దామోదరను దెబ్బతీసిన అందోల్, పుల్కల్
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహపై టీఆర్ఎస్ అభ్యర్థి బాబూమోహన్ గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ ఓటమిని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్ మండలాలే దోహదపడ్డాయి. 12వ రౌండ్ వరకు రేగోడ్, అల్లాదుర్గం, రాయికోడ్ మండలాల ఓట్లతో లీడ్ల్ ఉన్న రాజనర్సింహకు 13వ రౌండ్ నుంచి మెజార్టీ తగ్గుతూ వచ్చింది. ఈ రౌండ్ నుంచి అందోల్, పుల్కల్, టేక్మాల్, మునిపల్లి మండల ఓట్లు వచ్చాయి.
అందోల్‌లో 3747 ఓట్లు, పుల్కల్ మండలంలో 2750 ఓట్లు మొత్తం 6497 ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్కు లభించింది. మునిపల్లి, టేక్మాల్ మండలాల్లో కాంగ్రెస్‌కు స్పల్ప మెజార్టీ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉండడంతో చివరి రౌండ్లో 3208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జోగిపేట నగర పంచాయతీలోనే టీఆర్ఎస్కు 2410 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఓట్లే రాజనర్సింహ విజయాన్ని దెబ్బతీశాయని చెప్పవచ్చు. అల్లాదుర్గం, రాయికోడ్, రేగోడ్, మునిపల్లి మండలాల్లో కనీసం 20వ వేల ఓట్ల మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ భావించింది.
అనుకున్నంత మెజార్టీ రాకపోవడంతో ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. గత ఎన్నికల్లో అందోల్, పుల్కల్ మండలాల్లో బాబూమోహన్‌కు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. ఈ రెండు మండలాల్లోనే కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగా రావడంపై దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మునిపల్లి, టేక్మాల్, పుల్కల్, రాయికోడ్ మండలాల్లో స్థానిక సంస్థల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్కు కూడా అల్లాదుర్గంలో జెడ్పీటీసీ సభ్యుడికి వచ్చిన మెజార్టీ రాలేదని సమాచారం. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వగ్రామాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థికి తక్కువగా ఓట్లు వచ్చాయి.