పెట్టుబడులు బౌండరీలు దాటాలంటే | Partnership investments datalante | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు బౌండరీలు దాటాలంటే

Published Fri, Apr 4 2014 10:30 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

Partnership investments datalante

ట్వెంటీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఆఖరు దశకు వచ్చేసింది. దాదాపు ఇరవై రోజుల నుంచి జరుగుతున్న మ్యాచ్‌ల్లో కొన్ని మినహా మిగతావన్నీ ఉత్కంఠభరితంగానే సాగాయి.  పర్సనల్ ఫైనాన్సు.. పెట్టుబడులు, ఖర్చుల పేజీలో ఈ క్రికెట్ కబుర్లేమిటి .. దానికీ దీనికి సంబంధమేమిటీ అనుకుంటున్నారా? ఉంది.. సంబంధముంది.. ఎందుకంటే, ఏవో కొన్ని మ్యాచ్‌లు మినహా.. క్రికెట్‌లో ఏ క్షణానికి మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందోనని చివరి బంతి వరకూ టెన్షన్‌గానే ఉంటుంది.

ఏ కాస్త ఆదమర్చినా ఏమైనా జరగవచ్చు.. కనుక ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, అవసరమైనప్పుడల్లా వ్యూహాలు మార్చుకుంటూ ఉండాలి. ఇలాంటి క్రికెట్ సూత్రాలే.. పెట్టుబడులకూ వర్తిస్తాయి. ఎందుకంటే రెండింటి ధోరణి దాదాపు ఒకేలా ఉంటుంది. క్రికెట్‌ని బట్టి పెట్టుబడి పాఠాలు నేర్చుకోవడమెలా? అన్నదే ఈ కథనం..
 
పెట్టుబడైనా..ఆటైనా.. ఫార్మాట్‌ని బట్టే..
 
క్రికెట్‌లో టెస్టులని, వన్డేలని, ట్వెంటీ ట్వంటీలని రకరకాల ఫార్మాట్లు ఉన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకం. ఏ ఆట తీరు దానిదే. టెస్టులు నిదానంగాను, వన్డేలు ఒక మోస్తరు వేగంగాను, ట్వెంటీ ట్వెంటీలు మహా ఫాస్ట్‌గాను సాగిపోతాయి. ఆయా ఫార్మాట్‌కి తగ్గట్లు ఆడితేనే విజయం వరిస్తుంది. పెట్టుబడులూ అంతే. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకు.. బైకు, కారు కొనుగోలు లాంటివి స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాలనుకుంటే.. ఇల్లు కొనుక్కోవడం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు మొదలైన వాటికి డబ్బు సమకూర్చుకోవడం అనేవి దీర్ఘకాలికమైనవి (ప్రారంభించే వయస్సును బట్టి). కాబట్టి వీటికి తగినట్లే షేర్లు, ఫండ్లు, బంగారం, ఫిక్సిడ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ లాంటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.  షేర్లు కావొచ్చు, ఇతర సాధనాలు కావొచ్చు.. ఎంత గొప్పగా, ఎంత స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసినా.. ఒకోసారి ఎదురుదెబ్బలు తప్పవు.

ఇందుకు కొన్ని కారణాలు స్వయంకృతాలు కావొచ్చు.. మరికొన్ని మన చేతుల్లో లేని పరిస్థితులు కూడా కావొచ్చు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో.. దెబ్బ తగిలేదాకా అర్థం కాదు. ఉదాహరణకు.. క్రితం ప్రపంచ కప్‌లో శ్రీలంక ఒక మ్యాచ్‌లో 45 ఓవర్లలో అతి కష్టం మీద 212 పరుగులు చేస్తే.. ఆఖరు అయిదు ఓవర్లలో 62 పరుగులు రాబట్టింది. అప్పటిదాకా ప్రత్యర్థి జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఆ తర్వాత పట్టు సడలిపోయింది. ఏ తప్పుడు నిర్ణయం దీనికి దారి తీసినది అంతుబట్టని విషయం. మార్కెట్లో పెట్టుబడులూ అంతే. మనం ఎంత చక్కగా విశ్లేషించుకుని, లెక్కలు కట్టుకున్నా.. కొన్ని సార్లు తప్పులు తప్పకపోవచ్చని గుర్తించాలి.
 
నమ్మకం ఉండాలి..: ఇన్వెస్ట్‌మెంట్ సాధనం గురించి పక్కాగా అధ్యయనం చేసి, లెక్కలు గట్టి.. ఎంపిక చేసుకున్న తర్వాత దానిపై పూర్తి నమ్మకం పెట్టాలి. ఒకోసారి కాస్త గురి తప్పినంత మాత్రాన ఖంగారుపడిపోకూడదు. సచిన్‌లు, సెహ్వాగ్‌లు లేకపోతే మ్యాచ్‌లు గెల్చే అవకాశాలే లేవన్న పరిస్థితుల నుంచి వారు లేకపోయినా కప్‌లు గెల్చుకు రాగలిగే స్థితికి చేరింది మన జట్టు. కొత్త వారిని ప్రోత్సహించడం, నమ్మకం ఉంచడమే దీనికి కారణం.  తాను కూర్చిన జట్టులో కొందరి ఆటతీరుపై విమర్శలు వచ్చినప్పటికీ ధోనీ వెరవకుండా.. ముందుకు సాగడం, ఆ ఆటగాళ్లే కీలక సమయాల్లో రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విధంగా.. కొన్ని సార్లు నిరాశపర్చిన సాధనాలే ఒకోసారి స్టార్స్‌గా మారుతుంటాయి.
 
సహనం ముఖ్యం: పెట్టుబడికైనా.. మరి దేనికైనా సహనం చాలా ముఖ్యం. ఇన్వెస్ట్‌మెంట్ గురువులుగా పేరొందిన వారెన్ బఫెట్, మన దగ్గర రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా లాంటి వారు ఇందుకు నిదర్శనం. ఇన్వెస్ట్‌మెంట్‌పై సరైన రాబడిని దక్కించుకునేందుకు వారు సంవత్సరాల తరబడి వేచి చూస్తారు. తాము తీసుకున్న నిర్ణయాలపై గట్టి నమ్మకంతో పాటు వాటి ఫలాలు సాధించడానికి అపారమైన సహన గుణం వీరి దగ్గర కనిపిస్తుంది. క్రికెట్ విషయానికొస్తే.. కెప్టెన్ కూల్‌గా ధోని కూడా దాదాపు ఇలాంటి ధోరణే కనబరుస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతను సహనం కోల్పోకుండా వ్యవహరించడమనేది ఇన్వెస్టర్లు నేర్చుకోదగిన పాఠం. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్లు.. కాస్త ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఖంగారుపడి స్టాక్స్ అమ్మేసుకోవడం, ఆ తర్వాత అవే స్టాక్స్ భారీ లాభాల్లోకి మళ్లినప్పుడు తీరిగ్గా కూర్చుని చింతించడం జరుగుతుంటుంది.
 
వైవిధ్యభరితం..: ఆకర్షణీయంగా ఉండే వాటిలో రిస్కులూ ఉంటాయి. మార్కెట్ పరిస్థితులు బాగున్నప్పుడు టకటకా పెరిగిపోతూ అధిక రాబడులు అందించే షేర్లు ఆకర్షణీయంగానే ఉంటాయి. వీటితో సమస్యేమిటంటే.. ఇవి ఎప్పుడూ కూడా ఒకే రకంగా భారీ లాభాలను ఇచ్చేయవు. మరోవైపు, పెద్ద మార్పులు లేకుండా సాగిపోయే బాండ్లు నిరాసక్తంగా కనిపించవచ్చు. కానీ ఇవి స్థిరమైన రాబడులు అందిస్తాయి.
 
క్రికెట్‌లోనూ అంతే.. మనం ఎక్కువగా బ్యాట్స్‌మెన్ (షేర్లు లాంటివారు)కే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాం. బౌలర్ల (బాండ్లు లాంటి వారు) గురించి ఎక్కువగా పట్టించుకోము. కానీ వాస్తవానికి మ్యాచ్ గెలవాలంటే ఇద్దరూ ముఖ్యమే. టీమ్‌ని మొత్తం బ్యాట్స్‌మెన్‌తో నింపేసినా లేదా బౌలర్లతో నింపేసినా మ్యాచ్ చేతికి రాదు. మన పెట్టుబడులూ అంతే. డబ్బంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో పెట్టేస్తే.. ఉపయోగం ఉండదు. కాబట్టి రిస్కులు ఎక్కువున్నా స్టాక్స్‌లో కొంత..ఫండ్స్, బంగారం, ఇతరత్రా సాధనాల్లో మరికొంత ఇన్వెస్ట్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అంతిమంగా చెప్పొచ్చేదేమిటంటే.. కెప్టెన్ కూల్‌గా ఉన్నవారే సరైన ఇన్వెస్టర్ కాగలరు. ఆశించిన రీతిలో సాధనాలు పనిచేయకపోయినా కుంగిపోకుండా.. అవసరానికి తగ్గట్లుగా వ్యూహాలు మారుస్తూ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించగలిగినప్పుడే పెట్టుబడుల్లో విజయం సొంతమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement