Bus and Lorry dash
-
నేనే డ్రైవర్...నేనే కండక్టర్
తాండూరు టౌన్: తప్పతాగిన ఓ వ్యక్తి ప్రయాణికులతో ఉన్న బస్సును తీసుకెళ్లాడు. ‘నేనే డ్రైవర్‌ను.. నేనే కండక్టర్‌ను.. డబ్బులు ఇవ్వండి’ అంటూ ప్రయాణికులకు ఆదేశించాడు. అంతలోనే బస్సు లారీని ఢీకొనడంతో అతను పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 21 జెడ్ 437) ఓగీపూర్‌కు వెళ్లాల్సి ఉంది. డ్రైవర్ ఇలియాస్, కండక్టర్ జగదీశ్ బస్టాండ్‌లో పాయింట్ మీద ఉంచి భోజనం చేసేందుకు వెళ్లారు. ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి బస్సును స్టార్ట్ చేసి ఇందిరాచౌక్ మీదుగా మల్లప్పమడిగ వైపు తీసుకెళ్లాడు. ‘నేనే కండక్టర్‌ను.. నేనే డ్రైవర్‌ను.. అందరూ డబ్బులు ఇవ్వాలి’అని అన్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న ఓ లారీని ఢీకొట్టడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన ప్రయాణికులు సదరు వ్యక్తిని నిలదీయడంతో బస్సును నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తాండూరు డీఎం రాజశేఖర్ అక్కడికి చేరుకొని బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు. ఘటనపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు
గుంటూరు, పిడుగురాళ్లటౌన్: అతి వేగంగా వస్తున్న బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో లారీ క్లీనర్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని సూర్యాసెమ్ సమీపంలో శనివారం తెల్లవారు జామున 3 గంటలకు జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. మాచర్ల–రేపల్లె నాపరాయి లోడుకు క్లీనర్‌గా పనిచేస్తున్న గడగోడు అమరలింగాచారి(23) టైరుకు పంచర్ కావడంతో బండిని పక్కన నిలిపి పంచర్ వేస్తున్నాడు. ఇదే క్రమంలో కందుకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో అమరలింగాచారి కాళ్ల మీదుగా లారీ వెళ్లడంతో తీవ్ర గాయలయ్యాయి. బస్సు, లారీని ఢీకొనగా వెనుకగా వస్తున్న కోళ్ల లారీ బస్సును ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందిలో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన తెలుసుకున్న 108 వాహనం వచ్చి క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అమరలింగాచారి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని గుంటూరుకు తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతున్న అమరలింగాచారి మృతి చెందాడు. క్షతగాత్రులు ప్రథమ చికిత్స అనంతరం వారి స్వగ్రామాలకు వెళ్లారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాహాకారాలు.. పరుగులు
లారీని ఢీకొన్న ఆర్టీసీ పుష్కర బస్సు బెంబేలెత్తిన ప్రయాణికులు కత్తిపూడి (శంఖవరం) : ప్రయాణ బడలికతో గాఢనిద్రలో ఉన్నారు కొందరు. మరికొందరు కునికిపాట్లు పడుతున్నారు. హైవేపై వేగంగా దూసుకుపోతోంది ఆర్టీసీ బస్సు. ఉన్నట్టుండి భారీ శబ్దం. ఏమైందో.. ఏమిటో ప్రయాణికులకు అంతుపట్టలేదు. బస్సులో ఉన్నవారంతా ముందుకు తూలిపడ్డారు. రక్తమోడుతున్న గాయాలతో.. హాహాకారాలు చేస్తూ.. ఎటు పరుగెత్తారో వారికే తెలియదు. ఒకరిపై మరొకరు పడుతూ, లేస్తూ.. బస్సు నుంచి బయటపడ్డారు. ఇదీ జాతీయ రహదారిపై కత్తిపూడి బ్రిడ్జి వద్ద ఆదివారం అర్ధరాత్రి లోడు లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో చోటుచేసుకున్న పరిణామాలు. ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, పది మంది స్వల్పంగా గాయపడ్డారు. టెక్కలి డిపోకు చెందిన ఈ ఆర్టీసీ బస్సు కృష్ణా పుష్కరాల కోసం ప్రత్యేక సర్వీసుగా నిర్వహిస్తున్నారు. సంఘటన అనంతరం స్థానిక వ్యాపారులు బస్సు వద్దకు చేరుకుని ప్రయాణికులకు సహకరించారు. హైవే, అన్నవరం పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, 108లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ జంక్షన్ లో అస్తవ్యస్థ ట్రాఫిక్, ఆక్రమణలు, వాహనాల పార్కింగ్ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.