Building construction work
-
లిఫ్టు కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కూలిన ఘటనలో క్షతగాత్రులైన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శుక్రవారం ఉదయం 14వ ఫ్లోర్ నుంచి లిఫ్టు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన అయిదుగురిలో నలుగురు శనివారం చనిపోయారు. మరొకరు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలస కార్మికులు. -
గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం
హైదరాబాద్: భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన రమేశ్‌గుప్త అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లోని జలమండలి నీటి శుద్ధి కేంద్రానికి ఆనుకొని ఉన్న ఆయన పరిశ్రమ స్థలంలో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం లింగన్నపల్లికి చెందిన వెంకటయ్య (40), ఇదే ప్రాంతానికి చెందిన దాసు (19), వరంగల్‌కు చెందిన మోలావత్ చంద్రు (50).. రమేశ్ గుప్త చేస్తున్న నిర్మాణానికి కూలీలుగా వెళ్లారు. వీరంతా భవన నిర్మాణం కోసం గత 10 రోజులుగా జేసీబీతో గుంతలు తవ్వి, పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలానికి ఆనుకొని ఉన్న గోడకు మట్టి పోస్తున్నారు. గోడ పక్కనే భారీ గుంత తవ్వుతుండటంతో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ గోడ ఒక్కసారిగా వీరిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వెంకటయ్య, మోలావత్ చంద్రులు మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. దాసు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి, దాసును చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబాలను ఆదుకుంటాం... సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, డిప్యూ టీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్, కార్పొరేటర్ పులి జగన్ ఘటనా స్థలానికి చేరుకున్నా రు. కార్మిక శాఖ నుంచి ఒక్కొక్కరికి రూ.6.80 లక్ష లు, జీహెచ్ఎంసీ నుంచి రూ.లక్ష నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ యజమాని రమేశ్‌గుప్తాను అదుపులోనికి తీసుకున్నట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ తెలిపారు. చైన్మన్ సస్పెండ్... సుమారు ఐదారు వందల గజాల స్థలంలో భారీ భవన నిర్మాణం జరుగుతుంటే టౌన్ ప్లానింగ్ అధికా రులకు కనీస సమాచారం లేకపోవడం క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యమేనని డిప్యూటీ మేయర్, జోనల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పర్యవేక్షించే చైన్మన్ నాగరాజును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పైస్థాయి సిబ్బంది లోపాలపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కూలిన బతుకులు
గుంటూరులో ఘోరం ► భవన నిర్మాణ పనుల్లో విరిగిపడిన మట్టి పెళ్లలు ► నలుగురి మృతి.. శిథిలాల కింద మరో ముగ్గురు! ► పొక్లెయిన్ సాయంతో మట్టి పెళ్లల తొలగింపు యత్నాలు ► బాధితులంతా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు వాసులు ► రాత్రంతా కొనసాగనున్న సహాయక చర్యలు అరండల్‌పేట (గుంటూరు) : గుంటూరులో భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురు మృత్యు ఒడికి చేరారు. మరో ముగ్గురు మట్టిపెళ్లల కిందే ఉన్నారని భావిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మీపురం ప్రధాన రహదారిలో ఓ భవన నిర్మాణానికి పునాదులు తీసే పనులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి పిల్లర్లకు కాంక్రీటు పనులు జరుగుతుండగా, పైన వేసిన మట్టి పెళ్లలు ఒక్కసారిగా జారిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కార్మికుడిని పక్కకు లాగేందుకు వెళ్లిన కూలీలంతా మట్టి పెళ్ళల కింద చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో శేషు, బుసి సాల్మన్ సహా నలుగురు మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న మరియబాబు అనే వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసి గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. ఇంకా ముగ్గురు కూలీల వరకు మట్టి పెళ్ళల కింద ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. బాధితుల ంతా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. రెండు పొక్లయిన్ సాయంతో మట్టిపెళ్ళలను తొలగిస్తున్నారు. ప్లాన్ పొందింది ఇలా... నగరంలోని లక్ష్మీపురం ప్రధాన రహదారిలో నగరానికి చెందిన డాక్టర్ సుబ్బారావుకు స్థలం ఉంది. దీనిలో వాణిజ్య భవనం నిర్మించేందుకు టీడీపీ నాయకుడు చుక్కపల్లి రమేష్‌కు చెందిన ఫోనిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా చుక్కపల్లి రమేష్ వాణిజ్య భవనం నిర్మించేందుకు నగరపాలక సంస్థకు 191/2014/జి1 దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నగర పాలక సంస్థ 28.10.2015న 2,270 చదరపు గజాల్లో రెండు సెల్లార్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 4 అంతస్తులు నిర్మించు కొనేందుకు అనుమతులు మంజూరు చేసింది. మూడు నెలలుగా పనులు వేగవంతం చేశారు. తొలుత సెల్లార్ల నిర్మాణానికి కార్మికులతో పనులు ప్రారంభించారు. అడుగడుగునా నిబంధనలకు పాతర ... భవన నిర్మాణంలో అడుగడుగునా నిబంధనలకు పాతర వేశారు. సెల్లార్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉన్నా అదనపు వ్యయం అవుతుందన్న కక్కుర్తితో పాటించలేదు. ప్రధానంగా 30 అడుగుల్లోతు సెల్లార్లను తవ్వుతున్నప్పుడు చుట్టుపక్కల పది అడుగుల స్థలాన్ని వదిలి సెల్లార్లను నిర్మించాలి. అదేవిధంగా మట్టిపెళ్ళలు విరిగిపడకుండా చుట్టూ ఇనుప చువ్వలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ కేవలం రెండు అడుగులు మాత్రమే చుట్టుపక్కల వదిలారు. నిర్మాణానికి పక్కనే ఉన్న భవనానికి సంబంధించిన గోడ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో సెల్లార్లలో పిల్లర్లుకు కాంక్రీటు పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మట్లిపెళ్లలు విరిగిపడ్డాయి. దీనికి తోడు పక్కనే ఉన్న గోడ సైతం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరొకరిని శిథిలాల కింద నుంచి బయటకుతీసి ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు మట్టి పెళ్ళల కింద ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అసలు సైట్లో ఉండి పనులను పర్యవేక్షించాల్సిన సైటు ఇంజినీరు హరిబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్మికులు చెబుతున్నారు. కూలీలంతా యువకులే ... మట్టి పెళ్ళల కింద చిక్కుకుపోయిన వారంతా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు యువకులే. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని పనుల్లోకి వస్తున్నారు. గుంటూరుకు చెందిన కాంట్రాక్టరు రాము వీరిని పనుల నిమిత్తం తీసుకువచ్చారని తెలిపారు. పోలీసుల ఓవర్ యాక్షన్ ... బిల్డర్ చుక్కపల్లి రమేష్ అధికారపార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారనే విమర్శలు వెల్తువెత్తాయి. సంఘటన జరిగిన ప్రాంతం వద్దకు మీడియా ప్రతినిధులు, ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లనీయవద్దంటూ పై నుంచి ఆదేశాలంటూ చెప్పి గేట్లకు తాళాలు వేశారు. అక్కడే ఉన్న చుక్కపల్లి అనుచరులు రాయలేని భాషలో అసభ్యపదజాలం ఉపయోగిస్తూ మీడియా వారి పట్ల దురుసుగా వ్యవహరించారు.