బ్రాడ్‌బ్యాండ్‌తో కాల్స్ చేసుకోండిలా..
న్యూఢిల్లీ : సిగ్నల్స్ సరిగ్గా ఉండటం లేదా..? మొబైల్ నెట్వర్క్ పనిచేయడం లేదా..? అయితే ఇక నుంచి మీ ఆఫీసులో లేదా ఇంట్లో ఉన్న వై-ఫై బ్రాడ్‌బ్యాండ్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చట. బ్రాడ్‌బ్యాండ్‌తో మొబైల్ ఫోన్లకు, అదేవిధంగా ల్యాండ్లైన్లకు కాల్స్ చేసుకునేలా ప్రతిపాదనలు రూపొందాయి. దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీకి అనుమతించేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు మంగళవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం టెలిఫోనీ లైసెన్స్‌ను పొందే టెలికాం ఆపరేటర్లు, ఇతర కంపెనీలు సిమ్ అవసరం లేని కొత్త మొబైల్ నెంబర్‌ను ఆఫర్ చేయనున్నాయి. ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అక్టోబర్‌లోనే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ ప్రతిపాదనలను రూపొందించింది.
కాల్ డ్రాప్స్ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుల కోసం ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లను తీసుకొచ్చింది. అంతర్ మంత్రిత్వ టెలికాం కమీషన్ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ఆమోదంతో ఇక రిలయన్స్జియో, బీఎస్ఎన్, ఎయిర్టెల్ లాంటి టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులను ప్రారంభించుకోవచ్చు. ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లతో యూజర్లకు ఎంతో మేలు చేకూరనుందని ట్రాయ్ పేర్కొంది. టెలికాం సిగ్నల్స్ బలహీనంగా ఉన్నప్పటికీ, వై-ఫై అందుబాటు చాలా బలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ సర్వీసుల కోసం యాక్టివేట్ చేసుకునే టెలిఫోనీ ఒక ఆఫరేటర్ది, మొబైల్ నెంబర్ మరో ఆపరేటర్‌ది అయితే, డౌన్లోడ్ చేసుకునే ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్ ఆపరేటర్ నెంబర్‌నే యూజర్లు పొందాల్సి ఉంటుంది. డౌన్లోడ్ యాప్, సర్వీసు ప్రొవైడర్ ఒకే ఆపరేటర్‌ది అయితే నెంబర్ మార్చుకోవాల్సినవసరం లేదని ట్రాయ్ అధికారులు చెప్పారు.