వారిలో మార్పుకోసం 'బుద్ధి, శుద్ధి' యాగం
సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న రచయితలు, సాహితీవేత్తలకు బుద్దిని ప్రసాదించాలని కోరుతూ అలీఘడ్లో 'బుద్ధి, శుద్ధి యాగం' నిర్వహించారు. అఖిల భారతీయ హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగం ద్వారా మేధావులైన రచయితలకు బుద్ధి పునర్ప్రాప్తి జరగాలని కోరుకుంటున్నట్లు జాతీయ అధ్యక్షురాలు పూజా శకున్ పాండే తెలిపారు. జాతీయ అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా దేశ ప్రతిష్ఠకు, జాతీయ సమైఖ్యతకు భంగం వాటిల్లే చర్యలకు రచయితలు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రతువు ద్వారా వారిలో మార్పును ఆశిస్తున్నట్లు తెలిపారు.
ప్రముఖ హేతువాద రచయిత నరేద్ర దబోల్కర్, కన్నడ రచయిత కాల్బుర్గీల హత్యల నేపథ్యంలో ఇటీవల రచయితల హత్యల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సుమారు 40 మంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చారు. దేశంలో భావప్రకటన స్వేచ్చకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ.. రచయితలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.