ సింగ్‌ వస్తారు గుల్‌ బాద్షా మీద దాడికి. దార్లో తూటా తగిలి పడి ఉన్న డాక్టర్‌ కనపడ్తాడు వీళ్లకు. పరిస్థితి అర్థమవుతుంది. డాక్టర్‌ను తీసుకొని క్యాంప్‌కి తిరిగి వెళ్లమని ఇషార్‌సింగ్‌కు ఆర్డర్‌ వేస్తాడు హెన్రీ. హతాశుడవుతాడు ఇషార్‌సింగ్‌. బదులు చెప్పలేక అయిష్టంగానే వెనుదిరుగుతాడు ఇషార్‌.

కుయుక్తి
థెరిసాతో తప్పించుకున్న గురుముఖ్‌ స్థానిక గిరిజన ముస్లిం కబేలాకు చేరుతాడు. అప్పటికే థెరిసా కాలుకి గాయమవుతుంది. కబేలా పెద్దను వైద్య సహాయం కోరుతాడు. వైద్యం చేయడానికి గుడారంలోకి తీసుకెళ్తారు వాళ్లను. ఇంతలోకే ఓ వైపు నుంచి గుల్‌బాద్షా, ఇంకో వైపు నుంచి హెన్రీ మెయిన్‌ వాళ్లు ఆ గుడారంలోకి వస్తారు. గుల్‌బాద్షాను చూస్తాడు గురుముఖ్‌. ప్రమాదాన్ని గ్రహించి థెరిసాను అక్కడినుంచి పంపించేస్తాడు. ఆ క్రమంలోనే  గుడారాలకు బల్వీందర్‌  నిప్పు పెడ్తూండడం చూస్తాడు గుర్‌ముఖ్‌. అతను అయోమయంలో  ఉండగానే గుల్‌బాద్షా, అతని అనుచరులు ఓ గుడారంలోంచి తప్పించుకుపోవడాన్ని చూస్తాడు బల్వీందర్, ఇటు గురుముఖ్‌ కూడా. గుల్‌బాద్షా తప్పించుకుపోతూ అవతలివైపున ఉన్న హెన్రీకి స్నేహపూర్వకంగా చేయి ఊపడమూ గమనిస్తాడు బల్వీందర్‌. 

కుట్ర
థెరిసా, గురుముఖ్, హెన్రీ, బల్వీందర్‌ క్యాంప్‌కి చేరుతారు. బల్వీందర్‌ ఆ కబేలాకు నిప్పుపెట్టడాన్ని మర్చిపోలేక ఆ సంగతిని గురుముఖ్‌.. ఇషార్‌కూ చెప్తాడు. అతనికీ బల్వీందర్‌ చర్యలోని ఆంతర్యం బోధపడదు. దాంతో బల్వీందర్‌ను నిలదీస్తాడు ఇషార్‌సింగ్‌. అయినా  బల్వీందర్‌ పెదవి విప్పడు సరికదా.. ఇషార్‌ను చంపే అవకాశం పోయినందుకు రుసరుసలాడుతుంటాడు. హెన్రీ మాటలు, చేతల మీదా అనుమానం వస్తుంది ఇషార్‌కు. అతని మీద కన్నేసి ఉంచుతాడు.

ఇదిలా సాగుతుండగానే  క్యాంప్‌లోని పావురాల గుంపులోకి ఓ కొత్త  పావురం చేరుతుంది. అది ఉత్తరాలను మోసేది అని తెలుస్తుంది ఓ  సిపాయికి. ఇషార్‌ దృష్టికి తీసుకొస్తాడు. ఆ విషయం తెలిసిన హెన్రీ.. తుపాకిని పేల్చి ఆ పావురం ఎగిరిపోయేలా చేస్తాడు. దీంతో హెన్రీ మీద అనుమానం బలపడ్తుంది ఇషార్‌కు. బల్వీందర్‌ను అదుపులోకి తీసుకుని ఆ క్యాంప్‌లో న్యాయ విచారణ చేపడితే గుల్‌బాద్షాకు హెన్రీ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని తేలుతుంది. కబేలాలో గుల్‌బాద్షా తమ చేతికి చిక్కేవాడని బందీగా తెచ్చేవాళ్లమని.. బల్వీందర్‌ నిప్పు పెట్టడం వల్లే తప్పించుకుపోయాడని గురుముఖ్‌ చేసిన ఆరోపణ మీద ఈ విచారణంతా సాగుతుంది.

హెన్రీ.. ఐర్లాండ్‌ దేశస్తుడు. బ్రిటన్‌ మీద కోపంతో ఉంటాడు. గుల్‌ బాద్షాకు స్పైగా మారి బ్రిటన్‌ మీద çకసితీర్చుకోవాలనుకుంటాడు. ఒకసారి క్యాంప్‌లో బవ్వీందర్‌ ఓ నాటు బాంబును ఇషార్‌ మీదకు విసరబోతుంటే హెన్రీ పట్టుకుంటాడు. ఈ నిజం బయటపెడితే మరణ శిక్ష అని భయపెడ్తాడు బల్వీందర్‌ను. బతిమాలుకున్న బల్వీందర్‌తో బేరం కుదుర్చుకుంటాడు. అతని తప్పును కాయాలంటే తను ఎప్పుడు ఏ పని చెబితే ఆ పని చేయాలని. అలా మాట ప్రకారమే కబేలా నుంచి గుల్‌ బాద్షాను తప్పించడంలో హెన్రీకి  ఉపయోగపడ్తాడు బల్వీందర్‌. ఇవన్నీ  సాక్ష్యాధారాలతో రుజువై హెన్రీకి శిక్ష పడ్తుంది.  

పన్నాగం
తగలబడిపోయిన కబేలా.. ఇటు భారత్,  అటు అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల్లో లేని  స్వతంత్ర ప్రాంతం. కబేలా తగలబడిందని న్యాయం కోసం అఫ్గానిస్తాన్‌ రాజు దగ్గరకు వస్తారు కబేలా వాసులు. అప్పుడు రాజు హఫ్టన్‌కు, గుల్‌బాద్షాకు లేఖలు పంపిస్తాడు రావాల్సిందిగా. ఇద్దరూ వస్తారు. అతని ఆస్థానంలోనే తమ సైనికాధికారితో కలిసి గుల్‌బాద్షా చేసిన కుట్ర గురించి రాజుకు చెప్తాడు హఫ్టన్‌. గుల్‌ బాద్షాను మందలించి, ఇక్కడితోనైనా యుద్ధాలోచనలు మాని సంధి చేసుకొమ్మని హితవు చెప్తాడు అఫ్గాన్‌ రాజు. సంధికి సరే అంటాడు గుల్‌బాద్షా.  ఆ శుభ సందర్భంగా ఆ రోజు రాత్రి విందును ఏర్పాటు చేస్తాడు అఫ్గాన్‌ రాజు.

సరదాగా ఓ ఆట ఆడుదామని మల్లయుద్ధ పోటీ పెట్టి, బరిలోకి ఇషార్‌ను ఆహ్వానించి ఓడిస్తాడు గుల్‌బాద్షా. అంతేకాదు సిగరెట్‌లో పేలుడు పదార్థం పెట్టి హఫ్టన్‌ను హతమార్చడానికీ ప్రయత్నిస్తాడు. దీన్ని భగ్నంచేసి అఫ్గాన్‌ రాజు దృష్టికి తీసుకెళ్తాడు ఇషార్‌. వీళ్ల ముందు ఆ రాజు.. గుల్‌బాద్షాకు మరణ శిక్ష విధించి, బంధించి హఫ్టన్‌ వాళ్లు వెళ్లిపోయాక.. బ్రిటన్‌ ఆక్రమిత సారాగఢ్‌ మీదకు ఎలా దండెత్తాలో ఉపాయం చెప్తాడు గుల్‌బాద్షాకు.

ముగింపు
1897..సెప్టెంబర్‌ 12. అఫ్గానిస్తాన్‌ నుంచి వచ్చాక.. సారాగఢిలోని 21 మంది సిక్కులకు శిక్షణను ముమ్మరం చేయాలని నిర్ణయానికి వస్తారు హఫ్టన్, ఇషార్‌లు. ఆ  21 మందికున్న  ప్రత్యేకతలన్నిటినీ పరీక్షించి.. తర్ఫీదు ఆరంభిస్తాడు ఇషార్‌. ఈలోపే అఫ్గాన్‌ రాజు ఇచ్చిన సలహా ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఒరక్‌ౖజñ  అనే గిరిజన తెగలోని  పదివేల మంది సహాయంతో సారాగఢి మీదకు దండెత్తుతాడు గుల్‌ బాద్షా.

అప్పటికి ఈ 21 మంది సిక్కు జవాన్లు యుద్ధానికి సన్నద్ధంగా ఉండరు. అయినా వచ్చిన ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్తారు. జట్లుగా విడిపోయి పదివేల మంది గిరిజనులను అడ్డుకోవడానికి తుపాకులను, కత్తులను, బాంబులను సిద్ధం చేసుకుంటారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలై రాత్రి వరకు సాగుతుంది యుద్ధం. సారాగఢి .. గుల్‌బాద్షా వశం కాకుండా చివరి శ్వాస వరకూ పోరాడుతారు సిక్కులు. ఇషార్‌ నాయకత్వం వహించిన ఆ సైన్యం.. 180 మంది ప్రత్యర్థులను నేలకొరిగిస్తుంది. గుల్‌బాద్షా కూడా మరణిస్తాడు. ఇదీ కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement