కాల్ డ్రాప్స్ సమస్య తగ్గింది: కేంద్రం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్య గడచిన రెండు నెలలుగా గణనీయంగా తగ్గిందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం పేర్కొన్నారు. అయితే సేవల నాణ్యత మరింత పెరగాలని ఆపరేటర్స్‌కు ఆయన సూచించారు. లేదంటే పోటీపూర్వక మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కష్టమని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. రానున్న స్పెక్ట్రమ్ వేలం ఆపరేటర్స్‌కు మరిన్ని రేడియోవేవ్స్ అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్న మంత్రి, సేవల మెరుగుదల, ఆదాయాల పెం పునకు ఇది మార్గం సుగమం చేస్తుందని వివరించారు.
రానున్న మూడు-నాలుగు నెలల్లో సేవల్లో నాణ్యత మరింత మెరుగుపడుతుం దన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ దిశలో ఫలితాలను సాధించుకోడానికి కంపెనీలు రానున్న స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో కంపెనీలు ఉత్సాహంగా పాల్గొంటాయన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. స్పెక్ట్రమ్‌లో పాల్గొనని కంపెనీలు సేవల మెరుగుదలలో తమ లక్ష్యాలను చేరలేవని కూడా మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెల నుంచీ ప్రారంభం కానున్న స్పెక్ట్రమ్ వేలం ఇప్పటివరకూ జరిగిన వేలంలో అతి భారీదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.