రైతుల ఆశలకు గండి
వనపర్తి: ఆసియాలోనే సైఫన్ సిస్టంతో పనిచేసే రెండో ప్రాజెక్టు సరళాసాగర్‌కు దశాబ్దకాలం తర్వాత పూర్తిస్థాయిలో నీరు చేరిందన్న అన్నదాతల ఆశలకు గండి పడింది. రెండు నెలలుగా భీమా, కేఎల్ఐ ప్రాజెక్టులతో సరళాసాగర్‌కు రెండు వైపుల నుంచి నీరు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వనపర్తి జిల్లాలోని 16 గ్రామాల్లో వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరుగా పేరొందిన సరళాసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం గండిపడటంతో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాజెక్టు చుట్టుపక్కల వ్యవసాయ పొలాలకు రెండుసార్లు పుష్కలంగా సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఖాళీ అవడంతో ప్రస్తుత యాసంగికి నారుమడులు సిద్ధం చేసిన రైతులు నిరాశకు గురయ్యారు.
నిర్దేశిత ఆయకట్టు..
సరళాసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద 4,600 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా నీరు పుష్కలంగా ఉండటంతో నిర్దేశిత ఆయకట్టు కంటే ఎక్కువనే సాగు చేస్తారు. సుమారు 5 వేల ఎకరాల్లో యాసంగి వరి నాటేందుకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రాజెక్టుకు గండిపడటంతో సరళాసాగర్ ప్రాజెక్టు కింది రైతులు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రాజెక్టుకు గండిపడినప్పుడు ఉధృతంగా దిగువకు పారిన నీరు కొద్ది కొద్దిగా గండి వెడల్పును పెంచుతూ వచ్చింది. ఉదయం 9.30 గంటల సమయానికి గండి 30 మీటర్ల వెడల్పునకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న 0.5 టీఎంసీల నీరు పూర్తిగా దిగువకు వెళ్లటంతోపాటు ఇంకా సరళా ప్రాజెక్టులోకి కొమిరెడ్డిపల్లి వాగు నుంచి వస్తున్న కేఎల్ఐ నీరు సైతం గండిపడిన ప్రదేశం నుంచి రామన్‌పాడ్ ప్రాజెక్టుకు వెళ్తోంది.
మంత్రి అప్రమత్తతతో..
విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉదయం 8 గంటలకు సరళాసాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. నీరు ఉధృతంగా దిగువకు వెళ్తుండటంతో రామన్‌పాడ్ జలాశయం అధికారులను అప్రమత్తం చేసి గేట్లను ఎత్తింపజేశారు. అధికారులు పది గేట్ల నుంచి రామన్‌పాడ్ నుంచి నీటిని కృష్ణానదిలోకి ఊకచెట్టువాగు నుంచి వదిలేశారు. దీంతో ముప్పు తప్పింది. లేదంటే భీమా ప్రాజెక్టు లిఫ్టులు, సరళాసాగర్ లిఫ్టు, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరందించే.. ఇంటెక్‌వెల్స్ సైతం మునిగిపోయేవి.
నాలుగు గంటలపాటు దిగువకు..
ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సుమారు నాలుగు గంటలపాటు సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు పారింది. సరళాసాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు 0.5 టీఎంసీలు పూర్తిగా ఖాళీ అయ్యింది.
22 అడుగులకు చేరినా..
సరళాసాగర్ జలాశాయం సామర్థ్యం 22 అడుగుల వరకు నీరు చేరినా.. సైఫాన్లు తెరుచుకోలేదు. ప్రాజెక్టులోని సైఫాన్ల పక్కన ఉన్న మట్టికట్టపై చెట్లు పెరిగి కట్టబలహీనంగా మారింది. ఏదైనా మరమ్మతు చేయాలని గడిచిన నెల రోజుల నుంచి ప్రాజెక్టుకు సమీప గ్రామాల రైతులు ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా వారు అధికారులు స్పందించలేదు. రైతులు చెప్పిన వెంటనే అప్రమత్తమై ఉంటే.. ఇంత పెద్ద నష్టం జరిగేది కాదని స్థానికులు భావిస్తున్నారు.
సాగుపై తీవ్ర ప్రభావం..
ఈ ప్రాజెక్టుపై ఆధారపడి చుట్టుపక్కల 16 గ్రామాల రైతులు వ్యవసాయం చేసుకుంటారు. ప్రాజెక్టు పైభాగంలో వర్నె, ముత్యాలపల్లి, కనిమెట్ట, పాతజంగమాయపల్లి, చిలకోటినిపల్లి, బలీదుపల్లి, కన్మనూరు ఉండగా.. నిర్దేశిత ఆయకట్టు గల దిగువ ప్రాంతంలో అజ్జకొల్లు, శంకరంపేట, రామన్‌పాడ్, తిరుమలాయపల్లి, కొన్నూరు, నెల్విడి, నర్సింగాపుర్ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం గండి పడటంతో సాగునీటిపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.
రెండోసారి గండి..
వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరున ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏడు దశాబ్దాల క్రితం రూ.35 లక్షల వ్యయంతో అంతర్జాతీయ ఆటోమెటిక్ సైఫాన్ సిస్టంతో ఈ ప్రాజెక్టును నిర్మించి 1959లో ప్రారంభించారు. ఆ తర్వాత 1964లో ఒకసారి భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండి సైఫాన్స్ పక్కనే కుడివైపు కట్టకు గండిపడింది. నీటి ప్రవాహానికి కొన్నూరు, మదనాపురం గ్రామాల మధ్యలోని రైల్వేలైన్ సైతం పెకిలిపోయి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మళ్లీ 55 ఏళ్ల తర్వాత ఈసారి ఎడమవైపు సైఫాన్స్‌కు పక్కనే కట్టకు గండిపడంది.
పరిశీలించిన మంత్రి, కలెక్టర్
వనపర్తి జిల్లాకే తలమానికంగా చెప్పుకొనే సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపండిందని తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్పీ అపూర్వరావు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు సరళాసాగర్ ప్రాజెక్టు గండిపడిన ప్రదేశాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి ఎలాంటి సాంకేతిక లోపాల కారణంగా గండిపడిందో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని సూచించారు. సమీప గ్రామాల్లోని ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి గండి పడిన ప్రాంతాన్ని చూశారు. కొందరు స్థానికులు చేపలు పట్టేందుకు ఆసక్తి చూపారు.
అధికారులకు విన్నవించా..
ఇరిగేషన్ అధికారులకు సరళాసాగర్ ప్రాజెక్టు కట్ట బలహీనంగా మారింది. రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతోంది. ఒక్కసారి పర్యవేక్షణ చేయాలని గత పదిరోజుల క్రితం చెప్పాను. అధికారులు స్పందించి రెండు తూముల నుంచి నీటిని దిగువకు విడుదల చేసి కట్టకు మరమ్మతు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.– కురుమూర్తి, రైతు, శంకరంపేట, మదనాపురం మండలం