Business Companies
-
ఈ కంపెనీలు బంగారం!
మనం తరచూ ప్రపంచంలో అత్యంత ధనికులు అంటూ కొందరి పేర్లను వార్తల్లో వింటూ ఉంటాం. ఒకప్పుడు బిల్‌గేట్స్ నుంచి ఇప్పుడు ఎలన్ మస్క్ దాకా చాలా మంది గురించి తెలుసు. ఇటీవల మన దేశానికి చెందిన గౌతమ్ ఆదానీ ఏకంగా ప్రపంచంలో టాప్–2 ధనవంతుడి స్థాయికి కూడా వెళ్లారు. వీరందరి ఆస్తి కూడా వారికి వివిధ కంపెనీల్లో ఉన్న షేర్ల (వాటాల) విలువ ఆధారంగా లెక్కిస్తారు. ఆ కంపెనీల్లో ఎంతో మందికి షేర్లు ఉంటుంటాయి కాబట్టి.. కంపెనీల విలువలు కూడా చాలా భారీగా ఉంటాయి. మరి ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల విలువలు చూద్దామా.. - ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ యాపిల్. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 2.324 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారు రూ. 1,92,53,654 కోట్లు (కోటీ 92 లక్షల కోట్లు). - ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 210 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.17,39,788 కోట్లు (దాదాపు 17 లక్షల 39 వేల కోట్లు) - మన దేశానికి చెందిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆస్తులు 129.5 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే.. రూ.10,72,869 కోట్లు (దాదాపు 10లక్షల 72 వేల కోట్లు). ప్రపంచ ధనవంతుల్లో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. - రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ 87 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ.7,20,769 కోట్లు (దాదాపు 7లక్షల 20వేల కోట్లు). ప్రపంచ ధనవంతుల్లో ఆయన ఎనిమిదో స్థానంలో ఉన్నారు. - అయితే అత్యంత ఎక్కువ విలువైన కంపెనీల అధిపతులు అయినా.. వారి ఆస్తులు తక్కువగా ఉండవచ్చు. ఆయా కంపెనీల్లో వారి వాటా తక్కువగా ఉండటమే కారణం. కొందరు ధనవంతులకు వేర్వేరు కంపెనీల్లో వాటాలు ఉంటాయి. ఆ కంపెనీలు అత్యంత విలువైన జాబితాలో లేకున్నా.. వాటన్నింటిలోని వాటాలు కలిసి కొందరు అత్యంత ధనవంతుల జాబితాలో ఉంటుంటారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్. -
కుటుంబ వ్యాపారాల్లో భారత్ మేటి
న్యూఢిల్లీ: కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థలు ఆయా రంగాల్లోని ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే పనితీరులో మెరుగ్గా ఉండడంతోపాటు, వాటాదారులకు అధిక రాబడులు పంచిపెడుతున్నాయి. కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలు సంఖ్యా పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ వివరాలను ‘క్రెడిట్ సూసీ ఫ్యామిలీ 1000, 2018’ నివేదిక పేరుతో క్రెడిట్ సూసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసింది. భారత్‌లో 111 వ్యాపార సంస్థలు కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) 839 బిలియన్ డాలర్లు. చైనాలో 159 సంస్థలు, అమెరికాలో 121 సంస్థలు ఇలా కుటుంబ వ్యాపారాలుగా కొనసాగుతున్నాయి. ఇవి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జపాన్ మినహా ఆసియా ప్రాంతంలో చైనా, భారత్, హాంగ్‌కాంగ్ కుటుంబ వ్యాపారాల విషయంలో ముందున్నాయి. ఈ మూడు దేశాలే 65 శాతం వాటా ఆక్రమించాయి. ఈ మూడు దేశాల్లోని కుటుంబ వ్యాపారాల మార్కెట్ విలువ రూ.2.85 లక్షల కోట్ల డాలర్లు. 