సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు. కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.
గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లోని తాజా పరిస్థితిపై ఆయన శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ–కశ్మీర్ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య నిపుణులు, హోం శాఖ అధికారులతో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధించడం, నిఘా, నియంత్రణను పటిష్టం చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కరోనా టెస్టుల సంఖ్య పెంచండి
కోవిడ్ వ్యాప్తి నివారణకు గాను నిరంతరం కఠినమైన పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పేర్కొన్నారు. గత ఏడాది సమిష్టి కృషి వల్ల కలిగిన లాభాలను కాపాడాలని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తూ కరోనా బాధితులను వేరుగా ఉంచాలన్నారు. పరీక్షల సంఖ్య తగ్గిన జిల్లాల్లో పరీక్షల సంఖ్య పెంచాలని, అధికంగా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు, జిల్లాల్లో ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని ఆదేశించారు. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిఘా, నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. హాట్‌స్పాట్ల గుర్తింపులో వేగం పెంచాలన్నారు. అధిక మరణాలు చోటు చేసుకుంటున్న జిల్లాల్లో క్లినికల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఆరు రాష్ట్రాల్లో భారీగా కొత్త కేసులు
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్త కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా రోజువారీ కొత్త కేసులు 8,333 నమోదయ్యాయి. కేరళలో 3,671, పంజాబ్‌లో 622 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఫిబ్రవరి 14న 34,449 కేసులు ఉండగా.. ప్రస్తుతం 68,810కు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment