సాక్షి, విశాఖ : గద్దలకొండ గణేష్ కథ తనకు నచ్చినా.. ఎన్నో సందేహాలు తలెత్తాయని.. పెదనాన్న చిరంజీవి ధైర్యమిస్తూ వెన్ను తట్టడంతోనే ముందడుగు వేయగలిగానని గద్దలకొండ గణేష్ చిత్రం హీరో వరుణ్ తేజ్ అన్నారు. తన పాత్రకు విశేష ప్రేక్షకాదరణ లభిస్తున్నందుకు ఎంతో సంతోషం కలుగుతోందని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. అందరికీ ఈ పాత్ర నచ్చుతుందని అనుకున్నా కానీ మరీ ఇంత నచ్చుతుందని మాత్రం అనుకోలేదని చెప్పారు. విజయయాత్రలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు.. విడుదలైన తర్వాత పరిణామాల గురించి మాట్లాడారు.
‘పెదనాన్న చిరంజీవి ఇచ్చిన ధైర్యంతోనే గద్దల కొండ గణేష్ చిత్రంలో నటించేందుకు ధైర్యంగా ముందడుగు వేశాను. గద్దల కొండ గణేష్ సినిమా స్టోరీ విన్నప్పుడు నాకు తెగ నచ్చింది. అయితే కొందరు సన్నిహితులు మాత్రం వద్దన్నారు. దాంతో తటపటాయించాను. అప్పుడు పెదనాన్న గుర్తుకు వచ్చారు. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం, సినిమాలను బాగ జడ్జ్ చేయగలగే అవగాహన ఉన్న ఆయనకు విషయం చెబితే బాగుంటుందనిపించింది. నేను, డైరెక్టర్ హరీష్ శంకర్ వెళ్లి స్టోరీ చెప్పాం. ఆయన థ్రిల్లయ్యారు. స్టోరీ చాలా బాగుందని, మంచి పేరు వస్తుందని చెప్పారు. ఆ ధైర్యంతో ఈ సినిమా తీశాం. సినిమా చూసిన తర్వాత పెదనాన్న మాతో మాట్లాడుతూ, అప్పుడు చెప్పిన కథ కంటే సినిమా చాలా బాగుందని ప్రశంసించారు.’ అని వరుణ్‌తేజ్ చెప్పారు.
పెదనాన్న సినిమాలు చేయాలనుకోను
చిరంజీవి సినిమాలను చూడాలని ఉంటుంది తప్ప అలా నటించాలని ఉండదని వరుణ్‌తేజ్ అన్నారు. ‘ఆయన సినిమా అంటే ఇష్టం. వాటిని మళ్లీ తీసే సాహసం చేయను. సైరా సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. కల్యాణ్ బాబాయి కూడా ఆ సినిమా ప్రమోషన్‌లో ఉన్నారు.’ అని చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అభినందనలు మరిచిపోలేనివని చెప్పారు. ‘ ఆయన ఈ సినిమా చూసి చాలా బాగా తీశారని మెచ్చుకున్నారు. వెల్లువొచ్చి గోదారమ్మా పాటను ఆయనతోనే విడుదల చేయించినపుపడు కూడా ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందన్నారు.’ అని తెలిపారు.
ఇంత పేరు మునుపు లేదు..
గతంలో ఎన్ని సినిమాలు హిట్ అయినా తనకు ఇంత పేరు రాలేదని, ఎక్కడికి వెళ్లినా వరుణ్ అనే పిలిచేవారని వరుణ్‌తేజ్ చెప్పారు. ‘ఈ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గద్దలకొండ గణేష్ అని పిలిస్తున్నారు. ఇది వింటే చాలా గర్వంగా ఉంది. ఈ పాత్ర ప్రేక్షకులను ఇంతలా ఆకర్షిస్తుందని అనుకోలేదు. ఇలాంటి పాత్ర చేయాలని అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అలాంటి కథ రాలేదు. డైరెక్టర్ హరీష్ శంకర్ కథ చెప్పగానే ఎంతో ఉత్సహం కలిగింది.’ అని చెప్పారు. ‘కథను నిర్థారించాక గణేష్ పాత్ర ఎలా ఉండాలి.., ఎలా ప్రవర్తించాలి అనేదానిపై మూడు నెలల పాటు రోజుకు ఎనిమిది గంటలపైగా డైరెక్టర్, నేను చర్చించుకున్నాం. మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది.’ అని చెప్పారు.
వరుణ్‌తో అన్ని భాషల్లో సినిమా చేస్తా..
తెలుగు సినిమా ఇప్పుడు ఇతర భాషల ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుందని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ‘వరుణ్ పర్సనాలిటీ అన్ని భాషాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. తర్వలోనే వరుణ్‌తో అన్ని భాషల్లో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తా’ అని చెప్పారు. ఈ చిత్రం టైటిల్ మార్చడం గురించి మాట్లాడుతూ.. ‘కథలు రాసే హక్కు మాత్రమే మనకు ఉంది కానీ టైటిల్ పెట్టే హక్కు మనకు లేదు’ అనిపిస్తుందన్నారు. సినిమా పేరు మార్చుకుండా ఉండి ఉంటే ప్రేక్షకులను ఇంకా బాగా ఆకర్షించేదన్నది తన అభిప్రాయమని చెప్పారు.
వైజాగ్ అంటే చాలా ఇష్టం
‘నేను నటనను సత్యానంద్ మాస్టర్ వద్ద నేర్చుకున్నా. ఆరు నెలల పాటు సీతమ్మధారలో ఉన్నా. వైజాగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్‌లొ బీచ్ లేకపోవడం వల్ల వైజాగ్ బీచ్ మరీ ఆకర్షిస్తుంది.’ అని వరుణ్ తేజ్ చెప్పారు. తొలిప్రేమ సినిమాను చాలామట్టుకు ఇక్కడే షూట్ చేశామని గుర్తు చేసుకున్నారు. సినిమా ట్రైలర్ చూసి కల్యాణ్ బాబాయి చాలా బాగుందన్నారని, అయితే సినిమా ఇంకా చూపించలేదని చెప్పారు. విజయోత్సవ యాత్ర ముగిశాక వెళ్లి కల్యాణ్ బాబాయికి చూపిస్తానన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment