Twenty20 Cricket World Cup
-
క్రికెట్ బెట్టింగ్స్పై గురి
► మరో 11 మందిని పట్టుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ► రూ. 9.28 లక్షల నగదు 26 సెల్ఫోన్లు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టును మల్కాజిగిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు మరోసారి రట్టు చేశారు. మూడు రోజుల క్రితం కుషాయిగూడ పరిధిలో ఏడుగురు సభ్యుల బెట్టింగ్ ముఠాను పట్టుకున్న ఇదే ఎస్ఓటీ బృందం... టీ-20 క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్‌కు భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయన్న సమాచారంతో మేడిపల్లి, కుషాయిగూడ, వనస్థలిపురం ఠాణా పరిధిల్లో దాడి చేసి..11 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి పోలీసులు రూ. 9,28,299ల నగదు, ఒక ల్యాప్‌టాప్, 26 సెల్ఫోన్లు, రెండు కౌంటింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 29 మంది కోసం గాలిస్తున్నారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఐదేళ్ల నుంచి... సైదాబాద్ కాలనీకి చెందిన సీహెచ్ ప్రవీణ్‌కుమార్ ఐదేళ్లుగా నేరేడ్మెట్లో నివాసముంటున్న రాజస్థాన్ వాసి చేతన్ కుమార్‌తో కలిసి క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. మరో ఇద్దరు నిందితులు సంపత్, పండులతో కలిసి కుషాయిగూడ, ఉప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఒక్కో మ్యాచ్‌కు పంటర్ల నుంచి రూ.20 లక్షల నుంచి 25 లక్షలు వసూలు చేస్తున్నాడు. బోడుప్పల్‌లోని పాండు నివాసంలో పాండు, సుభాష్ చావ్లేలతో బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. 25 సెల్ఫోన్ల సహాయంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ నుంచి జన్నాత్, ప్రిన్స్, చిన్నా, చంద్, యోగేశ్‌లు ప్రవీణ్‌కుమార్ మార్గదర్శనంలో బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. అలాగే వనస్థలిపురానికి చెందిన సత్య సురేశ్, హరీశ్ కుమార్, నాగరాజు సంయుక్తంగా వనస్థలిపు రం, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ని అమలాపురం, విశాపట్నంల్లోనూ బెట్టింగ్స్‌కు తెరలేపారు. పంటర్ల నుంచి డబ్బులు సేకరించేందుకు రవితేజ, క్రాంతికిరణ్ అనే అన్నదమ్ములను వినియోగించుకుంటున్నారు. లాలాపేటకు చెందిన మరో క్రికెట్ బుకీ కిశోర్‌గౌడ్ నేరేడ్మెట్ ఠాణా పరిధిలో క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. ఇతను సంతోష్‌కుమార్, రమేశ్ అనే ఇద్దరి సహకారంతో పంటర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఏకకాలంలో దాడులు... సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎస్ఓటీ అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి నేతృత్వంలోని మల్కాజిగిరి ఎస్ఓటీ బృందం క్రికెట్ బెట్టింగ్స్పై ఆరా తీసింది. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ-20 సెమీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో మల్కాజిగిరి జోన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గురువారం ఏకకాలంలో ఆయా ప్రాంతాల్లో దాడి చేసి సీహెచ్ ప్రవీణ్‌కుమార్, సీహెచ్ సంపత్‌కుమార్, ఎం.పాండు, సుభాష్ చావ్లే, ఎం.నారాయణ, కొరడా రవితేజ, మావూరిదేవ సుబ్రహ్మణ్యం, కర్నాటి అనిల్ కుమార్, ముతపురం శ్రీనివాస్, కిశోర్‌గౌడ్, పెద్ది సంతోష్ కుమార్, పరిగి రమేశ్‌లను అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన బుకీలు, కలెక్షన్ ఏజెంట్లు, పంటర్లు, లైన్ ఆర్గనైజర్లు ఉన్నారు, అయితే మరో 29 మంది కోసం గాలిస్తున్నారు. బషీర్‌బాగ్‌లో మరో ఇద్దరి అరెస్ట్ ఖైరతాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని సైఫాబాద్ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ మహాలక్ష్మయ్య కథనం ప్రకా రం.... మలక్‌పేట నివాసి జస్విందర్‌సింగ్ అలి యాస్ రాంకీ (34), కుత్బుల్లాపూర్ నివాసి అషఫ్ ్రఅలియాస్ అహ్మద్(26) ఢిల్లీ కేంద్రంగా వాట్సాఫ్ ద్వారా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి బషీర్‌బాగ్‌లో కారులో వీరిద్దరూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.53 వేల 500 నగదు, రెండు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. జస్విందర్‌సింగ్,అషఫ్ల్రపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పెట్టుబడులు బౌండరీలు దాటాలంటే
ట్వెంటీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఆఖరు దశకు వచ్చేసింది. దాదాపు ఇరవై రోజుల నుంచి జరుగుతున్న మ్యాచ్‌ల్లో కొన్ని మినహా మిగతావన్నీ ఉత్కంఠభరితంగానే సాగాయి. పర్సనల్ ఫైనాన్సు.. పెట్టుబడులు, ఖర్చుల పేజీలో ఈ క్రికెట్ కబుర్లేమిటి .. దానికీ దీనికి సంబంధమేమిటీ అనుకుంటున్నారా? ఉంది.. సంబంధముంది.. ఎందుకంటే, ఏవో కొన్ని మ్యాచ్‌లు మినహా.. క్రికెట్లో ఏ క్షణానికి మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందోనని చివరి బంతి వరకూ టెన్షన్‌గానే ఉంటుంది. ఏ కాస్త ఆదమర్చినా ఏమైనా జరగవచ్చు.. కనుక ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, అవసరమైనప్పుడల్లా వ్యూహాలు మార్చుకుంటూ ఉండాలి. ఇలాంటి క్రికెట్ సూత్రాలే.. పెట్టుబడులకూ వర్తిస్తాయి. ఎందుకంటే రెండింటి ధోరణి దాదాపు ఒకేలా ఉంటుంది. క్రికెట్‌ని బట్టి పెట్టుబడి పాఠాలు నేర్చుకోవడమెలా? అన్నదే ఈ కథనం.. పెట్టుబడైనా..ఆటైనా.. ఫార్మాట్‌ని బట్టే.. క్రికెట్లో టెస్టులని, వన్డేలని, ట్వెంటీ ట్వంటీలని రకరకాల ఫార్మాట్లు ఉన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకం. ఏ ఆట తీరు దానిదే. టెస్టులు నిదానంగాను, వన్డేలు ఒక మోస్తరు వేగంగాను, ట్వెంటీ ట్వెంటీలు మహా ఫాస్ట్గాను సాగిపోతాయి. ఆయా ఫార్మాట్‌కి తగ్గట్లు ఆడితేనే విజయం వరిస్తుంది. పెట్టుబడులూ అంతే. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. బైకు, కారు కొనుగోలు లాంటివి స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాలనుకుంటే.. ఇల్లు కొనుక్కోవడం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు మొదలైన వాటికి డబ్బు సమకూర్చుకోవడం అనేవి దీర్ఘకాలికమైనవి (ప్రారంభించే వయస్సును బట్టి). కాబట్టి వీటికి తగినట్లే షేర్లు, ఫండ్లు, బంగారం, ఫిక్సిడ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ లాంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. షేర్లు కావొచ్చు, ఇతర సాధనాలు కావొచ్చు.. ఎంత గొప్పగా, ఎంత స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసినా.. ఒకోసారి ఎదురుదెబ్బలు తప్పవు. ఇందుకు కొన్ని కారణాలు స్వయంకృతాలు కావొచ్చు.. మరికొన్ని మన చేతుల్లో లేని పరిస్థితులు కూడా కావొచ్చు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో.. దెబ్బ తగిలేదాకా అర్థం కాదు. ఉదాహరణకు.. క్రితం ప్రపంచ కప్‌లో శ్రీలంక ఒక మ్యాచ్‌లో 45 ఓవర్లలో అతి కష్టం మీద 212 పరుగులు చేస్తే.. ఆఖరు అయిదు ఓవర్లలో 62 పరుగులు రాబట్టింది. అప్పటిదాకా ప్రత్యర్థి జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఆ తర్వాత పట్టు సడలిపోయింది. ఏ తప్పుడు నిర్ణయం దీనికి దారి తీసినది అంతుబట్టని విషయం. మార్కెట్లో పెట్టుబడులూ అంతే. మనం ఎంత చక్కగా విశ్లేషించుకుని, లెక్కలు కట్టుకున్నా.. కొన్ని సార్లు తప్పులు తప్పకపోవచ్చని గుర్తించాలి. నమ్మకం ఉండాలి..: ఇన్వెస్ట్మెంట్ సాధనం గురించి పక్కాగా అధ్యయనం చేసి, లెక్కలు గట్టి.. ఎంపిక చేసుకున్న తర్వాత దానిపై పూర్తి నమ్మకం పెట్టాలి. ఒకోసారి కాస్త గురి తప్పినంత మాత్రాన ఖంగారుపడిపోకూడదు. సచిన్‌లు, సెహ్వాగ్‌లు లేకపోతే మ్యాచ్‌లు గెల్చే అవకాశాలే లేవన్న పరిస్థితుల నుంచి వారు లేకపోయినా కప్‌లు గెల్చుకు రాగలిగే స్థితికి చేరింది మన జట్టు. కొత్త వారిని ప్రోత్సహించడం, నమ్మకం ఉంచడమే దీనికి కారణం. తాను కూర్చిన జట్టులో కొందరి ఆటతీరుపై విమర్శలు వచ్చినప్పటికీ ధోనీ వెరవకుండా.. ముందుకు సాగడం, ఆ ఆటగాళ్లే కీలక సమయాల్లో రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విధంగా.. కొన్ని సార్లు నిరాశపర్చిన సాధనాలే ఒకోసారి స్టార్స్‌గా మారుతుంటాయి. సహనం ముఖ్యం: పెట్టుబడికైనా.. మరి దేనికైనా సహనం చాలా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్ గురువులుగా పేరొందిన వారెన్ బఫెట్, మన దగ్గర రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా లాంటి వారు ఇందుకు నిదర్శనం. ఇన్వెస్ట్‌మెంట్‌పై సరైన రాబడిని దక్కించుకునేందుకు వారు సంవత్సరాల తరబడి వేచి చూస్తారు. తాము తీసుకున్న నిర్ణయాలపై గట్టి నమ్మకంతో పాటు వాటి ఫలాలు సాధించడానికి అపారమైన సహన గుణం వీరి దగ్గర కనిపిస్తుంది. క్రికెట్ విషయానికొస్తే.. కెప్టెన్ కూల్‌గా ధోని కూడా దాదాపు ఇలాంటి ధోరణే కనబరుస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతను సహనం కోల్పోకుండా వ్యవహరించడమనేది ఇన్వెస్టర్లు నేర్చుకోదగిన పాఠం. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్లు.. కాస్త ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఖంగారుపడి స్టాక్స్ అమ్మేసుకోవడం, ఆ తర్వాత అవే స్టాక్స్ భారీ లాభాల్లోకి మళ్లినప్పుడు తీరిగ్గా కూర్చుని చింతించడం జరుగుతుంటుంది. వైవిధ్యభరితం..: ఆకర్షణీయంగా ఉండే వాటిలో రిస్కులూ ఉంటాయి. మార్కెట్ పరిస్థితులు బాగున్నప్పుడు టకటకా పెరిగిపోతూ అధిక రాబడులు అందించే షేర్లు ఆకర్షణీయంగానే ఉంటాయి. వీటితో సమస్యేమిటంటే.. ఇవి ఎప్పుడూ కూడా ఒకే రకంగా భారీ లాభాలను ఇచ్చేయవు. మరోవైపు, పెద్ద మార్పులు లేకుండా సాగిపోయే బాండ్లు నిరాసక్తంగా కనిపించవచ్చు. కానీ ఇవి స్థిరమైన రాబడులు అందిస్తాయి. క్రికెట్లోనూ అంతే.. మనం ఎక్కువగా బ్యాట్స్‌మెన్ (షేర్లు లాంటివారు)కే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాం. బౌలర్ల (బాండ్లు లాంటి వారు) గురించి ఎక్కువగా పట్టించుకోము. కానీ వాస్తవానికి మ్యాచ్ గెలవాలంటే ఇద్దరూ ముఖ్యమే. టీమ్‌ని మొత్తం బ్యాట్స్‌మెన్‌తో నింపేసినా లేదా బౌలర్లతో నింపేసినా మ్యాచ్ చేతికి రాదు. మన పెట్టుబడులూ అంతే. డబ్బంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో పెట్టేస్తే.. ఉపయోగం ఉండదు. కాబట్టి రిస్కులు ఎక్కువున్నా స్టాక్స్‌లో కొంత..ఫండ్స్, బంగారం, ఇతరత్రా సాధనాల్లో మరికొంత ఇన్వెస్ట్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అంతిమంగా చెప్పొచ్చేదేమిటంటే.. కెప్టెన్ కూల్‌గా ఉన్నవారే సరైన ఇన్వెస్టర్ కాగలరు. ఆశించిన రీతిలో సాధనాలు పనిచేయకపోయినా కుంగిపోకుండా.. అవసరానికి తగ్గట్లుగా వ్యూహాలు మారుస్తూ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించగలిగినప్పుడే పెట్టుబడుల్లో విజయం సొంతమవుతుంది.