బహు భేషైన బ్రెడ్
పిల్ల ఏడ్చింది! అయితే బ్రెడ్ ముక్కలు పెట్టమంటున్నారు ఇప్పటి ఆధునిక బామ్మలు. ఎందుకంటే చపాతీ ముద్ద కలిపి, పూరీలు, పుల్కాలు చేసి.. నూనె వేసి, కాల్చి ఇచ్చే తీరిక, ఓపికా రెండు కరువైపోయాయి. అందుకే, కాస్త జామ్ పూసి, ఆమ్లెట్ వేసి ఇన్స్టంట్ బ్రెడ్లనే పిల్లలకు అందించేస్తున్నారు మోడ్రన్ అమ్మలు. ఏ బ్రెడ్ అయితేనేం గోధుమ రెసిపీ అయితే అన్ని విధాలా ఆరోగ్యకరమే! ఇంతకీ విషయమేంటంటే త్వరలో ‘బ్రెడ్ డే’ రాబోతుంది. దాని విశేషాలు ఓ సారి చూద్దాం!!
బుల్లి చపాతి!!
‘అమ్మా.. నాకు బుల్లి ఉండ ఈయమ్మా.. నేను కూడా చపాతీ చేసుకుంటా..’ అని ముద్దుముద్దుగా అడిగే బుల్లి బుజ్జాయిలను చూస్తే బాల్యం భలే గుర్తొస్తుంది. చిన్నప్పుడు బుల్లి చపాతి, బుల్లి పూరి లాగించిన జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతుంటాయి. హాలీడే వచ్చిందంటే చపాతీ, పూరీలకు ప్రత్యేకమైన రోజు. బంగాళాదుంప కుర్మాలో చపాతీని అలా తుంచి.. ఇలా నోట్లో పెట్టుకుంటే....! అబ్బా, నోరు ఊరుతుంది కదూ.. వెంటనే తినాలనిపిస్తుంది కదూ! మనం అప్పుడప్పుడు అరుదుగా చేసుకునే చపాతీలు, పుల్కాలను నార్త్ ఇండియన్స్ రెగ్యులర్‌గా లాగిస్తుంటారు. మనం చేసుకునే ఈ చపాతీలనే ఫారినర్స్ ఫ్లాట్ బ్రెడ్స్ అంటారు.
బ్రెడ్ కథలు
కొన్ని ఏళ్ల క్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా బ్రిటన్‌లో బ్రెడ్ గేమ్ జరిగేది. బ్రెడ్‌లో సిల్వర్ కాయిన్ పెట్టి ఆడే ఈ ఆటలో ధనికులే అధికంగా పాల్గొనేవారట. ఈ రోజుల్లో బ్రెడ్ అన్ని తరుగతుల వారు వాడుతున్నారు. అయితే మధ్యయుగంలో పాశ్చాత్య ఐరోపా వారు బ్రెడ్‌ను తరగతుల వారీగా తయారు చేసుకునేవారట. వాటికి పోప్స్ లోఫ్(బ్రెడ్), కోర్ట్స్ లోఫ్, కామన్ లోఫ్ అనే రకరకాల పేర్లు ఉండేవి.
బెటర్ బ్రెడ్
ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ – బి వంటి పోషకాలెన్నో బ్రెడ్‌లో ఉంటాయి. బ్రిటన్ పురుషులు రోజుకి 113 గ్రాముల బ్రెడ్ తింటుంటే.. అక్కడి మహిళలు 76 గ్రాములు లాగించేస్తున్నారు. 2007 నుంచి సగటు ఆహారం, ఇతర పానీయాల ధర 33 శాతం పెరగగా... బ్రెడ్ ధర 34 శాతం పెరిగింది.
బ్రెడ్ నమ్మకాలు
ఏదేమైనా ఆచారాలు, నమ్మకాల విషయంలో మనుషులంతా ఒక్కటేనేమో అనిపిస్తుంది. స్కాండినేవియన్ సంప్రదాయంలో.. అమ్మాయి, అబ్బాయి ఒకే బ్రెడ్ తింటే వాళ్లు ప్రేమలో ఉన్నట్లు అర్థమట. ఇక బ్రెడ్ అనేది ఈజిప్టు ప్రజలకు గౌరవప్రదమైంది. ఒకప్పుడు దాన్ని కరెన్సీగా కూడా ఉపయోగించేవారు. మరణించిన శవాలతో పాటు... బ్రెడ్ కూడా సమాధుల్లో పెట్టడం వారి ఆచారం. మరోవైపు మధ్యయుగంలో ఫ్రాన్స్‌లోని వడ్డీ వ్యాపారులు బ్రెడ్‌ను అప్పులుగా ఇచ్చేవారట. ఇక కొన్ని చోట్ల టోస్ట్ చేసేటప్పుడు బ్రెడ్ బోర్లపడితే అశుభమనే మూఢ నమ్మకం కూడా ఉంది.
గోధుమ లెక్కలు
ఒక మనిషి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్గా మొత్తం గోధుమ ఆహారాన్నే తీసుకున్నట్లయితే... 168 రోజులకు సుమారు 60 కేజీల గోధుమలు ఖర్చు అవుతాయి. అంటే... ఒక ఎకరంలో పండే గోధుమలతో నలుగురు సభ్యులు సంవత్సరం పాటు జీవించొచ్చు.
చరిత్రలో బ్రెడ్బ్రెడ్ తయారీ అనేది క్రీస్తు పూర్వం 2,500 ఏళ్ల క్రితమే ఉంది. అప్పట్లోనే 80 రకాల బ్రెడ్ తయారు చేసుకునేవారు. ఈ విశేషాలన్నీ పక్కనపెడితే... ‘బ్రెడ్ డే’ రోజున గోధుమ ఐటమ్స్ చేసుకుని ఇంటిళ్లిపాది తింటే బహు బాగుంటుంది కదూ! మరి ఈ సారికి అలా కానిచ్చేయ్యండి!!