43 కంపెనీలతో (మార్కెట్ క్యాప్ 434 బిలియన్ డాలర్లు) దక్షిణ కొరియా నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్సీన్స్, థాయిలాండ్ 26 కంపెనీల చొప్పున కలిగి ఉన్నాయి. జపాన్ మినహా ఆసియా ప్రాంతంలో 11 దేశాలను ఈ నివేదిక కవర్ చేసింది. ఈ 11 దేశాలు మొత్తం విశ్వంలోని కుటుంబ వ్యాపారాల్లో 53 శాతం వాటాను ఆక్రమించాయి. మొత్తం మార్కెట్ క్యాప్ 4 లక్షల కోట్ల డాలర్లు. పోటీ సంస్థల కంటే అధిక రాబడులు... ‘‘ఈ ఏడాది ప్రతీ ప్రాంతంలోనూ, ప్రతీ రంగంలోనూ కుటుంబాల నిర్వహణలోని వ్యాపారాలు చక్కని పనితీరుతో పోటీ సంస్థల కంటే ముందున్నట్టు గుర్తించాం. కుటుంబ వ్యాపారాలు బయటి నిధులపై తక్కువ ఆధారపడతాయని, పరిశోధన, అభివృద్ధిపై మరిన్ని నిధులు వెచ్చిస్తాయన్న దీర్ఘకాలిక దృక్పథాన్ని ఇది తగ్గిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడిట్ సూసీ నివేదిక ప్రధాన రూపకర్త యూజీన్ క్లెర్క్ పేర్కొన్నారు. మన దేశంలోని కుటుంబ వ్యాపార కంపెనీల షేర్ల రాబడి 2006 నుంచి ఏటా సగటున 13.9 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో వీటికి పోటీనిచ్చే స్థానంలో ఉన్న కుటుంబేతర వ్యాపార కంపెనీల షేర్లపై రాబడులు వార్షికంగా 6 శాతం వరకే ఉండడం గమనార్హం. -
ఫేస్బుక్లో 15 లక్షల ఎస్ఎంబీలు
న్యూఢిల్లీ : భారత్‌లో సుమారు 15 లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు వినియోగదారులతో అనుసంధానం కావడానికి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు వంద కోట్ల మంది యూజర్లున్నారని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఫేస్బుక్ ప్లాట్‌ఫారమ్‌పై 4 కోట్ల యాక్టివ్ చిన్న వ్యాపార సంస్థల పేజీలున్నాయి. వీటిల్లో భారత వాటా 15 లక్షలని, ఈ సంఖ్య ప్రతీ ఏడాది 70 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. యువజనుల్లో ఎక్కువమంది, వినియోగదారుల్లో కొంతమంది తాము కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సైట్ల ద్వారా సేకరిస్తున్నారని వివరించారు. దీంతో పలు కంపెనీలు ఈ డిజిటల్ మాధ్యమానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ఫేస్‌బుక్‌కు అమెరికా తర్వాత ఇండియానే అతి పెద్ద మార్కెట్. చిన్న, మథ్య తరగతి వ్యాపార సంస్థల కోసం ఫేస్బుక్ ఈ ఏడాది యాడ్స్ మేనేజర్ యాప్‌ను, బిల్టి క్రియేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఫర్ స్మాల్ బిజినెస్ మార్కెటీర్స్ ను ప్రారంభించామని తెలిపారు. -
వృద్ధికి ఫేస్బుక్ తోడ్పాటు
న్యూయార్క్: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ అంతర్జాతీయంగా గతేడాది ఆర్థిక వృద్ధి పరంగా 227 బిలియన్ డాలర్ల మేర, ఉపాధిపరంగా 45 లక్షల ఉద్యోగాల మేర సానుకూల ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఫేస్బుక్ మార్కెటింగ్, ప్లాట్‌ఫాం ఏ మేరకు తోడ్పడ్డాయన్న అంశంపై కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ చేసిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వ్యాపార సంస్థలు పెద్దవైనా, చిన్నవైనా తమ వ్యాపారాల విస్తరణకు నిత్యం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నాయని ఫేస్బుక్ పేర్కొంది. మార్కెటింగ్‌పరంగా అడ్డంకులను కూడా తగ్గించేలా వివిధ వ్యక్తులు, వ్యాపార సంస్థలను అనుసంధానం చేస్తూ కొంగొత్త వ్యాపార అవకాశాలను ఫేస్బుక్ అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ తెలిపారు. తద్వారా ప్రపంచ ఆర్థిక వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నామని ఆమె వివరించారు.