Cabinet Secretary
-
కేంద్ర కేబినెట్ కొత్త కార్యదర్శిగా టీవీ సోమనాథన్
కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్‌ను కేబినెట్ కొత్త సెక్రటరీగా శనివారం నియమించింది. ఆగష్టు 30 నుంచి రెండేళ్లపాటు కేబినెట్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.కాగా సోమనాథన్ 1987 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సోమనాథన్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతక ముందు ప్రధాన మంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. అంతేగాక వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ గ్రూపులో డైరెక్టర్‌గా పనిచేశాడు. కాగా ప్రస్తుతం జార్ఖండ్ కేడర్‌కు చెందిన 198 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబా 2019 నుంచి భారత కేబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అతని పదవీకాలాన్ని సంవత్సర కాలం వ్యవధితో ఇప్పటి వరకు 4 సార్లు పొడిగించారు.కేబినెట్ సెక్రటరీ.. అనేది అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక అధికారి. సివిల్ సర్వీసెస్‌లో సీనియర్ మోస్ట్ పదవి. వీరు నేరుగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తారు. వివిధ మంత్రిత్వ శాఖలలో వ్యాపార లావాదేవీలను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు బాధ్యత వహిస్తారు. -
Centre to Supreme Court: స్వలింగ సమస్యలపై కమిటీ
న్యూఢిల్లీ: స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సెక్రెటరీ సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. స్వలింగ జంటలకు జాయింట్ బ్యాంకు ఖాతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ పథకాల్లో స్వలింగ భాగస్వామిని నామినీగా చేర్చడం వంటివాటిపై నెలకొన్న సమస్యలను ఏప్రిల్ 27 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం లేవనెత్తింది. వీటి పరిష్కారానికి ఏం చేయొచ్చో ఆలోచించాలని సూచించింది. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కోర్టు అంగీకరిస్తే కమిటీ వేసి అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలిస్తామని వివరించారు. పిటిషనర్ల సలహాలు, సూచనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. అందుకు తమకభ్యంతరం లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ ఎ.ఎం.సింఘ్వి అన్నారు. అయితే దీనివల్ల పరిష్కారం లభించదన్నారు. ధర్మాసనమే దీనిపై సమగ్రమైన తీర్పు వెలువరించాలని కోరారు. కేంద్రం సూచనను ఓ చక్కని ముందడుగుగా న్యాయమూర్తి జస్టిస్ భట్ అభివర్ణించారు. స్వలింగ జంటలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు కమిటీతో పరిష్కారం లభించగలదని అభిప్రాయపడ్డారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తీర్పు వెలువరిస్తామని సీజేఐ పేర్కొన్నారు. సహజీవనం చేస్తున్న స్వలింగ జంటల్లో 99 శాతం మంది పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటున్నట్టు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సౌరభ్ కృపాల్, మేనకా గురుస్వామి తదితరులు చెప్పగా సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అవతలి వర్గం కూడా తమ వాదనకు మద్దతుగా బోలెడన్ని గణాంకాలు చూపిస్తారు. అందుకే మేం ఇలాంటి మెజారిటీ నైతికతనో మరోదాన్నో ప్రాతిపదికగా తీసుకుని విచారణ జరపలేం. రాజ్యాంగ నియమ నిబంధనలను బట్టే ముందుకెళ్తాం’’ అని స్పష్టం చేశారు. తదుపరి వాదనలు మే 9న కొనసాగనున్నాయి. ఈడీ డైరెక్టర్‌గా ఇంకెవరూ పనికిరారా? ఈడీ డైరెక్టర్‌గా వరుసగా మూడోసారి సంజయ్ కుమార్ మిశ్రాకు పదవీ కాలం పెంచడంపై సుప్రీం కోర్టు మండిపడింది. డెరైక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ పదవిని చేపట్టడానికి మిశ్రా తప్ప సంస్థలో మరెవరూ లేరా అని ప్రశ్నించింది. మూడోసారి కూడా ఆయనకే పదవీ కాలం పొడిగించాల్సిన ఆవశ్యకత ఏముందని ప్రశ్నించింది. మిశ్రా పదవీకాలాన్ని పొడిగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారికి పదవీకాలం ఎక్కువగా పొడగించకూడదని సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది. ‘‘ఈడీ డైరెక్టర్‌గా మిశ్రాకు మించిన వారు మరెవరూ లేరని మీరు భావిస్తున్నట్టున్నారు. ఆయన రిటైరయ్యాక ఎవరిని నియమిస్తారు?’’ అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ల బెంచ్ నిలదీసింది. కీలక కేసుల్ని విచారిస్తున్నప్పుడు ఒకరి ఆధ్వర్యంలో అయితే విచారణ సరిగా సాగుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. -
గౌబా పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. రాజీవ్ గౌబా పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న గౌబా 2019లో కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం గత ఏడాది ఆగస్టులో ముగియగా, ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. తాజాగా మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గౌబా జార్ఖండ్ కేడర్ అధికారి. -
పటిష్టంగా కరోనా నియంత్రణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు. కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లోని తాజా పరిస్థితిపై ఆయన శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ–కశ్మీర్ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య నిపుణులు, హోం శాఖ అధికారులతో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధించడం, నిఘా, నియంత్రణను పటిష్టం చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచండి కోవిడ్ వ్యాప్తి నివారణకు గాను నిరంతరం కఠినమైన పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పేర్కొన్నారు. గత ఏడాది సమిష్టి కృషి వల్ల కలిగిన లాభాలను కాపాడాలని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తూ కరోనా బాధితులను వేరుగా ఉంచాలన్నారు. పరీక్షల సంఖ్య తగ్గిన జిల్లాల్లో పరీక్షల సంఖ్య పెంచాలని, అధికంగా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు, జిల్లాల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని ఆదేశించారు. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిఘా, నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. హాట్స్పాట్ల గుర్తింపులో వేగం పెంచాలన్నారు. అధిక మరణాలు చోటు చేసుకుంటున్న జిల్లాల్లో క్లినికల్ మేనేజ్మెంట్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరు రాష్ట్రాల్లో భారీగా కొత్త కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్త కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా రోజువారీ కొత్త కేసులు 8,333 నమోదయ్యాయి. కేరళలో 3,671, పంజాబ్‌లో 622 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఫిబ్రవరి 14న 34,449 కేసులు ఉండగా.. ప్రస్తుతం 68,810కు చేరాయి. -
సీఎస్, పీఎస్‌లతో రాజీవ్ గౌబ మీటింగ్
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లు, పీఎస్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. పలు నగరాల మున్సిపల్ కమీషనర్లు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్’పై గౌబా అధికారులతో చర్చించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు, కరోనా కట్టడి కోసం భవిష్యత్ కార్యచరణపై ఆయన చర్చించారు. కాగా, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ 4.0 మే 31 నాటికి ముగుస్తున్న సంగతి తెలిసిందే. ( నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలి ) లాక్డౌన్ అమలై దాదాపు 60 రోజులు గడుస్తున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ప్రతి రోజూ కొన్ని వేల మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,58,333 కేసులు నమోదవ్వగా 4,531మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24గంటల్లో 6,566 కరోనా కేసులు నమోదు కాగా, 194 మంది మృత్యువాత పడ్డారు. -
కరోనా: రాష్ట్రాల్లో పరిస్థితిపై కేంద్రం ఆరా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరుపుతున్నారు. అన్ని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో భాగమయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఆయన ఆరా తీస్తున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ, కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సహాయంపై వివరణాలను సేకరిస్తున్నారు. కోవిడ్-19 నివారణ చర్యలు, గ్రీన్ జోన్లలో మినహాయింపులు, వలస కూలీల సమస్య, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల అంశాలు సమీక్షలో చర్చకు వచ్చాయి. (భారత్‌లో 775కు చేరిన కరోనా మృతుల సంఖ్య) మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 57మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 775కి చేరింది. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం నాటికి మొత్తం 24,506 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 18,668 యాక్టివ్ కేసులు ఉండగా, 5,063 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. -
కాలుష్యాన్ని పర్యవేక్షించనున్న కేబినెట్ కార్యదర్శి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు ఆదివారం ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి సెక్రటరీ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఇందులో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఢిల్లీ, హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలతో కలిసి రోజువారీ కాలుష్య పరిస్థితులను పర్యవేక్షించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా.. మండిపోతున్న వ్యర్థాలు, నిర్మాణ పనుల కార్యకలాపాలు, పారిశ్రామిక, వాహనాల కాలుష్యంపై సమీక్షించారు. కాగా, కాలుష్యం, పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. ఉదయం 9 నుంచి ఒంటి గంట మధ్యలో 37 విమానాలను జైపూర్, అమృత్సర్, లక్నో, ముంబైలకు మళ్లించారు. -
5 రాష్ట్రాల్లో 5800 టన్నుల పప్పుధాన్యాలు స్వాధీనం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ, వినియోగదారుల శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ధరల నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి సి.విశ్వనాథ్ మీడియాకు వివరించారు. ఇప్పటికే కందిపప్పు ధర డబుల్ సెంచరీకి చేరడంతో దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరమైన విషయం తెలిసిందే. అక్రమంగా నిల్వలు, కృతిమ కొరత సృష్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని... అరెస్టులకు కూడా వెనుకడమని చెప్పారు. గత కొద్ది నెలలగా జరిపిన దాడుల్లో ఐదు రాష్ట్రాల్లో 5800 టన్నుల పప్పుధాన్యాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యాధికంగా 2549 టన్నులు, మధ్యప్రదేశ్ నుంచి 2295 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 600 టన్నులు దీంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భారీగా పప్పు ధాన్యాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా దాడులను కొనసాగిస్తున్నామని... దీనివల్ల ధరలు కొంత వరకు నియంత్రించగలిగామని చెప్పారు. ఎప్పుటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ పంట దిగుబడులు పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. విదేశాల నుంచి పప్పుధాన్యాల దిగుబడి చేసుకుంటున్నామని...త్వరలోనే ధరలను నియంత్రిస్తామని విశ్వనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పీ కే సిన్హా నియామకం
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం పీకే సిన్హా నియామాకాన్ని ఖరారు చేస్తూ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పీకే సిన్హా నియామాకానికి అంగీకారం తెలిపారు. వచ్చే నెల 13 వ తేదీ నుంచి సిన్హా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ అజిత్ సేథ్ పదవీ కాలం ముగియనుండటంతో నూతన కేబినెట్ కార్యదర్శి నియామకం అనివార్యమైంది. -
కేబినెట్ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పదవీకాలాన్ని మోదీ సర్కారు మరో ఆరు నెలలు పొడిగించింది. ఆయనకు ఈ పొడిగింపు లభించడం ఇది మూడోసారి. ఈ నెల 13 నుంచి ఆరు నెలలపాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ పేర్కొంది. -
కేంద్ర కేబినెట్ కార్యదర్శి సేథ్ పదవీకాలం పొడగింపు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పదవీకాలాన్ని పొడగించారు. ఈ నెల 13తో సేథ్ పదవీకాలం ముగియనుండగా, మరో ఆరు నెలల పాటు పొడగించారు. దీంతో సేథ్ వచ్చే ఏడాది జూన్ వరకు కేబినెట్ కార్యదర్శిగా కొనసాగుతారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.