Broadcasting Ministry
-
బెట్టింగ్ సైట్ల ప్రకటనలొద్దు టీవీ చానళ్లకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బెట్టింగ్ సైట్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ప్రసారంపై కేంద్రం సోమవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. ‘ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను వాటికి సంబంధించిన వార్త వెబ్సైట్లను, వాటి ఉత్పత్తులు/సేవల సంబంధ అంశాలను చూపే వాణిజ్య ప్రకటనల ప్రసారం మానుకోండి’ అని న్యూస్ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం సూచించింది. ఈ మార్గదర్శకాలు, చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ప్రైవేట్ శాటిలైట్ చానళ్లను కేంద్రం హెచ్చరించింది. వార్తలను ప్రచురించే పబ్లిషర్లకు, డిజిటల్ మీడియాకూ ఇదే తరహా సూచనలిస్తూ విడిగా మార్గదర్శకాలను పంపింది. ‘సొంత న్యూస్ వెబ్సైట్ల మాటున కొన్ని బెట్టింగ్ సంస్థలు తమను తాము అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి. బెట్టింగ్ సంస్థల లోగోలే ఆ న్యూస్ వెబ్సైట్లకూ ఉంటున్నాయి. ఈ వెబ్సైట్లు ఏవీ భారత చట్టాలకు లోబడి అధీకృత యంత్రాంగం వద్ద రిజిస్టర్ కాలేదు. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, వార్తలు ప్రసారం చేస్తూ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు పాల్పడుతున్నాయి. వీటిలో కొన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్లు, క్రీడా వార్తల వెబ్సైట్లుగా చెలామణి అవుతున్న విషయంపై వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని అప్రమత్తం చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. -
గిరిజన మాండలికాల్లో ప్రసారాలు
న్యూఢిల్లీ: గిరిజన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించడానికి రేడియో కార్యక్రమాల్లో మరిన్ని గిరిజన మాండలికాలను చేర్చాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీని కోసం ఆలిండియా రేడియో, గిరిజన సంక్షేమ శాఖలను సంప్రదించి, ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించారు. గిరిజనులు తమ భాషకాని భాషకు అర్థం చేసుకోలేరని, అందుకే షార్ట్వేవ్ కార్యక్రమాల ద్వారా కొండ, అటవీ ప్రాంతాల్లోని గిరిజనులను వారి మాండలికాల ప్రసారాల ద్వారా చేరుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది. -
సమాచారానికి 17% పెంపు
న్యూఢిల్లీ: సమాచార, ప్రసార శాఖకు ఈసారి బడ్జెట్లో రూ. 3,711.11 కోట్లను కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 3,176.80 కోట్లతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. ఇందులో మెజారిటీ వాటా (రూ. 2,869.55 కోట్లు) ప్రభుత్వ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ప్రసార భార తికి ప్రభుత్వ సహాయం కింద అందనుంది. అలాగే, త్వరలో ప్రారంభం కానున్న దూరదర్శన్‌కు చెందిన కిసాన్ చానల్‌కు రూ. 45 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్ మీడియా పర్యవేక్షణ కేంద్రానికి రూ. 10.41 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల కోసం అరుణాచల్ ప్రదేశ్‌లో సినిమా నిర్మాణం, యానిమేషన్, గేమింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.