BT college
-
చిరకాల స్వప్నం.. నెరవేరిన క్షణం.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, మదనపల్లె: ఎప్పుడెప్పుడా అని మదనపల్లె పట్టణ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం సాకారమైంది. స్వాతంత్య్రోద్యమంలో కీలకభూమిక పోషించి, పట్టణానికే తలమానికంగా నిలిచిన చరిత్రాత్మక బిసెంట్ థియోసాఫికల్ ఎయిడెడ్ కళాశాల ప్రభుత్వ పరమైంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లుగా మంగళవారం రాత్రి జీఓ విడుదల చేశారు. ఇప్పటివరకు బిసెంట్ సెనెటరీ ట్రస్ట్(బీసీటీ) ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగించిన కళాశాల ఇకపై ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో బిసెంట్ థియోసాఫికల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా సేవలందించనుంది. బుధవారం బీటీ కళాశాల స్పెషల్ ఆఫీసర్‌గా డాక్టర్ నాగలింగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకుని బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి, ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళ్లి కార్యరూపం దాల్చడంలో విశేషంగా కృషిచేసిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్బాషాకు పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రముఖులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ.. ఎమ్మెల్యే చొరవతో.. బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసి విలువైన ఆస్తులను పరిరక్షించాల్సిందిగా 2015లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రముఖులు విన్నవించారు. స్పందించిన మిథున్‌రెడ్డి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణల నేపథ్యంలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం దిశగా జీఓ వెలువరించారు. అయితే బీసీటీ ట్రస్ట్‌సభ్యులు ప్రభుత్వ ప్రతిపాదనలకు విముఖత తెలపడంతో బీటీ కళాశాల విద్యార్థులు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషాను కలిసి ప్రభుత్వ స్వాధీనానికి చొరవచూపాల్సిందిగా కోరారు. ఈ విషయమై ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధ కనబరిచి బిసెంట్ సెనెటరీ ట్రస్ట్ సభ్యులను వ్యక్తిగతంగా కలుసుకుని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఒప్పించారు. అంగీకారపత్రాన్ని తీసుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరం చేయడంలో కీలకభూమిక పోషించారు. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. బీటీ కళాశాల ఘనచరిత్ర బిసెంట్ థియోసాఫికల్ కళాశాల రాయలసీమలో మొట్టమొదటి కళాశాల. 1915 జూలై 19న స్వాతంత్య్రసమరయోధురాలు, హోంరూల్‌లీగ్ ఉద్యమకారిణి డాక్టర్ అనిబిసెంట్ చేతులమీదుగా స్థాపించబడింది. రాయలసీమ విద్యారంగంలో మైలురాయిగా నిలిచిన బీటీ కళాశాల ప్రజాఉద్యమాలకు, స్వాతంత్య్రపోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. మొదట మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బీటీ కళాశాల నడిచింది. అయితే స్వాతంత్రోద్యమంలో బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొనడం, ఉద్యమాలు చేయడంతో బ్రిటీష్ ప్రభుత్వం మద్రాసు విశ్వవిద్యాలయ గుర్తింపును రద్దుచేసింది. తర్వాత 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కళాశాలను సందర్శించారు. జనగణమణ గేయాన్ని బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి ఇక్కడే అనువదించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న నేషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోకి బీటీ కళాశాల మారింది. 1927లో ఆంధ్ర విశ్వవిద్యా లయం ప్రారంభమైన తర్వాత దానికి అనుబంధంగా ఉంటూ వచ్చింది. 1929లో అధికారపరిధి పునర్విభజనతో మళ్లీ మద్రాసు విశ్వవిద్యాలయ పరిధిలోకి వచ్చింది. 1956 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి దానికి అనుబంధంగా విద్యా సేవలందిస్తోంది. మహోన్నత వ్యక్తుల ఉన్నత ఆశయాలతో స్థాపించిన 106 సంవత్సరాల చరిత్ర కలిగిన బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాల ఎందరో భావిభారత పౌరులను తీర్చిదిద్ది, ఉన్నతమైన వ్యక్తులుగా సమాజానికి అందించింది. రాష్ట్రగీతమైన మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, కర్నాటక మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, సీపీఐ జాతీయనాయకుడు నారాయణ బీటీ కళాశాల పూర్వవిద్యార్థులు. బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటిస్తున్న స్పెషల్ ఆఫీసర్ డాక్టర్.రామలింగారెడ్డి అనిబిసెంట్ ఆశయ సాధనకు కృషి... బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ నాగలింగారెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా బుధవారం కళాశాల ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ మహోన్నత ఆశయంతో బీటీ కళాశాలను స్థాపించిన డాక్టర్ అనిబిసెంట్ ఆశయ సాధనకు కృషిచేస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. చరిత్రాత్మక నేపథ్యం కలిగి, విలువైన కోట్లరూపాయల భవనాలను, స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి సహృదయతను చాటుకున్న బిసెంట్ సెనెటరీ ట్రస్ట్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల స్వాధీనం తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో సిబ్బంది, నిర్వహణకు సంబంధించి విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు తమవంతు సహకారం అందించి తోడ్పాటునందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిత్తూరు ఐడీ కాలేజి ప్రిన్సిపాల్ ఆనందరెడ్డి, కరస్పాండెంట్ వైఎస్.మునిరత్నం, ప్రిన్సిపాల్ వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జన్మభూమికి వెళ్లకపోతే విద్యార్థులకు టీసీలే
చిత్తూరు జిల్లా: మంత్రి పాల్లొనే జన్మభూమి కార్యక్రమానికి వెళ్లకపోతే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తామని బీటీ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హుకుం జారీ చేసింది. యాజమాన్య తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉన్న అందరికీ టీసీలు ఇచ్చేయండి అంటూ గేట్లకు తాళం వేసి యాజమాన్య పద్దతులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో చారిత్రక నేపధ్యం కల బీటీ కాలేజీని నాశనం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు చూస్తున్నారని, కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే పనులు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. బలవంతంగా రాజకీయపార్టీల కార్యకలాపాలకు విద్యార్థులను వినియోగించుకోవడం దారుణం అని వాపోయారు. ఇప్పటికైనా ప్రైవేట్ వ్యక్తులను కాలేజీకి దూరంగా పెట్టి తమ కళాశాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
అనిబిసెంట్ ఆశయ సాధనకు కృషి
– ఘనంగా అనిబిసెంట్ జయంతి మదనపల్లె అర్బన్: బిటి కళాశాల వ్యవస్థాపకులు, విద్యాప్రదాత అనిబిసెంట్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. బిటి కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణరాణి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కళాశాల నుంచి బెంగుళూరు రోడ్డులోని అనిబిసెంట్ సర్కిల్‌కు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ అనిబిసెంట్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బిసెంట్హాల్లో కరస్పాండెంట్ ఎస్కె.వివేకానంద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పాశ్చాత్యదేశంలో జన్మించిన అనిబిసెంట్ మదనపల్లె వాతావరణానికి ముగ్దులయ్యారని తెలిపారు. ఇక్కడి ప్రజల వెనుకబాటుతనాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో రాయలసీమలోనే తొలిసారిగా బిటికళాశాలను స్థాపించారని పేర్కొన్నారు. వందేళ్ల క్రితం నిర్మించిన కళాశాలలో చదివిన వారు అనేక మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని వివరించారు. కార్యక్రమంలో లైజనింగ్ ఆఫీసర్ కామకోటి ప్రసాదరావు, రేస్ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ రంగాచార్యులు, పూర్వ విద్యార్థి మార్పూరి నాగార్జునబాబు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న అనిబిసెంట్ చిత్రం బిటి కళాశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ అనిబిసెంట్ చిత్రాన్ని పూర్వ విద్యార్థులు, బిసెంట్ కల్చరల్ టీం కలిసి అనిబిసెంట్ చిత్రాన్ని పూలు, ఉప్పుతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో వెల్‌విషర్స్ సంస్థ వ్యవస్థాపకులు గిరీష్, వెంకటేష్, నాగరాజు,దిలీప్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తాం
- శతవార్షికోత్సవంలో ఎమ్మెల్యేలు తిప్పారెడ్డి, చింతల, శంకర్ - యూనివర్సిటీ చేయడానికి కృషిచేస్తామని హామీ మదనపల్లె సిటీ : బీటీ కళాశాలకు పూర్వవైభవం తెస్తామని ముగ్గురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. మదనపల్లె పట్టణంలో ఆదివారం సాయంత్రం బీటీ కళాశాల శత వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శంకర్‌యాదవ్ పాల్గొన్నారు. మొదట వారు జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సభలో మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ బీటీ కళాశాలకు ఎంతో చరిత్ర ఉందని, ఇలాంటి కళాశాల నేడు దీనస్థితికి చేరుకోవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు పూర్వవైభవం వచ్చేందుకు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శాసనసభ సమావేశాల్లో కళాశాలను యూనివర్సిటీగా చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. పీలేరు ఎమ్మెల్యే, కాలేజీ పూర్వ విద్యార్థి చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను కాలేజీలో 1981-84లో డిగ్రీ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఇంతటి స్థాయిలో ఉన్నానంటే కాలేజీనే కారణమని స్పష్టం చేశారు. గతంలో ఉన్న కాలేజీ ప్రస్తుతం దాని ప్రభావం మసకబారడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. కాలేజీ పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత తనపై కూడా ఉందన్నారు. ఈ కళాశాలలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డితో పాటు పలువురు చదివిన విషయాన్ని గుర్తు చేశారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ మాట్లాడుతూ కళాశాలను యూనివర్శిటీ స్థాయికి తెచ్చేలా శాసనసభలో తన వాణిని వినిపిస్తామని తెలిపారు. పడమటి మండలాలకు కళాశాలను యూనివర్సిటీ చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట కలిగిన బీటీ కళాశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ పద్మావతి, జోళెంపాళెం మంగమ్మ, కాలేజీ కరస్పాండెంట్ వివేకానంద, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణరాణి, బీసెంట్ ట్రస్టు కార్యదర్శి సుధాకర్, లైజన్ ఆఫీసర్ ప్రసాదరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు రాజన్, బగ్గిడి గోపాల్, కాలేజీ మాజీ చైర్మన్లు రాందాస్‌చౌదరి, కంభం నాగభూషణరెడ్డి, కళాధర్, సుధాకర్, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్‌బాలాజీ, మాజీ ఎంపీపీ వల్లిగట్ల వెంకటరమణ, కాలేజీ అధ్యాపకులు, పూర్వపు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
బీటీ కాలేజ్ ట్రస్టు సభ్యుల సమావేశానికి బ్రేక్
మదనపల్లెక్రైం: బీటీ కాలేజ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ట్రస్టు సభ్యుల సమావేశాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అధ్యాపకుల బోధనా విధానాన్ని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభ్యులు సుధాకర్, జగన్నాథరావు, హరివెంకట్రమణ, సత్యనారాయణ, వైద్యనాథన్‌కు వివరిస్తుండగా విద్యార్థుల సమస్యలు చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. సభ్యులు పట్టించుకోకపోవడంతో ఆర్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహించారు. విద్యార్థుల సమక్షంలో జరగాల్సిన సమావేశాన్ని సీక్రెట్‌గా నిర్వహిస్తారా అంటూ నిరసన నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలు విన్న తర్వాతే సమావేశం నిర్వహించాలంటూ సభ్యులను ఘెరావ్ చేశారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్ కిజర్‌మహ్మద్, అధ్యాపకులు, విద్యార్థులకు మద్య వాగ్వాదం నెలకొంది. ఆర్ఎస్ఎఫ్ నాయకుడు ఉత్తన్న మాట్లాడుతూ 2000వ సంవత్సరం నుంచి యూజీసీ నిధుల వినియోగంపై బహిరంగ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు రెడ్డిశేఖర్ మాట్లాడుతూ బీటీ కళాశాలలో నిర్వహణా లోపాలు పోవాలంటే ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. కళాశాల ఆస్తులను అమ్మగా వచ్చిన నిధులు దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలని కోరారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపి సమావేశం నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టడంతో అర్ధాంతరంగా ఆపేశారు. -
అట్టహాసంగా ప్రారంభమైన స్వాతంత్య్ర వేడుకలు
మదనపల్లెక్రైం: మదనపల్లె బీటీ కళాశాల ఆవరణలో 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభించారు. విజయభారతి పాఠశాల ప్రిన్సిపాల్ సేతు అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథులుగా సబ్‌కలెక్టర్ నారాయణ్భరత్గుప్త, ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు చిన్నావాసు దేవరెడ్డి, అధికారులను వేదికపైకి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ఆరంభమయ్యాయి. ముందుగా విజయభారతి పాఠశాల విద్యార్థులతో భరత మాత నృత్యగీతాన్ని ప్రదర్శిం చారు. అనంతరం వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు. ఈ వేడుకలకు 5వేల మందికిపైగా ప్రజలు హాజరయ్యూరు. రాత్రి 12గంటలకు వేడుకలు ముగిశాయి. మదనపల్లె డీవైఈవో శామ్యూ ల్, వన్‌టౌన్ సీఐ శివన్న, ఎంవీఐ కరుణసాగర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్‌చినబాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, ఫైన్ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ జర్మన్‌రాజు, ఆర్ఎస్ఎస్ ఆనంద్, కుమార్, శంకర, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు వీరజవాన్ భానుప్రకాష్‌కు నివాళులు అర్పించారు. ఆయన తల్లిని, సతీమణిని శాలువతో సత్కరించారు. -
బీటీ కళాశాల ఆస్తులను కాపాడుకుంటాం
అక్రమంగా కట్టిన ప్రహరీని పడ గొట్టిన విద్యార్థులు పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన గొడవ మదనపల్లె అర్బన్: బీటీ కళాశాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశా రు. స్థానిక ఇండియన్ యూనియన్ క్లబ్ సభ్యులు అక్రమంగా కట్టిన ప్రహరీని సోమవారం విద్యార్థులు పడగొట్టారు. బీటీ కళాశాలకు చెందిన స్థలంలో ఎస్బీఐ భవన నిర్మాణానికి అగ్రిమెంటు పద్ధతిలో స్థలం కేటాయించడానికి కళాశాల నిర్ణయం తీసుకుంది. అయితే కళాశాలకు చెందిన స్థలంలో రాత్రి సమయంలో ఇండియన్ యూనియన్ క్లబ్ వారు అక్రమంగాప్రహరీ నిర్మించడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది గోడ విషయమై అడగడానికి వెళ్లారు. అయితే ప్రహరీని పడగొడతారేమోనన్న భయం తో క్లబ్ సభ్యులు కొంతమంది విద్యార్థులపై రాళ్లు వేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రహరీని కూల్చి వేశారు. ఇండియన్ యూనియన్ క్లబ్ సభ్యులు, విద్యార్థుల మధ్య గొడవ పెద్దది కావడంతో వన్‌టౌన్ ఎస్ఐలు మల్లికార్జున, దస్తగిరి తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కిజర్‌మహ్మద్ మాట్లాడుతూ బీటీ కళాశాలకు డాక్టర్ అనిబిసెంటు 11 ఎకరాల స్థలాన్ని ఇచ్చారన్నారు. కళాశాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకునేందుకు ప్రహరీ నిర్మిస్తున్నట్టు తెలి పారు. అయితే బీటీ కళాశాల ఆస్తిలో భాగమైన స్థలాన్ని ఇండియన్ యూని యన్ క్లబ్‌వారు ఆక్రమించుకొని దౌర్జన్యంగా ప్రహరీ నిర్మిస్తుండగా ఆది వారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినప్పటికీ రాత్రి సమాయాల్లో గోడను నిర్మించినట్టు తెలిపారు. కళాశాల ఆస్తులు కాపాడుకోవడం తమతో పాటు అందరి బాధ్యత అన్నారు. అందులో భాగంగానే విద్యార్థులు గోడ విషయం అడిగేందుకు వెళ్లగా క్లబ్ సభ్యులు దౌర్జన్యానికి దిగారని ఆయన పేర్కొన్నారు. బీటీ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, పూర్వ విద్యార్థులను, క్లబ్ సభ్యులను వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో సమావేశ పరిచి స్థలం వివాదం ముగి సేంతవరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని పోలీసులు చెప్పారు. భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్, ఎమ్మార్పీ జిల్లా అధ్యక్షలు నరేంద్రమాదిగ, బీఎస్పీ నా యకులు కంగేరి నందతో పాటు నాయకులు కలగచేసుకొని కళాశాల ఆస్తులను కాపాడానికి కళాశాల యజమాన్యానికి, విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు.