సాక్షి, అనంతపురం, కర్నూలు : మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే వాల్మీకి సినిమా మార్చాలంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో ....శాంతిభద్రతల దృష్ట్యా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
‘గద్దలకొండ గణేష్’ గా వస్తున్న వరుణ్ తేజ్
అయితే వాల్మీకి సినిమా టైటిల్ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. సినిమా పేరు మార్చాలంటూ... వాల్మీకి, బోయ సామాజక వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ’వాల్మీకి’ చిత్ర బృందం వెనక్కి తగ్గింది. సినిమా టైటిల్‌పై వివాదానికి సంబంధించి చిత్ర యూనిట్ గురువారం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. కాగా వాల్మీకి సినిమా పేరును ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ తమను కించపరిచే విధంగా ఉందని, వాల్మీకి పేరును మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్ బోర్డు, ఫిలిం ఛాంబర్‌లతో పాటు హీరో వరుణ్ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. నోటీసులపై స్పందించిన చిత్ర యూనిట్.. వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని గురువారం హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా సినిమా టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చుతున్నట్లు పేర్కొంది. దీంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘వాల్మీకి’ చిత్ర వివాదానికి లైన్ క్లియర్ అయినట్లే.
కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు, సంఘాలు.... ‘వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. మరోవైపు కర్నూలు జిల్లా సినిమా విడుదలను నిలిపివేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. వాల్మీక, బోయ సామాజిక వర్గాల అభ్యర్థన నేపథ్యంలో జిల్లాలో అన్ని సినిమి థియేటర్లలో వాల్మీకి సినిమా నిలిపివేయాలంటూ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రి జయరాములు గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిత్ర యూనిట్ తాజా నిర్ణయంతో రెండు జిల్లాల్లోనూ సినిమా విడుదల కానుంది.
వాల్మీకి టైటిల్ మార్చాలని మంత్రి లేఖ
అలాగే వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ, కర్మాగారాలు శాఖ మంత్రి గుమ్మనూరు జయరాములు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ‘వాల్మీకి సినిమా ప్రారంభం నుంచి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా వాల్మీకి కులస్తులతో పాటు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సినిమా పేరు ఉందని నా దృష్టికి వచ్చింది. వెంటనే సినిమా టైటిల్ మార్చాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో పాటు ప్రాంతీయ సెన్సార్ అధికారి రాజశేఖర్‌కు లేఖలు రాశాము’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment