మన్యం కదిలింది!
మన్యం కదిలింది. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చొద్దంటూ వేలాది మంది గిరిజనం కదం తొక్కారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డు నుంచి కలెక్టర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. తమకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోందని నినదించారు. కలెక్టరేట్‌ను ముట్టడించి నిరసన తెలియజేశారు. ఇదే సమయంలో ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ 57 రోజులుగా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మత్స్యకారుల శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతోపాటు నిప్పటించడంతో కలకలం రేగింది. కలెక్టర్, ఎస్పీ తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గిరిజనం గళమెత్తింది. తమకు అన్యాయం చేయవద్దంటూ నినదించింది. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చుతూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు సోమవారం చలో కలెక్టరేట్‌కు పిలుపునివ్వడంతో గిరిజనలు భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి వాంబే కాలనీ, వృద్ధాశ్రమం ప్రాంతాలు గిరిపుత్రులతో నిండిపోయాయి. ఆదివాసీ ఉద్యోగ, విద్యార్ధి, మహిళా సంఘాలు, హక్కుల పోరాట సమితిలు భాగస్వాములయ్యాయి.
తరలివచ్చిన జనం
కంచిలి, సోంపేట, మందస, పలాస, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల నుంచి వివిధ వాహనాల్లో సుమారు పది వేల మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టరేట్‌కు ర్యాలీ గా వచ్చారు. జనం భారీగా ఉండడంతో పో లీసులు సైతం వీరిని అడ్డుకోలేదు. కలెక్టరేట్‌ను ముట్టడించిన గిరిజనులు తమ డి మాండ్లను పరిష్కరించాలని నినదించారు. టీడీపీ ప్రభుత్వం తమపై కక్షకట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎస్టీ జాబితాలో మరిన్ని జాతులను కలిపి ఎస్టీలను మరింత వెనుకబాటు చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. ఈ కారణంతోనే బోయ, వాల్మీక కులాలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు అ సెంబ్లీ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని జేఏసీ నేతలు దుయ్యబట్టారు.
బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్పించాలని చేసిన సిఫార్సును వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆరు శాతం రిజర్వేషన్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. 1952 నాటి గిరిజన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిం చారని, అయితే ప్రస్తుత జనాభా పెరిగినందున దీనికి అనుగుణంగా రిజర్వేషన్ పది శాతానికి పెంచాలని నినాదాలు చేశారు. జిల్లాలో గిరిజనుల పేరుతో వందలాది మంది నకిలీ కుల ధ్రువ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అటువంటి వారిని వెంటనే తొలగించాని, ఆ ధ్రువపత్రాలు మంజూరు చేసిన వారిని, వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, బీసీ సంక్షేమ శాఖలో వసతి గృహ అధికారిగా పనిచేస్తున్న నకిలీ గిరిజన ఉద్యోగి కుమార్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు
గిరిజనులకు అన్యాయం చేసేం దుకే బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు చేయడం తగదని గిరిజన జేఏసీ ప్రతినిధులు నినదించారు. ముఖ్య మంత్రి, టీడీపీ నాయకులు కలిసి ఎస్టీలపట్ల కుట్రపన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక నుంచి ఏ ఒక్క ఇతర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామంటూ.. ఏ రాజకీయ పార్టీ కూడా వారి ఎన్నిక మ్యానిఫెస్టోలో పెట్టరాదన్నారు. అలా వాగ్దానాలు చేస్తే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గడిచిన 60 రోజులుగా మన్యంలో దీక్షలు చేస్తు న్నా ముఖ్యమంత్రి, మంత్రుల్లో చలనం లేదన్నారు. దీంతో ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకురావాల్సి వచ్చిందని ఆదివాసీ జేఏసీ నాయకులు వాబ యోగేశ్వరరావు, సవర రాంబాబు తదితరులు అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో 32 తెగలు ఉన్నాయని, రాష్ట్రంలో 28 లక్షల మంది, జిల్లాలో 1.82 లక్షల మంది గిరిజన జనాభా ఉందన్నారు. ప్రభుత్వం తీరుతో సవర, కాపుసవర, జాతాపు, మలే సవర, చెంచులు, కొండదొరలు, కొండ రెడ్లకు అన్యాయం జరుగుతోందన్నారు.
ఉద్యమంలో పాల్గొన్న నాయకులు
ఉద్యమంలో ఆదివాసీల సంక్షేమ పరిషత్, వికాస్ పరిషత్, ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, హక్కుల పోరాట సమితి, పీడీఎస్యుల ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల జాయింట్ ఎక్షన్ కమిటీ (జేఏసీ) జిల్లా అధ్యక్షుడు వాబ యోగి, సంఘాల ప్రతినిధులు గూడ ఎండయ్య, సవర జగన్నాథం, వి.భానుచందర్, ఎం.భాగ్యలక్ష్మి, కె.శ్రీను, ఎస్.చిరంజీవులు, ఎ.రామారావు, కృష్ణారావు, గణ్వేరరావు, బి.సింహాచలం, దుర్యోధన, సిద్ధేశ్వరరావు, మాధవయ్య, ఎస్.షణ్ముఖరావు, జి. మోహనరావు, జి.అప్ప న్న, ఆర్.పోతయ్య, ఎస్.నారాయణరావు పాల్గొన్నారు.
200 మందిపై కేసు నమోదు
శ్రీకాకుళం సిటీ: కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల శిబిరంపై సోమవారం కొంతమంది దాడి చేసిన ఘటనలో 200 మంది ఆదివాసీలపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఒకటో పట్టణ ఎస్సై ఈ. చిన్నంనాయుడు తెలిపారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
కలెక్టర్, ఎస్పీల సందర్శన
భారీగా గిరిజనులు తరలి రావడం.. ముఖ్యమంత్రికి, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎస్టీ త్రివిక్రమవర్మ స్పందించారు. గిరిజనులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి వారితో మాట్లాడారు. తొలుత జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతరావు గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకుల నుంచి తీసుకున్నారు. అయితే గిరిజనులు శాంతించలేదు. కలెక్టర్ రావాలని పట్టుపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి వచ్చారు. గిరిజన సమస్యల పరిష్కారం తన పరిధిలో లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ కూడా వచ్చి మత్స్యకారులు నిరసన దీక్షలు చేస్తున్నారని.. వారికి ఇబ్బంది లేకుండా మెలగాలని సూచించారు. ఏఎస్పీ పనసారెడ్డి, డీఎస్పీలు పెంటారావు, భీమారావు, సీఐలు నవీన్ కుమార్, ప్రదసాద్, తిరుపతిరావు బందోబస్తును పర్యవేక్షించారు.
గిరిజన ఉద్యమం ముసుగులోమత్య్సకార శిబిరం ధ్వంసం
గిరిజన ఉద్యమం ముసుగులో ఉన్న కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు మత్స్యకారుల రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. ఎస్టీలో జాబితాలో చేర్చాలంటూ కలెక్టరేట్ వద్ద మత్య్స కారులు రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని చూసిన అధికార పార్టీకి చెందిన కొంతమంది గిరిజన ముసుగులో రెచ్చిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి.. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పినా శిబి రాన్ని ఎత్తివేయడం లేదని, మత్స్యకారులపై చర్యలు తీసుకోలేక, గిరిజన ఉద్యమం నేపథ్యంలో మత్స్యకారుల దీక్షకు భంగం కలిగించేందుకు కొంతమంది అధికార పా ర్టీకి చెందిన వారు శిబిరానికి నిప్పంటించినట్టు తెలిసింది. శిబిరానికి కట్టిన పోస్టర్లు, కర్టన్లను పీకేశారు. టెంట్‌ను కూల్చివేసి.. నిప్పంటించారు. ఈ క్రమంలో రిలే నిరా హార దీక్షలో ఉన్న సోంపేట మండలం ఇసకలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు నిట్ట లక్ష్మీనారాయణ గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో పది మంది స్వల్పం గా గాయపడ్డారు. ఈ సంఘటనతో కొద్దిసేపు కలకలం రేగింది. అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేసింది.