Bucharest
-
International Chess Tourney: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: బుకారెస్ట్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ కాంస్య పతకం సాధించాడు. రొమేనియాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత మాక్సిమ్ చిగయెవ్ (రష్యా), డేనియల్ బొగ్డాన్ (రొమేనియా), హరికృష్ణ 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. చిగయెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... బొగ్డాన్కు రెండో ర్యాంక్, హరికృష్ణకు మూడో ర్యాంక్ లభించాయి. హరికృష్ణ మొత్తం ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ రౌనక్‌తో జరిగిన గేమ్‌లో ఓడిపోయాడు. -
బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
సాక్షి, న్యూఢిల్లీ: బుకారెస్ట్ నుంచి 250 మంది భారతీయ విద్యార్థులతో రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. విద్యార్థులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. విమానంలో 17 మంది తెలంగాణ, 11 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ, తెలంగాణ భవన్‌కు అధికారులు తరలించారు. వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ భవన్లో వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు. సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే 219 ముందితో తొలి విమానం ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్‌లో ఇంటికో బంకర్.. సైరన్ మోగితే చాలు.. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు: విద్యార్థులు ‘‘పశ్చిమ ప్రాంతంలోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్నాం. రొమేనియా సరిహద్దు దాటి, బస్సులో బుకారెస్ట్ విమానాశ్రయం చేరుకున్నాం. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు. మా యూనివర్సిటీ అధికారులు ఆందోళన వద్దని, పరీక్షలు రాసిన తర్వాత వెళ్లొచ్చని చెప్పారు. కానీ ఒక్కసారిగా యుద్ధం మొదలైంది. మేము టికెట్లు బుక్ చేసుకుని కూడా ఉపయోగం లేకపోయింది. అక్కడి వాతావరణం బావుంటుంది. ప్రజలు బావుంటారు. అలాంటి దేశంలో ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉంది. యుద్ధం మొదలైందన్న వార్తలు చూసి మా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు భారత్‌పై కాలుమోపడం ఆనందంగా ఉంది. ఢిల్లీ నుంచి మా ఇంటికి చేరుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారని’’ విద్యార్థులు అన్నారు. -
భారతీయ విద్యార్థులూ.. భయం వద్దు
కీవ్: రెండు రోజులైంది. తినడానికి తిండి లేదు, నిద్ర లేదు. తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. ప్రాణభయంతో బేస్మెంట్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. బాంబులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రష్యా సేనలు పౌర నివాస ప్రాంతాలపైన కూడా బాంబుల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలర చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. దేశం కాని దేశంలో యుద్ధ భయంతో భీతిల్లుతున్న తమ కన్న బిడ్డలకి ఎలాంటి ముప్పు వస్తుందో తెలీక భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. రెండు రోజులుగా తిండి, నిద్ర లేకుండా గడుపుతున్న విద్యార్థుల్ని క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు ప్రత్యేక విమానాల్ని రుమేనియా రాజధాని బుకారెస్ట్‌కు పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బుకారెస్ట్కి చేరుకోగలిగే విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా విదేశాంగ శాఖ అ«ధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికయ్యే ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల్ని బుకారెస్ట్ తీసుకురావడానికి కీవ్‌లో భారత రాయబార కార్యాలయం వారికి సహకారం అందిస్తుంది. రుమేనియా, హంగేరి నుంచి వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రుమేనియా, హంగేరి సరిహద్దు ప్రాంతాలైన చాప్ జహోని, చెర్నివిట్సికి సమీపంలో సిరెత్ సరిహద్దుల్లో నివసించే భారతీయులు ఒక క్రమ పద్ధతిలో చెక్ పాయింట్ల దగ్గరకు చేరుకోవాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారతీయులందరూ ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. పాస్‌పోర్టు, కోవిడ్–19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్తో పాటు అత్యంత అవసరమైన సామాన్లు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు చిక్కుకొని ఉంటే వారిలో అత్యధికులు విద్యార్థులే. 8 కి.మీ. నడుచుకుంటూ 40 మంది భారతీయ వైద్య విద్యార్థులు నడుచుకుంటూ పోలండ్ సరిహద్దులకు చేరుకున్నారు. లివివ్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న వారంతా 8కి.మీ.కు పైగా నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వచ్చారు. ఉక్రెయిన్ ఇరుగు పొరుగు దేశాల నుంచి విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో వీరంతా ప్రాణాలు దక్కించుకోవడానికి నడుచుకుంటూ వచ్చారు. -
కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
బుకారెస్ట్ : కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతి చెందిన ఘటన రొమేనియా దేశంలో చోటు చేసుకుంది. పియాట్రా నీమ్ట్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ వార్డ్‌లో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రోగులలందరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మినహా మరణించిన వారంతా ఆస్పత్రి రోగులేనని అధికారులు స్పష్టం చేశారు. -
ప్రధాని పదవికే ఎసరు..!
బుకారెస్ట్: ఓ అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసన ఆందోళన రొమేనియా దేశ ప్రధాని పదవికి ఎసరుపెట్టింది. రొమేనియాలోని బుకారెస్ట్‌లో గల ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మిన్నంటిని నిరసనలకు ప్రతిఫలంగా ఆదేశ ప్రధాని 'విక్టోర్ పాంటా' రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ డెమొక్రటిక్ నేత లియు డ్రాగ్నియా తెలిపారు. 'నా బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను. నేను రాజీనామా చేస్తున్నాను' అని పాంటా చెప్పినట్లు డ్రాగ్నియా చెప్పారు. బుకారెస్ట్ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి 33 మంది మరణించి, 180 మందికి పైగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు రొమేనియా ప్రభుత్వాధికారులు తెలిపారు. కానీ, క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని, ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని మంగళవారం భారీ ఎత్తున ఆందోళన కారులు బుకారెస్ట్ వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొంత హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఆ ఘటనకు బాధ్యత వహించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ప్రధాని పదవికి పాంటా రాజీనామా చేస్తారని తెలుస్తోంది