క్షణికావేశానికి ముగ్గురి బలి
అమరచింత (కొత్తకోట): చిన్నపాటి వివాదం ఓ కుటుంబంలోని మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరు అన్నలు, ఓ చెల్లి క్షణికావేశంలో బావిలో దూకి మృతి చెందిన ఈ సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల ఎక్స్‌రోడ్డు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా.. నందిమల్ల ఎక్స్‌రోడ్డులో నివాసం ఉంటున్న దళిత రంగన్న, యాదమ్మకు నలుగురు సంతానం. పెద్దకూతురు రేణమ్మకు పదేళ్ల కిందట, పెద్ద కుమారుడు సంజీవ్(24)కు ఐదేళ్ల కిందట పెళ్లి చేశారు. రెండో కుమారుడు రమేష్(21) తనకు పెళ్లి చేయాలని ఈమధ్య తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు.
ఈ తరుణంలోనే బుధవారం ఇంట్లో కుటుంబసభ్యులందరూ కూర్చొని రమేష్ వివాహంపై చర్చిస్తున్న సమయంలో చెల్లెలు జ్యోతి(17) ఫోన్లో మాట్లాడుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేని రమేష్ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో ఎందుకు కొట్టావంటూ అన్నదమ్ముల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర అసహనానికి గురైన రమేష్ ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకువచ్చి చెల్లెలిపై చల్లి తగులబెట్టడానికి ప్రయత్నిస్తుండగా కుటుంబసభ్యులు జ్యోతిని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవాలని పంపించారు.
రక్షించేందుకు వెళ్లి..
దీంతో కలత చెందిన జ్యోతి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకింది. దీనిని గమనించిన అన్నదమ్ములు చెల్లిని కాపాడే ప్రయత్నంలో ఇరువురు ఒకరి తర్వాత ఒకరు బావిలో దూకారు. వీరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. వెంటనే తండ్రి రంగన్న సైతం బావిలోకి దూకి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా..ఫలితం దక్కలేదు. ఈత రాక ముగ్గురూ మృతి చెందారు. క్షణికావేశంలో జరిగిన సంఘటన ముగ్గురు జీవితాలను బలితీసుకోవడంతో నందిమల్ల ఎక్స్‌రోడ్డు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలం వద్దకు సీఐ బండారి శంకర్, ఎస్ఐ రామస్వామి, వీఆర్ఓలు పాంచజన్య చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాలను ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకర్ తెలిపారు.
అలుముకున్న విషాదం
మండలంలోని నందిమల్ల ఎక్స్‌రోడ్డులో బుధవారం చోటుచేసుకున్న సంఘటనలో ఇద్దరు అన్నలతోపాటు చెల్లి ఆత్మహత్య చేసుకోగా.. గ్రామంలో విషాదం అలుముకుంది. సాయంత్రం ఒక్కసారిగా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారన్న వార్త విని గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికితీసే యత్నంలో ఆ గ్రామ యువకులు సహాయపడ్డారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సంజీవ్ భార్య సుజాత, వారి పిల్లల రోదనలు పలువురిని కలిచివేశాయి. తల్లిదండ్రులు రంగన్న, యాదమ్మను ఓదార్చే ప్రయత్నం చేశారు.